ఆవేశం మాత్రమే కనిపించేది పవన్‌లో ఒకప్పుడు ! ఇప్పుడు రాజకీయ ఆలోచన కనిపిస్తోంది. 8ఏళ్ల రాజకీయ అనుభవం నేర్పింది అదే ! అందుకే పొలిటికల్ డెసిషన్ ఏదైనా పక్కాగా తీసుకుంటున్నారు. ఆ క్షణంలో.. అలా ఆవేశంలో ఏ మాట అనడం లేదు.. ఏ మాట ఇవ్వడం లేదు.. పవన్ గురించి ఇప్పుడు జనం, రాజకీయాలు మాట్లాడుకుంటున్న మాట ఇదే !
జగన్‌ను ఓడించడమే లక్ష్యంగా యుద్ధం మొదలుపెట్టిన పవన్.. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని ఓడించాలని ఫిక్స్ అయ్యారు. దీనికోసం కొత్త రాజకీయ సమీకరణాలు తెరమీదకు తీసుకువస్తున్నారు. షూటింగ్‌లకు గ్యాప్ ఇచ్చి.. మంగళగిరి చేరుకున్న పవన్.. బీసీ నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త పొలిటికల్ ఈక్వేషన్ తెరమీదకు తీసుకువచ్చారు. కాపులు, బీసీలు కలిస్తే.. రాజ్యాధికారం మనదే అని.. ఎవరినీ దేహీ అనాల్సిన అవసరం లేదని అన్నారు. బీసీల డిమాండ్లను కాపులతో చర్చిస్తానని అంటున్నారు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. సామాజిక సమీకరణాలపై పవన్ పక్కాగా ఫోకస్ చేసినట్లు కనిపిస్తున్నారు. కాపులకు మాత్రమే తను నాయకుడు అనే ముద్ర జనాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. జనసేన ఒక్కవర్గానికి మాత్రమే చెందిన పార్టీ అనే మాట రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే సమయంలో వైసీపీ బలంపై కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ ఓటు బ్యాంక్‌ను వైసీపీ ఓన్ చేసుకుంది. దాన్ని సొంతం చేసుకునే ప్లాన్‌లో జనసేనాని ఉన్నట్లు కనిపిస్తున్నారు. నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలంటూ.. ప్రతీ సభలో చెప్తున్న జగన్,.. వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు టీడీపీ బీసీలు తమతోనే అంటూ చెప్పుకొస్తోంది.
ఈ రెండింటిని కాదని.. బీసీల మనసు గెలిచేలా పవన్ వ్యూహాలు రచిస్తున్నారు. బీసీల ఆర్థిక పరిపుష్టతకు, బీసీల అభివృద్ధికి అవసరం అయితే ఒకరోజు దీక్ష అనేది అందుకే ! ఇక అదే సమయంలో కాపులకు జారిపోకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఏమైనా కాపులు, బీసీలు కలవాలంటూ పవన్ తీసుకొచ్చిన కొత్త ఈక్వేషన్స్ వైసీపీలో కొత్త చర్చకు కారణం అవుతున్నాయ్.