Pawan Kalyan: పొత్తులపై క్లారిటీ ఇవ్వనున్న పవన్.. ముహూర్తం ఫిక్స్ !

మచిలీపట్నం సభలో పార్టీపరంగా కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించడంతో పాటు... పొత్తుల పైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా జనసేన వర్గాలు అభిప్రాయపడుతున్నాయ్. పొత్తుపై ప్రకటన చేయడం ద్వారా.. బీజేపీ తమతో కలిసి వస్తే సరే... లేదంటే తమ దారి తాము చూసుకుంటామనే సంకేతాలను పవన్ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - March 7, 2023 / 02:50 PM IST

వదలుకోవద్దని వాళ్లు.. వదలకుండా పట్టుకోవాలని వీళ్లు.. జనసేన చుట్టూ టీడీపీ, బీజేపీ వ్యూహాలు ఇలానే కనిపిస్తున్నాయ్ ఇప్పుడు ! అధికారం కోసం ఓ పార్టీది పోరాటం అయితే.. అంగబలం పెంచుకోవడం కోసం మరో పార్టీది ఆరాటం. ఇద్దరికీ ఇప్పుడు సేనే కీలకం అవుతోంది. ఐతే సేనాని మాత్రం ఎవరు వైపు ఉంటారు.. ఎంతవరకు ఉంటారనేది క్లారిటీ ఇవ్వడం లేదు. పొత్తుల విషయంలో మౌనంగానే కనిపిస్తున్నారు. గట్టిగా అడిగితే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కదా అప్పుడు నిర్ణయం తీసుకుందామని అంటున్నారు. దీంతో సీన్ మరింత ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కొనసాగుతోంది. ఐతే ఎన్నికల నాటికి టీడీపీతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో పవన్ ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనిచ్చేది లేదంటూ పవన్ గతంలో ప్రకటించడం… టీడీపీలో ఆశలు పెంచింది. ఐతే పొత్తుల విషయంలో ఏ క్లారిటీ ఇవ్వకపోవడంతో… టీడీపీ డైలమాలో పడింది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ నెల 14న మచిలీపట్నంలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభను.. టీడీపీ, బీజేపీ ఆసక్తిగా గమనిస్తున్నాయ్. ఈ సభ ఏర్పాటు కంటే రెండురోజుల ముందే… పవన్ అమరావతి చేరుకుంటారు. అక్కడ పార్టీ నేతలతో అనేక అంశాలపై విస్తృతంగా మంతనాలు చేస్తారు.

మచిలీపట్నం సభలో పార్టీపరంగా కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించడంతో పాటు… పొత్తుల పైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా జనసేన వర్గాలు అభిప్రాయపడుతున్నాయ్. ప్రస్తుతం బీజేపీతో పొత్తు ఉన్నా… జనసేన దూరంగానే ఉంటోంది. పొత్తుపై ప్రకటన చేయడం ద్వారా.. బీజేపీ తమతో కలిసి వస్తే సరే… లేదంటే తమ దారి తాము చూసుకుంటామనే సంకేతాలను పవన్ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.