PAWAN KALYAN: పెద్దగా ఆశ్చర్యం లేదు కానీ. ఆశ్చర్యపోవాల్సిందే! టీడీపీ, జనసేన పొత్తుల వ్యవహారంపై ఇప్పుడు వినిపిస్తున్న మాటలు ఇవి. టీడీపీ, జనసేన కలసి వెళతాయన్నది అందరూ ఊహించిందే. ఐతే ఇంత త్వరగా.. అంటే ఎన్నికలకు 9 నెలల ముందే ప్రకటన వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా పొత్తు ఫైనల్ అయింది. తనకు పట్టు ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోనే.. పొత్తులపై పవన్ ప్రకటన చేయడం వెనక వ్యూహం ఉందని కొందరు అంటుంటే.. ఇంత ముందుగా ప్రకటన చేసి పవన్ కళ్యాణ్ తొందర పడ్డారని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏమైనా పవన్ ప్రకటనతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రాజకీయాల్లో ఆవేశం అసలు పనికి రాదు. యుద్ధ తంత్రం తెలిసిన వాళ్లెవ్వరూ నిర్ణయాలను అప్పటికప్పుడు తీసుకోరు. పవన్‌లో ఇలాంటి లక్షణాలు పెద్దగా కనిపించలేదు అన్నది ఇప్పుడు చాలామంది అనుకుంటున్న మాట. జైలు లోపలి నుంచి హడావిడిగా వచ్చి.. పొత్తు ఉంటుందని ఆవేశంగా ప్రకటించాల్సిన అవసరం లేదు అన్నది మెజారిటీ వర్గాల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. ఏమైనా పొత్తులపై క్లారిటీ వచ్చేసింది. ఐతే ఇప్పుడే అసలు సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. పొత్తులు కుదుర్చుకున్నంత మాత్రాన సరిపోదు. కలిసి పోటీ చేసినంత మాత్రాన గెలవడం సులువు కాదు. ఓట్లు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి బదిలీ అయితేనే విజయం సాధ్యం అవుతుంది. పార్టీ పెద్దలు కలిసినంత మాత్రాన గెలుపు దరి చేరదన్న సంగతి గతంలో అనేక ఎన్నికల్లో క్లియర్‌కట్‌గా అర్థం అయింది. ఇప్పుడు కూడా రెండు పార్టీలూ తమ ఓటు బ్యాంకు ఒకరినొకరు బదిలీ చేసుకోగలిగితేనే.. జగన్‌ను దెబ్బకొట్టడం సాధ్యం అవుతుంది. అంతేకాదు సీట్ల పంపకాల ప్రక్రియ కూడా సాఫీగా సాగాలి. ఒకరినొకరు ఓడించే పరిస్థితికి రాకుండా.. రెండు పార్టీల క్యాడర్, లీడర్లు కలిసి నడిస్తే కొంత సానుకూల ఫలితాలు సాధించే అవకాశాలు లేకపోలేదు.
మరి సీట్ల పంపకాల వ్యవహారంలో మొన్నటివరకు టీడీపీ తీరు మీద, వ్యవహారం మీద కోపంగా ఉన్న జనసైనికులు.. పవన్ ప్రకటించినంత మాత్రం అంత ఈజీగా తెలుగు తమ్ముళ్లతో కలుస్తారా.. లేదా.. అన్నది అతిపెద్ద సవాల్‌గా మారనుంది. ఇక జనసేన, టీడీపీ కలసి పోటీ చేస్తాయన్న క్లారిటీ వచ్చింది. మరి బీజేపీ వీరితో కలసి వస్తుందా.. లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ కలవకుంటే వామపక్షాలు కూడా ఈ కూటమితో నడవడం ఖాయం. ఏమైనా ఎన్నికలకు 9 నెలల ముందు నుంచే ఏపీ రాజకీయ ముఖ చిత్రంపై క్లారిటీ రావడంతో.. రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.