Pawan Kalyan: వాలంటీర్లతో జగన్ చాలా తప్పులు చేయిస్తున్నాడని, ఆయనతో చాలా డేంజర్ అని, జాగ్రత్తగా ఉండాలి అని వ్యాఖ్యానించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్‌లో వారాహి యాత్ర మూడో విడతలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
“రాష్ట్రంలో 30 వేలపైగా మహిళలు మిస్సయ్యారు. కేంద్ర నివేదికల ఆధారంగానే నేను చెప్పాను. పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి అదే చెప్పారు. ఏపీలో చైల్డ్ హ్యూమన్ ట్రాకింగ్ జరుగుతుంది. దానిలో విశాఖ ముందు ఉంది. ఏపీ గంజాయికి అడ్డాగా మారింది. విద్యుత్, పెట్రోల్ చార్జీలు పెంచారు. చెత్త మీద పన్ను వేశారు. ఆంధ్రా యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు. యూనివర్సిటీ ర్యాంక్ 76వ స్థానానికి పడిపోయింది. ఏయూని జగన్ భ్రష్టు పట్టించారు. జనసేన అధికారంలోకి రాగానే ప్రక్షాళన చేస్తాం. సింహాద్రి అప్పన్న సాక్షిగా చెబుతున్నా.. వాలంటీర్ల మీద నాకు ద్వేషం లేదు. మీ చేత జగన్ తప్పులు చేయిస్తున్నారు. ప్రజల డేటా హైదరాబాద్ వెళ్లి పోతుంది. వాలంటీర్లు చేస్తుంది రాజ్యాంగ విరుద్ధం. కొంత మంది వాలంటీర్లు అక్రమాలు, మోసాలకు పాల్పడ్డారు. వైఎస్ జగన్‌తో చాలా డేంజర్. అందరూ గ్రహించాలి. జగన్.. అన్నా, అక్కా అని పిలిపించుకున్న అధికారులంతా జైల్లో ఉన్నారు. దయ చేసి జగన్ ట్రాప్‌లో అధికారులు పడొద్దు.
జగన్‌కు మళ్లీ అవకాశం ఇవ్వొద్దు
విశాఖపట్నంలో ప్రభుత్వ కార్యాలయాలు, భూములను ప్రభుత్వం తాకట్టు పెట్టింది. అభివృద్ధి చేయకుండా అప్పులు చేస్తే ఏం ప్రయోజనం. జగన్ నాయకుడు కాదు.. ఒక వ్యాపారి. అన్నింటిలో వాటాలు కొట్టేయడం ఆయనకు అలవాటుగా మారింది. జగన్‌కి డబ్బు పిచ్చి పట్టింది.. దోపిడి చేసిన వారు బాగుపడరు. జగన్ మీద కన్ను వేయకపోతే ముక్క మిగలదు. 2024 ఎన్నికల్లో జగన్‌కి మళ్లీ అవకాశం ఇవ్వొద్దు. “కాలం చాలా గొప్పది. రంగు రుచి ఉండదు. కాలం ముందు ఎవరైనా మోకారిల్లాలిసిందే” అని గద్దర్ చనిపోయే ముందు చెప్పారు. ప్రాణాలు తెగించే పోరాటానికి ఈ సిద్ధమయ్యాను. పొట్టి శ్రీరాములు గుర్తు లేదు. కానీ, వైఎస్సార్ గుర్తు ఉంటాడు. ముప్పై మంది ఎమ్మెల్యేలు పాలిస్తాము అంటే చొక్కా పట్టుకుని మీ బానిసలు కాదు అని చెప్తాము.
వైసీపీని ఉత్తరాంధ్ర నుంచి తరిమేసే వరకు జనసేన పోరాటం చేస్తుంది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకునే వారిని గద్దెనెక్కించారు. దోచుకున్న వారి విగ్రహాలు పెట్టిస్తారు. తెలంగాణ రావడానికి జగన్ కారణం. రుషి కొండను ఎలా తవ్వేశారు..? ఎర్ర మట్టి దిబ్బలు చెక్కేశారు. పది మంది దోచేస్తున్నారు. మనకి ఎందుకు ధైర్యం లేదు..? మీరు పెట్టిన పరీక్షకు నేను నిలపడ్డాను. ఓడిపోయినా సరే నన్ను విశాఖ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. గత పర్యటనలో మీరు లేకపోతే వైజాగ్‌లో నన్ను ఏమైనా చేసే వారు. ఈ నేల కోసం ప్రాణాలు తెగించే వారు కావాలి. నేను ఉన్నాను” అంటూ పవన్ వ్యాఖ్యానించారు.