Pawan Kalyan: నిన్నా మొన్నటి వరకు బలహీనంగా కనిపించిన జనసేన కొన్ని చోట్ల బలపడుతున్నట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు అనూహ్య స్పందన వస్తోంది. అందులోనూ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం బలంగా ఉంది. ఇంకా కష్టపడితే ఇతర జిల్లాల్లోనూ ప్రభావం చూపగల స్థాయికి చేరుకుంటుంది జనసేన. ఇదే జరిగితే ఇబ్బంది పడేది మాత్రం టీడీపీనే. ఎందుకంటే జనసేనతో కలిసి వెళ్లాలనుకుంటున్న టీడీపీకి జనసేన బలపడటం ఇష్టం లేదు. దీనివల్ల పొత్తులు, సీట్ల విషయంలో సమస్యలు రావొచ్చు.
వారాహి యాత్రకు భారీ స్పందన రావడం, ప్రజల మూడ్ తెలియడంతో ఇదే ఊపులో దూసుకెళ్లాలని పవన్ భావిస్తున్నారు. జనసేనను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. అందుకే రెండో విడత వారాహి యాత్రను ఆదివారం నుంచి ప్రారంభించబోతున్నారు. ఇకపై సినిమాలకు సాధ్యమైనంత ఎక్కువగా విరామం ఇచ్చి, రాజకీయాలకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో రాజకీయంగా వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అందుకే టీడీపీతో పొత్తు విషయంలో స్పష్టత ఇవ్వలేదు. వారాహి యాత్ర సందర్భంగా పవన్ మాట్లాడుతూ పొత్తుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటామన్నారు. సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పొత్తుల విషయంలో మండల స్థాయిలోనూ అధ్యయనం చేయాలన్నారు. గతంలో టీడీపీతోనే కాదు.. బీజేపీతో కూడా పొత్తు కోసం ప్రయత్నించారు. ఇప్పుడు బీజేపీ కలిసి వస్తుందో.. రాదో స్పష్టత లేదు.
టీడీపీలో టెన్షన్
పొత్తుల విషయంలో పవన్ ఎటూ తేల్చకపోవడంతో టీడీపీలో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే పొత్తు లేకపోతే ప్రధానంగా నష్టపోయేది టీడీపీనే. జనసేన తమతో కలిసి రావాలని టీడీపీ కోరుకుంటోంది. అదే సమయంలో తాము ఇచ్చిన సీట్లు మాత్రమే తీసుకోవాలని భావిస్తోంది. కానీ, దీనికి జనసేన సిద్ధంగా లేదు. జనసేనకు టీడీపీ 30 సీట్ల వరకు ఇవ్వాలని భావిస్తే, జనసేన మాత్రం 60 సీట్లు కావాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలోనే సీట్ల విషయంలో జనసేన బెట్టు చేస్తోంది. గతంలో జనసేన కాస్త బలహీనంగా ఉండేది కాబట్టి.. తక్కువ సీట్లతోనే సర్దుకునేది. కానీ, ఇప్పుడు జనసేన బలపడుతుండటంతో మరిన్ని అదనపు సీట్లు కోరుకుంటోంది. ఈ విషయంలో టీడీపీని వ్యూహాత్మకంగా ఇబ్బందిపెట్టేందుకే పవన్ కల్యాణ్ పొత్తుల గురించి స్పష్టంగా చెప్పడం లేదు. అవసరమైతే ఒంటరిగా వెళ్తామనే సంకేతాల్ని కూడా పంపిస్తున్నారు. దీంతో ఇప్పుడు టీడీపీ, జనసేన పొత్తుల అంశం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.