PAWAN KALYAN: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నారా..? దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తైందా..? ఇప్పుడు జరుగుతున్న ప్రచారంలో నిజమెంత..?
Poonam Pandey: నాకేం కాలేదు.. నేను బతికే ఉన్నా.. పూనమ్ పాండే సంచలనం
తాజా సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆయనను లోక్‌సభ ఎన్నికల బరిలో దిగాలని బీజేపీ సూచించిందని సమాచారం. అంతేకాదు.. ఎంపీగా పోటీ చేసి గెలిస్తే, రాబోయే బీజేపీ (ఎన్డీయే) ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం.. పవన్.. కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని పార్టీ వర్గాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయంలో స్పష్టత లేదు. గతంలో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఈ స్థానాలు లేదా కాకినాడ నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇటీవల పవన్.. కాకినాడలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే అక్కడి ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశమయ్యారు. కేడర్‌తో కూడా చర్చించారు. పైగా అక్కడ ఆయన సామాజికవర్గం ఓట్లు ఎక్కువ. అందువల్ల కాకినాడలో పవన్ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే పవన్ కాకినాడపై దృష్టి సారించారు. నిజానికి పవన్.. ఇంకా ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనేది నిర్ణయించలేదు. అసెంబ్లీకా.. పార్లమెంటుకా కూడా తేల్చలేదు. మరోవైపు.. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నాయి. సీట్ల లెక్క ఇంకా తేలలేదు. ఇక.. బీజేపీతో పొత్తు ఉంటుందా.. ఉండదా అనేది కూడా తేలాలి. జనసేనతో పొత్తులో ఉన్నామంటూ బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. కానీ, కేంద్రం నుంచి ఏ స్పష్టతా రావడం లేదు. ఈ అంశంపై చర్చించేందుకు పవన్ ఢిల్లీ వెళ్లబోతున్నారు. అక్కడి నేతలతో సంప్రదింపులు తర్వాతే జనసేన-టీడీపీ-బీజేపీ పొత్తు, పవన్ లోక్‌సభకు పోటీ వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.