Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయంగా దూకుడు పెంచారు. వారాహి యాత్ర ద్వారా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. అధికార వైసీపీపై ఘాటైన పంచులతో విరుచుకుపడుతున్నారు. మరోవైపు తనను సీఎం చేయాలంటూ ప్రజల్ని కోరుతున్నారు. గతంలో సీఎం పదవిపై పెద్దగా ఆసక్తి ప్రదర్శించని పవన్.. ఈసారి మాత్రం తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక.. పొత్తుల విషయంలో పవన్ వైఖరి సంచలనంగా మారింది. పొత్తుల విషయంలో నిర్ణయం తీసుకోలేదని ప్రకటించడం టీడీపీని కలవరపెడుతోంది. మొన్నటివరకు టీడీపీకి మద్దతు అన్నట్లు మాట్లాడిన పవన్.. ఉన్నట్లుండి ఇలా మాటమార్చడం వెనుక వ్యూహమేంటి..? ఈ విషయంలో పవన్ క్లారిటీతో ఉన్నారా..?
సీఎం సీఎం అంటున్న ఫ్యాన్స్
పవన్ కల్యాణ్‌ను సీఎంగా చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. దీనికి తగ్గట్లే పవన్ ఎక్కడికెళ్తే అక్కడ సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేస్తుంటారు. గతంలో సీఎం పదవిపై ఆసక్తి చూపని పవన్ ఇప్పుడు తనను సీఎంగా చేయాలని కోరుతున్నారు. ఈ అంశంపై పవన్ తాజాగా మీడియాతో మాట్లాడారు. అభిమానులు తనను సీఎం అని నినాదాలు చేస్తుంటే.. తాను సిద్ధం అని సకేతాలు పంపినట్లు చెప్పారు. సీఎం పదవి ఒకేసారి వస్తుందా.. లేక అంచెలంచెలుగా వస్తుందా అనేది కాలం నిర్ణయిస్తుందన్నారు. కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసే పదవి అంటే చాలా అనుభవం కావాలని, దీనికోసం క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా సమస్యలపై అవగాహన పెంచుకుంటున్నట్లు చెప్పారు. తాను సీఎం కావాలంటే క్యాడర్ అనుకుంటే సరిపోదని, ప్రజలు కూడా అనుకోవాలని అభిప్రాయపడ్డారు. “పొత్తుల విషయంలో కూర్చుని, డైనమిక్‌గా ఆలోచించాలి. చర్చించాలి. నాలుగు గోడల మధ్య ఊహించుకుని చెప్పడం కరెక్ట్ కాదు. చంద్రబాబును గతంలో కలిసినా సీట్లు, పొత్తుల విషయం చర్చించలేదు. ఎన్నికల సమయానికి పొత్తుల విషయంలో స్పష్టత వస్తుంది” అని వ్యాఖ్యానించారు. అంటే టీడీపీతో పొత్తు విషయంలో పవన్ ఇంకా ఏం నిర్ణయించుకున్నట్లు కనిపించడం లేదు.
బలపడుతున్న జనసేన
ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ముందుగా పార్టీ నిర్మాణంపైనే పవన్ దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా జనసేనను బలోపేతం చేసి.. అప్పటి తన బలానికి అనుగుణంగా పవన్ సీట్లు అడిగే అవకాశం ఉంది. గతంలోలాగా తక్కువ సీట్లతో పవన్ సర్దుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. అలాగే సీఎం పదవిని అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే తనను సీఎంను చేయాలంటూ అడుగుతున్నారు. ఈ పరిణామం టీడీపీకి ఇబ్బందే. జనసేనతో పొత్తు పెట్టుకోవాలంటే సీఎం పది విషయంలో కూడా ముందుగానే తేల్చుకోవాల్సి ఉంటుంది. గతంలో జనసేన కాస్త బలహీనంగా ఉండేది కాబట్టి.. తక్కువ సీట్లిచ్చినా సరిపోతుందని టీడీపీ భావించి ఉండొచ్చు. అదే ఇప్పుడు జనసేన బలపడితే ఇది చాలదు.
ఎక్కువ సీట్లు.. తప్పదంటే సీఎం పదవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పవన్ తనకు సీఎంగా అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటారు..? చంద్రబాబు తాను సీఎం అవ్వడం, తన తర్వాత లోకేష్ సీఎం అవ్వాలని కోరుకుంటూ ఉండొచ్చు. కానీ, రాజకీయ పరిణామాల్ని కూడా బాబు కాస్త గమనించాలి. ఈ విషయంలో టీడీపీ ఒక అడుగు వెనక్కు వేసి.. పవన్‌ను సీఎం చేయడానికి అంగీకరిస్తే రెండు పార్టీలకూ లాభమే. అది పూర్తిస్థాయి సీఎం కావొచ్చు.. లేదా చెరో రెండున్నరేళ్ల పదవి కావొచ్చు. ప్రస్తుతం పవన్ పదవి ఆశిస్తున్న దృష్ట్యా.. పొత్తుల విషయంలో టీడీపీనే చొరవ చూపాల్సి ఉంది. లేదంటే పవన్ తనదారి తాను చూసుకుంటాడేమో చెప్పలేం.