ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో అస్సలు అర్థం కావట్లేదు. అధికార వైసీపీ ఇప్పటికే తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని తేల్చేసింది. దీంతో వైసీపీని ఎదుర్కొనేందుకు ఏఏ పార్టీలు కలుస్తాయనేది అంతు చిక్కడం లేదు. టీడీపీతో కలసి వెళ్లాలని జనసేన ప్రయత్నిస్తోంది. అయితే జనసేన తమవైపే అంటోంది బీజేపీ. టీడీపీ మాత్రం వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోంది. దీంతో ఎవరు ఎవరితో కలుస్తారో.. అసలు కలుస్తారో.. కలవరో కూడా అర్థం కావట్లేదు. వచ్చే ఏడాది మేలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కనీసం ఈ ఏడాది చివరి నాటికి పొత్తులపై నిర్ణయం తీసుకోవాలని పార్టీలు భావిస్తున్నాయి.
జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కార్ ను ఎలాగైనా గద్దె దించాలనే పట్టుదలతో ఉన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అందుకోసం ఎవరితోనైనా కలిసి పని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని స్పష్టం చేశారు. అలా జరగాలంటే కచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలి. టీడీపీతో కలిసి పని చేసేందుకు జనసేన సిద్ధంగా ఉంది. టీడీపీ కూడా రెడీ అంటోంది. అయితే బీజేపీ మాత్రం టీడీపీతో కలిసేందుకు సిద్ధంగా లేదు. కానీ జనసేనతో ఆల్రెడీ మేం కలిసే ఉన్నాం కదా అంటున్నారు ఆ పార్టీ నేతలు. మూడు పార్టీలు కలిస్తే ఓకే.. లేకుంటే ఇబ్బంది పడతామనుకుంటున్నారు పవన్ కల్యాణ్.
బీజేపీని కూడా టీడీపీతో కలిసేలా చేసేందుకు పవన్ కల్యాణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మొన్న ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశం సందర్భంగా కూడా పవన్ ఇదే విషయాన్ని చెప్పారు. కానీ బీజేపీ మాత్రం టీడీపీతో కలిసేందుకు ససేమిరా అంటోంది. మరోవైపు టీడీపీ కూడా బీజేపీతో కలిసి పనిచేసేందుకు ఇంతకు ముందు ఉన్నంత ఉత్సాహం చూపించట్లేదు. బీజేపీపై వ్యతిరేకత అధికమవుతోందని.. కాబట్టి ఎన్నికల తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి ఆలోచించడం బెటర్ అనుకుంటున్నారు చంద్రబాబు. దీంతో పవన్ కల్యాణ్ డైలమాలో పడుతున్నారు. బీజేపీ ఏమో పవన్ ను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. జనసేనానికేమో చంద్రబాబు లేకుంటే కష్టమనుకుంటున్నారు. మరి ఈ పొత్తుల ఎత్తులు ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో చూడాలి.