Pawan Kalyan: పొత్తులపై మాట్లాడొద్దు.. జనసేన శ్రేణులకు పవన్ ఆదేశం.. టీడీపీని కాళ్లబేరానికి తెచ్చేందుకేనా!

జనసేన పొత్తు.. ఏపీలో గెలుపు-ఓటములను ప్రభావితం చేయగలదు. అందుకే పొత్తుల విషయంలో పవన్ కల్యాణ్ కచ్చితంగా ఏదో ఒక అంచనాకు వచ్చే ఉంటారు. మరికొంతకాలం వేచి చూసి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

  • Written By:
  • Publish Date - April 25, 2023 / 05:50 PM IST

Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో ఎక్కువ మందిని వేధిస్తున్న ప్రశ్న జనసేన పొత్తు ఎవరితో అనే. ఎందుకంటే పవన్ నిర్ణయంపైనే ఏపీ రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి. వైసీపీ ఎలాగూ ఒంటరిగానే వెళ్తుంది. టీడీపీ తమతో ఏ పార్టీ కలిసొచ్చినా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉంది. జనసేన తమతోనే ఉండాలని… అవసరమైతే బీజేపీ కూడా రావాలని ఆశిస్తోంది. కానీ, జనసేన టీడీపీ వైపు వెళ్లకుండా బీజేపీ అడ్డుకుంటోంది. జనసేనకు టీడీపీతో కలిసి పోటీ చేయాలనుంది. ఈ నేపథ్యంలో జనసేన బీజేపీతోనే ఉంటుందా? లేక టీడీపీతో కలుస్తుందా? ఈ రెండూ కాకుండా ఒంటరిగా పోటీ చేస్తుందా? అన్నదే తేలాలి. ఎందుకంటే జనసేన-టీడీపీ కలిస్తే అధికారం దక్కించుకునే అవకాశాలున్నాయి. ఈ రెండింటికీ బీజేపీ తోడైతే ఇక అడ్డేలేదు. కానీ, ఈ పరిస్థితులు కనిపించడం లేదు. పవన్ పొత్తుల విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? లేక వ్యూహాత్మకంగానే మౌనం పాటిస్తున్నారా? పొత్తులపై పవన్ మాట్లాడకపోవడానికి కారణమేంటి?
మరో ఏడాదిలోనే ఏపీలో ఎన్నికలు. పార్లమెంటుకు, అసెంబ్లీకి కలిపి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ లోపే పార్టీలన్నీ పోటీకి సిద్ధం కావాలి. అధికార వైసీపీకి ఈ విషయంలో సమస్య లేదు. ఒంటరిగానే పోటీ. అభ్యర్థులు కూడా దాదాపు ఖరారయ్యారు. ఇంకొన్ని చోట్ల మాత్రమే లెక్కలు తేలాలి. కానీ, టీడీపీ, జనసేన పరిస్థితి మాత్రం దీనికి భిన్నం. ఒంటరిగా పోటీ చేస్తే ఏ పార్టీకి సరైన మెజారిటీ వచ్చే అవకాశం లేదు. పైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి, అది వైసీపీకే మేలు చేస్తుంది. అందుకే వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయాలనుకుంటున్నాయి. ఇప్పటికే జనసేన-బీజేపీ మధ్య ఒప్పందం ఉంది. ఇక్కడే వచ్చింది చిక్కు.

జనసేనతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమే కానీ.. టీడీపీతో కలిసేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. మూడూ కలిసి కూటమిగా పోటీ చేయడానికి ఆ పార్టీ అధినాయకత్వం ఒప్పుకోవడం లేదు. ఈ విషయంలో రెండు పార్టీలను కలిపేందుకు పవన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పొత్తుల వ్యవహారం ఇంక తేలలేదు. అలాగని బీజేపీతో ఉంటే జనసేనకు పెద్దగా లాభం లేదు. పోనీ.. బీజేపీని వదిలి టీడీపీతోనూ వెళ్లలేడు. ఎందుకంటే కేంద్రంలో మరోసారి బీజేపీకి అధికారం ఖాయం. దీంతో బీజేపీని దూరం చేసుకుంటే రాజకీయంగా అనేక చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బీజేపీతో ఉండలేక.. టీడీపీవైపు వెళ్లలేక పవన్ సతమతమవుతున్నాడు. పొత్తుల విషయం ఇంకా ఎటూ తేలకపోవడంతో పార్టీ శ్రేణుల్లోనూ గందరగోళం నెలకొంది.


