Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి విజయయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈసారి విశాఖపట్నం నుంచి వారాహి యాత్ర ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా యాత్ర ఏర్పాట్లపై సమీక్షించేందుకు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ విశాఖ జిల్లా జనసేన నేతలతో గురువారం సమావేశమయ్యారు. యాత్ర విజయవంతం చేయాల్సిందిగా జనసేన నేతలకు సూచించారు. పవన్ కళ్యాణ్ మూడో విడత యాత్రకు విశాఖపట్నంను ఎంచుకోవడం వెనుక ప్రత్యేక కారణాలున్నాయి.
ఉత్తరాంధ్రలో జనసేనకు బాగా పట్టుందని భావిస్తున్న జిల్లాల విశాఖపట్నం. ఇక్కడి నుంచి జనసేనకు విజయావకాశాలు ఈసారి ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్న మాట. అందుకే విశాఖపట్నం ఉమ్మడి జిల్లాపై పవన్ స్పెషల్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో పవన్ ఇక్కడి గాజువాక నుంచే పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ పవన్ విశాఖపై తన అభిమానం, ఆశను చంపుకోలేదు. వీలైనన్నిసార్లు ఇక్కడికి వస్తూనే ఉన్నారు. గతంలో పవన్ విశాఖ వచ్చినప్పుడు జరిగిన హడావిడి గురించి తెలిసిందే. పవన్ తను బస చేస్తున్న హోటల్ నుంచి బయటకు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంది. ఆ సమయంలో జనసేన శ్రేణులు పవన్‌కు అండగా నిలిచాయి. విశాఖలో పవన్‌కు మంచి స్పందన లభించింది. మరోవైపు పవన్‌కు ఇంకా గాజువాక, విశాఖపట్నం నియోజకవర్గాలపై ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తోంది. పవన్ పోటీ చేయాలని భావిస్తున్న నియోజకవర్గాల్లో గాజువాక కూడా ఉంది.
గతంలో ఆయనకు హ్యాండ్ ఇచ్చిన స్థానిక ప్రజలు ఈసారి మాత్రం సానుకూలంగానే స్పందిస్తున్నట్లు పలు సర్వేలు తేల్చాయి. దీంతో పవన్ మరోసారి గాజువాక నుంచి పోటీ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. పైగా ఇక్కడ వైసీపీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రుషికొండను బోడికొండ చేయడంతోపాటు కబ్జాలు, బెదిరింపులతో స్తానికుల్లో వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తోంది. అదే సమయంలో పవన్, జనసేన విషయంలో సానుకూలత కనిపిస్తోంది. అందుకే ప్రస్తుతం పవన్ తనకు అత్యంత అనుకూలంగా ఉన్న జిల్లాలపైనే ఫోకస్ చేశారు. ఇతర చోట్ల గెలిచే ప్రయత్నాలు చేయడంకన్నా.. గెలిచే అవకాశాలు ఉన్నవాటిని చేజార్చుకోకూడదు అనే ఆలోచన పవన్‌లో కనిపిస్తోంది. అందుకే మొదటి రెండు విడతల యాత్ర ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సాగిన సంగతి తెలిసిందే. ఆ జిల్లాల్లో జనసేన గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
అందుకే అప్పుడు గోదావరి జిల్లాలు.. ఇప్పుడు విశాఖపై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. కాగా, విశాఖ జనసేన నేతలతో నాదెండ్ల మాట్లాడారు. త్వరలో చేపట్టనున్న మూడో విడతయాత్ర.. మునుపటికన్నా మరింత విజయం సాధించేలా చూడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ వివరాల్ని పరిశీలించారు. మూడో విడత యాత్రలో పవన్ క్షేత్ర స్థాయి పరిశీలనలు చేపట్టి, సంబంధిత ప్రజలతో సమావేశమై సమస్యలు తెలుసుకుంటారని నాదెండ్ల తెలిపారు. యాత్రలో భాగంగా విశాఖలో జనవాణి కార్యక్రమం ఉంటుంది. అలాగే నాదెండ్ల చెప్పారు.