Pawan Kalyan: పవన్‌కు రెండున్నరేళ్లు సీఎం పదవి ఇస్తారా..? కాపుల సూటి ప్రశ్న..!

టీడీపీకి ఆఫర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మరోసారి పల్లకి మోసే బోయగా మిగిలిపోతాడా..? చంద్రబాబు చేతిలో మోసపోతాడా..? అనే భయాన్ని కాపు సామాజిక వర్గంలోని పెద్దలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కాపు సామాజిక వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - September 19, 2023 / 08:11 PM IST

Pawan Kalyan: జైలుకెళ్ళి మరీ చంద్రబాబుని పరామర్శించి, ధైర్యం చెప్పి బయటకొచ్చి, అంతకంటే రెట్టించిన ధైర్యంతో టిడిపితో పొత్తు ఉంటుందని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఒక రకంగా వైసీపీకి ఇది పెద్ద షాకే. అంతేకాదు బిజెపికి కూడా అర్థం కాని నిర్ణయం ఇది. సీట్లపై చర్చ జరగలేదు. ఎవరికి ఎన్ని సీట్లో తెలియదు. అడిగినన్ని సీట్లు రేపు టిడిపి ఇస్తుందో.. లేదో తెలియదు. అయినా పవన్ కళ్యాణ్ ధైర్యంగా పొత్తు ప్రకటించగలిగారు. కాపు సామాజిక వర్గం నుంచి విమర్శలు వస్తున్నా ఆయన పట్టించుకోలేదు. తన నిర్ణయం టిడిపికి మేలు చేస్తుందని తెలిసినప్పటికీ స్నేహ ధర్మానికి కట్టుబడిన పవన్ కళ్యాణ్ పొత్తుల ప్రకటన చేశారు. దీనిపై కాపు సామాజిక వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది.
జనసేనలో అనుమానం
ఆఫర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మరోసారి పల్లకి మోసే బోయగా మిగిలిపోతాడా..? చంద్రబాబు చేతిలో మోసపోతాడా..? అనే భయాన్ని కాపు సామాజిక వర్గంలోని పెద్దలు వ్యక్తం చేస్తున్నారు. టిడిపి సీట్లు ఎన్ని అయినా ఇవ్వని.. జనసేన ఎన్నైనా గెలవని.. కానీ కనీసం రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్‌కి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారా..? అది కూడా మొదట పవన్ కళ్యాణ్‌కి.. ఆ తర్వాత రెండున్నర సంవత్సరాలు టిడిపికి
ముఖ్యమంత్రి సీటు షేర్ చేస్తారా.. అని అడుగుతున్నారు కాపు నేతలు. ఈ ఒప్పందం మీద అయితేనే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే మంచిదని, అలాకాకుండా టేక్ఇట్ గ్రాంట్‌గా పొత్తు ప్రకటించేస్తే జనసేన నష్టపోతుందని ఆ పార్టీ నేతలు, కాపు నాయకులు కూడా అంటున్నారు.

కాపు సామాజిక వర్గం పూర్తిగా టీడీపీ వైపు కూడా ఉండాలి అంటే కచ్చితంగా అధికారం, సీఎం కుర్చీ కాపులకు వస్తుందని నమ్మకం ఉంటేనే 100 శాతం ఓట్లు జనసేన-టిడిపి కూటమికి పడతాయి. అంతే తప్ప చంద్రబాబు కోసం త్యాగాలు చేయడానికి మరోసారి కాపులు ఎందుకు బలి కావాలనే ప్రశ్న జనసేనలోనూ, కాపు సామాజిక వర్గంలోనూ మొదలైంది. దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. 2009 నుంచి సుమారు 14 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు. పీఆర్‌పీ ద్వారా అధికారం ఎలాగో సాధ్యం కాలేదు. ఇప్పుడు కనీసం జనసేన ద్వారానైనా కాపులకు అధికారం రాకపోతే చివరికి పల్లకి మోసే బోయలుగా మిగిలిపోతామా అని కాపుల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి పదవి పవన్‌కి దక్కనప్పుడు కాపులు.. తెలుగు దేశానికి ఓటు ఎందుకు వేయాలి అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు కొందరు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం గడచిన 60 ఏళ్లుగా రెండు సామాజిక వర్గాల మధ్యే షేర్ అవుతోంది.

పెరిగిన పవన్ ఓటు బ్యాంక్
పవన్ కళ్యాణ్ ఓటు షేర్.. పాపులారిటీ నాలుగు శాతం నుంచి 11 శాతానికి పెరిగినట్లు ఓ అంచనా. ఈ ఓట్ల శాతం 15 శాతానికి పెరిగితే 50కిపైగా నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అంతేకాదు మిగిలిన 125 నియోజకవర్గాల్లో టిడిపి గెలుపులో జనసేన ప్రధాన పాత్ర పోషిస్తుంది. అటువంటప్పుడు ఐదేళ్లలో సగం అంటే రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి అడగడంలో తప్పేంటి అన్నది కాపుల్లో చాలామంది వాదన. జనసేన, టిడిపి కూటమికి అధికారం వస్తే పవన్ కళ్యాణ్ మొదటి దఫా ముఖ్యమంత్రి అని టిడిపి ప్రకటిస్తే బ్రహ్మాండమైన మెజారిటీతో రెండు పార్టీలు గెలుస్తాయని, కాపులు పూర్తిగా టిడిపితో ఉంటారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎమోషన్‌లోనైనా టిడిపికి ఇటువంటి షరతులు లేకుండా మద్దతు ప్రకటించినప్పుడు రెండున్నరేళ్లు సీఎం సీట్ ఇస్తే తప్పేంటి అన్నది కొందరి వాదన. వైసీపీపై గెలుపునకు ఇంతకంటే మంచి ఫార్ములా లేదనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి టిడిపి ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.