మౌనం దేనికి సంకేతం? పవన్ వ్యూహం ఏంటి?
మొన్నటివరకు బీజేపీతోనే కలిసున్నామని చెప్పుకొన్నాయి జనసేన వర్గాలు. భవిష్యత్తులో టీడీపీతో కలిసే అవకాశాన్ని కొట్టిపారేయలేం అన్నట్లు వ్యాఖ్యానించాయి. ఇప్పుడు మాత్రం పొత్తుల విషయంలో జనసేన మౌనం పాటిస్తోంది. ఈ విషయంలో పవన్ తన పార్టీ శ్రేణులను ఆదేశించారని తెలుస్తోంది. పొత్తుల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకునే వరకు పార్టీ తరఫున ఎలాంటి తొందరపాటు అభిప్రాయాలు వెల్లడించవద్దని ఆయన కోరారు. దీంతో జనసేన పొత్తులపై ఏమీ మాట్లాడటం లేదు. అసలు పొత్తులపై పవన్ వ్యూహం ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవన్ నిర్ణయం కచ్చితంగా ఏపీ రాజకీయాలను ప్రభావితం చేయగలదు. అందువల్లే ఆయన నిర్ణయం కోసం అన్ని పార్టీలూ ఎదురుచూస్తున్నాయి. టీడీపీనే కాదు.. వైసీపీ కూడా ఈ విషయంలో ఆసక్తిగా ఉంది.
టీడీపీని కాళ్లబేరానికి తెచ్చేందుకేనా?
జనసేన పొత్తు.. ఏపీలో గెలుపు-ఓటములను ప్రభావితం చేయగలదు. అందుకే పొత్తుల విషయంలో పవన్ కల్యాణ్ కచ్చితంగా ఏదో ఒక అంచనాకు వచ్చే ఉంటారు. మరికొంతకాలం వేచి చూసి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. పవన్ కోరిన రోడ్ మ్యాప్ బీజేపీ ఇచ్చిందా? దీని ప్రకారమే పవన్ ప్రస్తుతం మౌనం పాటిస్తున్నారా? లేక టీడీపీని తన కాళ్ల దగ్గరకు తెచ్చుకునే ఎత్తుగడ ఏమైనా ఉందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ఇప్పటికే తన వైఖరి స్పష్టం చేసింది. కాబట్టి, టీడీపీతో జనసేన కలిసి వెళ్లాలంటే ఆ పార్టీ తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే ముఖ్యమంత్రి పదవి, అత్యధిక సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి అంగీకరించిన పక్షంలోనే ఆయన టీడీపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధమవ్వొచ్చు.

కానీ, జనసేన డిమాండ్లకు చంద్రబాబు ప్రస్తుతానికి అంగీకరించే అవకాశం లేదు. అలాగని టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే గెలుస్తుందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అందుకే జనసేన తమతో రావాలని.. తాము ఇచ్చిన సీట్లు మాత్రమే తీసుకుని సర్దుకుపోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇలాగైతే తాను నష్టపోతానని భావించిన పవన్ ఎన్నికలలోపు వాస్తవ పరిస్థితులు టీడీపీకి అర్థమయ్యేలా చేసి, తన డిమాండ్లు నెరవేర్చుకోవాలని పవన్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ సారి కూడా టీడీపీ ఓడిపోతే తిరిగి కోలుకోవడం కష్టం. జనసేన అధికారంలోకి రాకున్నా.. తర్వాతి ఎన్నికలలోపు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగొచ్చు. అందుకే పవన్ ప్రస్తుతం మౌనంగా ఉంటూ పరిస్థితుల్ని అంచనా వేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.