Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తనను తాను విప్లవకారుడిగా అభివర్ణించుకుంటారు. సభలు, సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తుంటారు. తానో విప్లవకారుడినని, ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని చెబుతుంటారు. అయితే, ఇదే అంశంపై జనాలు ఆశ్చర్యపోతున్నారు. పవన్ విప్లవకారుడు ఎప్పుడయ్యాడు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి మాటల ద్వారా పవన్ ప్రజల్లో చులకన అయ్యే అవకాశం ఉంది.
పవన్ ప్రసంగాల్లో గతంతో పోలిస్తే మంచి పరిణతి కనిపిస్తోంది. ఎవరిపైనా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయరు. దూషణల వరకు వెళ్లకుండా చాలా వరకు హుందాగానే మాట్లాడుతారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రసంగం సాగుతుంది. అయితే, కొన్నిసార్లు పవన్ తనగురించి తాను గొప్పగా చెప్పుకొంటారు. తన తండ్రి కమ్యూనిస్టు భావాలతో పెంచారని, ఆయన నుంచి విప్లవ భావాలు వచ్చాయని చెప్పుకొంటూ ఉంటారు. తాను కూడా విప్లవకారుడినే అని చెబుతూ చెగువేరా గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. వైసీపీ కుట్రలకు భయపడను అని, ప్రాణాలకు తెగించే రాజకీయాల్లోకి వచ్చాను అని చెబుతుంటారు. ఈ వ్యాఖ్యలు మరీ అతిగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. విప్లవ కారుడు అంటే ప్రజల కోసం పోరాటాలు చేయాలి. ప్రజల్లో చైతన్యం తీసుకురాగలగాలి. స్పష్టమైన లక్ష్యం, ఎజెండాతో ముందుకెళ్లాలి. అయితే, ఇలాంటి పనులేవీ పవన్ చేయలేదు.
ఒక రాజకీయ పార్టీ పెట్టి, దాని ద్వారా అధికారం దక్కించుకుని, ప్రజలకు సేవ చేయాలి అనుకుంటున్నాడు. అంతమాత్రానికే తనను తాను విప్లవకారుడిగా భావించడంపై కొందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఏ విప్లవం చేశారని ప్రశ్నించారు..? ఏ పోరాటంలో పాల్గొన్నారని అడుగుతున్నారు. మావోయిస్టులతో కలిసి తిరిగాడా? రష్యా విప్లవంలో పాల్గొన్నాడా? సెకండ్ వరల్డ్ వార్‌లో పోరాడాడా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల పవన్ జనంలో చులకన కావడం గ్యారెంటీ. ఇప్పటికే వాలంటీర్ల విషయంలో చేసిన వ్యాఖ్యల వల్ల విమర్శలు ఎదుర్కొంటున్న పవన్ కల్యాణ్.. ఇకపై చేసే వ్యాఖ్యల విషయంలోనైనా అప్రమత్తంగా ఉండాలి. విప్లవకారులతో పోల్చుకోవడం తగ్గించాలి. రాజకీయంగా చేసే పోరాటాలు, విప్లవోద్యమాలకు ఉన్న తేడాను గుర్తిస్తే ఇలాంటి అవసరం ఉండదు.