Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్ టార్గెట్ ఫిక్స్ అయిపోయింది. 2024లో ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్న పవన్.. ఇకపై పూర్తిగా మంగళగిరిలోనే ఉండబోతున్నారు. అక్కడ్నుంచే రాజకీయాన్ని నడపబోతున్నారు.
జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవలే రెండు విడతల్లో వారాహియాత్ర నిర్వహించారు. త్వరలో మరోసారి జనంలోకి వెళ్లబోతున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్, రూట్‌మ్యాప్ దాదాపు ఖరారైంది. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఉభయగోదావరి జిల్లాలపైనే పవన్ ఫోకస్ చేయబోతున్నారు. రాజకీయంగా ఈ ఏడాది ఎంత కీలకమో తెలిసిన పవన్.. ఇకపై పూర్తి స్థాయిలో మంగళగిరి పార్టీ కార్యాలయం కేంద్రంగా పాలిటిక్స్ చేయబోతున్నారు. మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో పవన్ ఉండటానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. బెడ్‌రూమ్, హాల్‌ను పవన్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. పార్టీ కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా ఇప్పటికే అక్కడకు చేరుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారికి కూడా గదులు కేటాయించారు. ఏ కార్యక్రమంలో పాల్గొన్నా అది పూర్తైన వెంటనే పవన్ ఇప్పటివరకూ హైదరాబాద్ వచ్చేవారు.
కానీ ఇకపై మంగళగిరి ఆఫీసుకే వెళతారు. వారాహి యాత్రకు బ్రేక్ వచ్చినా తిరిగి అక్కడికే చేరుకుంటారు. ప్రస్తుతం పవన్ సినిమాలకు తక్కువ సమయం కేటాయిస్తున్నారు. చాలా షూటింగ్‌లు పెంటింగ్‌లో ఉండిపోయాయి. సాధ్యమైనంత వరకు వాటిని ఎన్నికలు ముగిసేవరకూ వాయిదా వేయాలని ఆయన భావిస్తున్నారు. తక్కువ షూటింగ్ పెండింగ్ ఉన్న వాటిని మాత్రం పూర్తి చేస్తారు. అలా షూటింగ్స్ కోసం వెళ్లినా తిరిగి మంగళగిరే వెళ్లాలని, కొన్నిరోజులు హైదరాబాద్ మర్చిపోవాలని పవన్ డిసైడయ్యారు.
వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే రాజకీయంగా నిలదొక్కుకోలేమని పవన్‌కు తెలుసు. అందుకే ఈసారి కొన్ని సీట్లైనా నెగ్గి రాజకీయ భవిష్యత్తును నిలుపుకోవాలని భావిస్తున్నారు. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన కాస్త బలంగా కనిపిస్తోంది. వారాహి యాత్రకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. గతంలో పవన్‌ను అంతగా నమ్మని కాపులు ఈసారి మాత్రం ఆయనవైపే ఉన్నారని ఇంటెలిజెన్స్ సర్వేలు కూడా ప్రభుత్వానికి చేరవేశాయి. కాబట్టి ఈసారి కొన్ని సీట్లైనా గెలిచి కింగ్ మేకర్ కావాలని పవన్ ఆశిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా రాజకీయం నడపడం కష్టం కాబట్టి మంగళగిరిలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.
పవన్‌పై అధికార పార్టీ నేతలు పదేపదే విమర్శలు చేస్తున్నారు. సినిమాబ్రేక్‌లో రాజకీయాలు చేస్తున్నాడంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇకపై పూర్తి స్థాయిలో పాలిటిక్స్ నడపాలన్నది పవన్ ఆలోచన. ఈ 10 నెలలు జనంలోనే ఉండాలని భావిస్తున్నారు. దీనిద్వారా వైసీపీ నేతలకు కౌంటర్ కూడా ఇచ్చినట్లు అవుతుందన్నది ఆయన ఆలోచన. పార్టీ నేతలను కలవడానికి కూడా మంగళగిరి అయితేనే వీలుగా ఉంటుంది. ఇవన్నీ ఆలోచించే పవన్ కొన్నాళ్లు మంగళగిరిలోనే మకాం వేయాలని డిసైడయ్యారు.