Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేస్తారు అనే విషయంలో కొంతకాలంగా అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఈసారి కూడా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈసారి కూడా విశాఖలోని గాజువాక నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్.. భీమవరంతోపాటు గాజువాకలో కూడా పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.
దీంతో రాబోయే ఎన్నికల్లో గాజువాకలో పోటీ చేయకపోవచ్చని అంతా అనుకున్నారు. తిరుపతిసహా వివిధ నియోజకవర్గాల పేర్లు వినిపించాయి. కానీ, ప్రస్తుత పరిణామాల్ని చూస్తుంటే పవన్ మళ్లీ గాజువాకపై కన్నేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖలో పర్యటిస్తున్న పవన్.. గాజువాకలో కూడా పర్యటించి, బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గతంలోకంటే మంచి స్పందన కనిపించింది. పైగా గతంలో పవన్‌కు ఓటేయలేకపోయామే అనే అసంతృప్తి అక్కడివారిలో వ్యక్తమైంది. నిజానికి గతంలో పవన్‌ను అక్కడి వాళ్లు నమ్మలేదు. పైగా రెండో చోట్లా పోటీ చేయడం కూడా మైనస్‌గా మారింది. ఇప్పుడు మాత్రం గాజువాక ప్రజలు పవన్ విషయంలో సానుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. పవన్ ప్రసంగానికి వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఈ విషయం తెలుస్తోంది. పవన్ ప్రసంగంలో గాజువాక గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. తనకు విశాఖ రెండో ఇల్లు అని, అవకాశం ఇస్తే ఇక్కడే ఉంటానని కూడా చెప్పుకొచ్చారు. దీని ద్వారా పవన్ తన ఉద్దేశాన్ని వివరించారు. అలాగే తను ఓడిపోయినప్పటికీ తనకు విశాఖ, గాజువాక ఎంత ఇష్టమో పవన్ చెప్పారు.
అక్కడి ప్రజలు తనను ఇంకా ఆదరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు స్థానికులను ఆకట్టుకున్నాయి. అలాగే స్థానిక సమస్యలు, భూ ఆక్రమణల గురించి పవన్ ప్రస్తావించిన తీరు కూడా ఆకట్టుకుంది. స్థానిక ఎమ్మెల్యే అవినీతిపై కూడా మాట్లాడారు. వీటన్నింటినీ పరిశీలిస్తే పవన్ మళ్లీ గాజువాక నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. అక్కడ పవన్ సామాజికవర్గం ఓట్లు ఎక్కువ. ఈసారి వాళ్లంతా పవన్‌కు అండగా నిలబడే అవకాశం ఉంది. విశాఖలో వైసీపీ అవినీతిపై స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. విశాఖ ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేశారంటే అక్కడ నేరాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. వీటి వల్ల వైసీపీకి ఈసారి ఛాన్స్ తక్కువే. టీడీపీతో పోలిస్తే.. ఇక్కడ జనసేనకే బలం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ పవన్ గాజువాకవైపే చూస్తున్నారు. దీనిపై త్వరలోనే ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.