PAWAN KALYAN: టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం భేటీ అయ్యారు. ఇటలీ నుంచి రాగానే నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్లారు పవన్. ఆయనతోపాటు జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా చంద్రబాబు ఇంటికి వెళ్లారు. దాదాపు గంటన్నర పాటు చంద్రబాబు, పవన్ మధ్య భేటీ జరిగింది. ఏపీలో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఈ భేటీలో కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించాయి.
ఇందులో భాగంగా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, సీట్ల పంపకాల విషయంలో కూడా కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ముందు మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసి తరువాత పూర్తి స్థాయిలో మేనిఫెస్టో రిలీజ్ చేయాలనే ప్రపోజల్‌ను జనసేన పెట్టినట్టు తెలుస్తోంది. ఇదే విషయంలో మరోసారి చంద్రబాబుతో పవన్ భేటీ కాబోతున్నారు. అయితే టీడీపీ మాత్రం మినీ మేనిఫెస్టో విషయంలో సుముఖంగా లేదని.. కాస్త ఆలస్యమైనా పూర్తి స్థాయిలో మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకే చంద్రబాబు ఆసక్తి చూపినట్టు టాక్. చంద్రబాబు పవన్ మరోసారి భేటీ అయిన తరువాత మేనిఫెస్టో విషయంలో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇక బెయిల్‌కి సంబంధించి కూడా ఈ భేటీలో చంద్రబాబు.. పవన్‌కు కొన్ని కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అనారోగ్య కారణాల వల్ల కండిషనల్ బెయిల్‌పై చంద్రబాబు బయటికి వచ్చారు. నాలుగు వారాలు మాత్రమే ఆయన బయట ఉండబోతున్నారు. ఈ గ్యాప్‌లోనే మరో రెండు కేసులు నమోదు చేసింది సీఐడీ.
ఈ బెయిల్ అనంతరం మిగిలిన కేసుల్లో కూడా విచారణ జరిగే అవకాశముంది. ఒకవేళ వేరే కేసుల్లో చంద్రబాబు మరోసారి జైలుకు వెళ్లినా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి అనే విషయంలో కీలకంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయం వరకూ చంద్రబాబు జైల్లో ఉన్నా రెండు పార్టీలు ఎలంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ వ్యూహంతో ముందుకు వెళ్లాలో భేటీలో చర్చించారు. చంద్రబాబుతో మరోసారి భేటీ అయిన తరువాత రెండు పార్టీ పూర్తి స్థాయిలో తమ నిర్ణయాలు ప్రకటించే చాన్స్ ఉంది.