తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా రచ్చ లేపుతోంది. జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… ఎన్డియే ఎమ్మెల్యేల మీటింగ్ లో చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. దీనిపై ఇప్పుడు ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు సిద్దమవుతోంది. ఈ విచారణలో ఐపిఎస్ అధికారులు పాల్గొనే అవకాశం కనపడుతోంది. ఇక దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఆయన 11 రోజుల దీక్ష కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.
తాజాగా విజయవాడ కనకదుర్గ ఆలయంలో పవన్ కళ్యాణ్ మెట్లను స్వయంగా శుభ్రం చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. మేము రామభక్తులం.. ఆంజనేయస్వామిని పూజిస్తాం అన్నారు. సగటు హిందువుకు ఎలాంటి భయం, ఇతర మతాల పైన ద్వేషం ఉండదని స్పష్టం చేసిన ఆయన… కనకదుర్గమ్మ రధం సింహాలు మాయమైతే వైసీపీ నేతలు అపహాస్యం చేసారు అని మండిపడ్డారు. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలీదు అంటూ సెటైర్ వేసారు.
జగన్ ను నేను ఎత్తి చూపడం లేదు… మీ సమయంలో జరిగిన అపచారం పై స్పందించాలి అని డిమాండ్ చేసారు. రాజకీయాలలో క్రిమినల్స్, రాజ్యాంగం బాగుండాలి అని పాటుపడుతున్నామన్నారు. సెక్యులరిజం అన్ని వైపుల నుంచీ రావాలి అని హితవు పలికారు పవన్. సాటి హిందువులు తోటి హిందువులను తిట్టడం ఆక్షేపణీయం, మసీదులో చిన్న అపచారం జరిగితే ఇలాగే మాట్లాడతారా.. హిందువుల పట్ల ఎలా మాట్లాడతారు అని నిలదీశారు. పొన్నవోలు సుధాకర్ పొగరుగా మాట్లాడారు… తమాషాలుగా ఉందా.. సరదాలుగా ఉన్నాయా అంటూ ఫైర్ అయ్యారు.
ప్రకాష్ రాజ్ కూడా చెపుతున్నా… సెక్యులరిజం టూవే.. ఒన్ వే కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు పవన్. ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉంది.. కానీ ఆయన సరిగా మాట్లాడాలని హితవు పలికారు. ఈ సందర్భంగా టాలీవుడ్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారతదేశపు సినిమా అభిమానులు అందరూ హిందువులు కాదా అని నిలదీశారు. ఇస్లాం మీద గొంతెత్తితే రోడ్లమీదకు వచ్చి కొడతారని మీకు భయమన్న పవన్… ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా సైలెంట్ గా ఉండాలి… మాట్లాడితే చాలా మంచిగా మాట్లాడాలి అని వార్నింగ్ ఇచ్చారు. నిన్న సినిమా ఫంక్షన్ లో లడ్డు గురించి మాట్లాడారు, రిపీట్ అవ్వొద్దు అని హెచ్చరించారు. భూమన కరుణాకర్ రెడ్డి నాశనం మొదలయింది అంటూ హెచ్చరించారు పవన్.