Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ రాజకీయ బోనులో చిక్కుకుపోయాడా? ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితి లేదా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. టీడీపీతో కలిసి వెళ్లాలని పవన్ ప్లాన్. కానీ, దీనికి బీజేపీ అంగీకరించడం లేదు. తమతో మాత్రమే పొత్తులో ఉండాలని, టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పేసింది. అలాగని బీజేపీని వదిలి టీడీపీతో వెళ్తే మోదీకి, ఆ పార్టీకి దూరమై రాజకీయంగా చిక్కుల్లో పడొచ్చు. పోనీ బీజేపీతోనే ఉండిపోదామంటే ఆ పార్టీకి ఏపీలో పెద్దగా బలంలేదు. జనసేన ఎదుగుదలకు బీజేపీ ఎంతమాత్రం ఉపయోగపడదు. ఈ పరిస్థితిలో పవన్ పరిస్థితేంటి? ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉండిపోయాడు పవన్.
మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీలో అటు పార్లమెంటుకు, ఇటు అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికల జరుగుతాయి. ఆ లోపే ఏ పార్టీ పొత్తు ఎవరితోనో తేల్చుకుంటే ఇప్పటినుంచే ఒక స్పష్టతతో, లక్ష్యంతో ముందుకెళ్లొచ్చు. కానీ, ఆ స్పష్టతే కొరవడింది జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు. ఇటు బీజేపీ.. అటు టీడీపీ.. మధ్యలో జనసేన అన్నట్లుంది పార్టీ పరిస్థితి. రెండింటినీ వదిలేసి ఒంటరిగానూ వెళ్లలేడు. ఇప్పుడేం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉండిపోయారు పవన్.
బీజేపీ నిర్ణయం వల్లే
2014లో జనసేన స్థాపించిన తర్వాత కేంద్రంలో బీజేపీకి, ఏపీలో టీడీపీకి పవన్ మద్దతు ప్రకటించారు. అప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేదు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. తదనంతర పరిణామాల నేపథ్యంలో పవన్ అటు బీజేపీని, ఇటు టీడీపీని వ్యతిరేకించి రెండు పార్టీలకు దూరమయ్యారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది జనసేన. తర్వాత మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు. ఇప్పుడు రెండు పార్టీలూ తాము పొత్తులో ఉన్నట్లు చెప్పుకొంటున్నాయి. మరోవైపు టీడీపీతో కలిసేందుకు పవన్ ఆసక్తి చూపుతున్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కలిస్తే అధికారం గ్యారెంటీ అని పవన్ భావిస్తున్నారు. ఇక్కడే వచ్చింది చిక్కు..! టీడీపీతో కలిసేందుకు బీజేపీ ఒప్పుకోవడం లేదు. జనసేన, బీజేపీ మాత్రమే కలిసి పోటీ చేస్తాయని బీజేపీ పెద్దలు తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడేం చేయలో తెలియని స్థితిలో పవన్ ఉన్నారు. బీజేపీతో మాత్రమే కలిసి పోటీ చేస్తే పెద్దగా ఉపయోగం లేదు. ఆ పార్టీకి క్యాడర్ లేదు. అలాగని ఆ పార్టీని వదిలేసి టీడీపీ వైపు వెళ్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, మోదీకి దూరం కావాల్సి వస్తుంది. పైగా ఇప్పుడున్న వేవ్ చూస్తుంటే కేంద్రంలో కూడా మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం పక్కా. అందుకే బీజేపీని వదలలేక.. టీడీపీవైపు వెళ్లలేక.. పవన్ సతమతమవుతున్నారు.
ఒంటరిగా పోటీ చేస్తే
పోనీ ఒంటరిగా పోటీ చేద్దామంటే జనసేన కూడా అంత బలంగా లేదు. సరైన క్యాడర్, నేతలు లేకపోడంతో అనేక చోట్ల పార్టీ చాలా బలహీనంగా ఉంది. పైగా ఆర్థిక వనరులు తక్కువ. మీడియా మద్దతూ లేదు. అందుకే ఈ సమయంలో ఒంటరిగా వెళ్లే సాహసం చేయలేకపోతున్నాడు. ప్రస్తుతం పవన్ ఎదుర్కొంటున్న పరిస్థితికి సరైన పరిష్కారం.. టీడీపీతో కలిసేందుకు బీజేపీ అంగీకరించడం ఒక్కటే. కానీ, ఆ పరిస్థితి లేదని తాజా పరిణామాల్ని చూస్తే అర్థమవుతోంది. ఇదంతా పవన్ తాను సొంతంగా ఎదగడంపై దృష్టి పెట్టకుండా బీజేపీతోనో లేదా టీడీపీతోనే కలిసి ఎదగాలనుకోవడం వల్ల వచ్చిన సమస్యే. పార్టీ పెట్టిన తొమ్మిదేళ్లలో జనసేనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పవన్ విఫలమయ్యాడు. ఒకవేళ ఇప్పటికే జనసేన బలంగా మారి ఉంటే పవన్ నిర్ణయానికి విలువ ఉండేదేమో. ఈ పరిస్థితుల్లో పవన్ ఏ నిర్ణయం తీసుకుంటాడు అనేది రాజకీయ విశ్లేషకుల్ని తొలచివేస్తున్న ప్రశ్న. బీజేపీతోనే ఉండటమా.. లేదా టీడీపీతో కలిసి వెళ్లటమా.. అదీకాక ఒంటరిగా వెళ్లడమా? వీటికి కాలమే సమాధానం చెప్పాలి.