PAWAN KALYAN: వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారన్న ప్రచారంతో వైసీపీ అలర్ట్ అయినట్లు కనిపిస్తోంది. పిఠాపురం వైసీపీ ఇంచార్జిగా ఉన్న వంగా గీతను సీఎం పిలిపించారు. పిఠాపురంలో పవన్‌కు ధీటుగా ఉండే మరింత బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు.. వంగా గీతకు వేరే నియోజకవర్గం అప్పగించే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. పిఠాపురంలో పవన్ పోటీ చేస్తే.. ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరాలని వైసీపీ కసి మీద కనిపిస్తోంది.
పిఠాపురం నియోజకవర్గంలో కాపు ఓటర్లు దాదాపు 91వేల మంది ఉన్నారు. దీంతో అదే సామాజికవర్గానికి చెందిన మరో నేత కోసం వైసీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పిఠాపురంలో పవన్‌కు చెక్ పెడితే చుట్టూ ఉన్న నియోజకవర్గాల్లోనూ జనసేనను కంట్రోల్ చేయొచ్చన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. కాకినాడ రూరల్ నియోజకవర్గం, కాకినాడ ఎంపీ నుంచి కూడా జనసేనే పోటీ చేయబోతోంది. పిఠాపురం నుంచి బరిలోకి దిగితే.. ఆ ప్రభావంతో కాకినాడ రూరల్, ఎంపీ స్థానం కూడా ఈజీగా గెలవచ్చని జనసేన వ్యూహాలు రచిస్తుంటే.. దానికి వైసీపీ రివర్స్ ఇంజనీరింగ్ మొదలుపెట్టిందని.. అందుకే వంగా గీతను జగన్ పిలిపించారనే ప్రచారం జరుగుతోంది. పిఠాపురంలో పవన్‌ను కంట్రోల్ చేస్తే.. మిగిలిన ఆ రెండు స్థానాల్లోనూ ఏ ఢోకా ఉండదని.. అధికార పార్టీ భావిస్తోందనే టాక్ వినిపిస్తోంది. పవన్ పోటీ చేయబోతున్నారన్నది ప్రస్తుతానికి ప్రచారం మాత్రమే.
అయినా సరే వైసీపీ ముందుగానే అప్రమత్తం అయింది. జెండా సభ తర్వాత.. పవన్ మీద వైసీపీ మరింత నజర్ పెంచినట్లు కనిపిస్తోంది. వంగా గీతను పిలిపించిన సీఎం జగన్.. ఏం చెప్పారు.. ఎలాంటి సూచనలు చేశారు.. వైసీపీ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో కనిపిస్తోంది. పిఠాపురం చుట్టే ఇప్పుడు చర్చ అంతా వినిపిస్తోంది.