PAWAN KALYAN: జనసేనానికి ఇబ్బంది తప్పదా.. గుర్తుతోపాటు పేర్లు కూడా..!

పవన్ కళ్యాణ్ పేరుతో ఉన్న అభ్యర్థుల్ని పోటీలో దించుతోంది. పవన్ పూర్తి పేరు కొణిదెల పవన్ కళ్యాణ్. అయితే, ఈ పేరుకు దగ్గరగా ఉండే.. కోనేటి పవన్ కళ్యాణ్, కనుమూరి పవన్ కళ్యాణ్ అనే ఇద్దరు అభ్యర్థులు కూడా పిఠాపురం నుంచి అసెంబ్లీకి బరిలో నిలిచినట్లు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - April 25, 2024 / 04:09 PM IST

PAWAN KALYAN: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే ఆయన గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే, పవన్‌‌ను ఎలాగైనా ఓడించాలని ప్రయత్నిస్తున్న వైసీపీ.. అందుకు ఉన్న అన్ని దారుల్ని వెతుకుతోంది. ప్రస్తుతం పవన్‌కు పిఠాపురంలో ఆదరణ పెరిగిన నేపథ్యంలో ఆయనను ఓడించేందుకు కొత్త ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. అదే.. పవన్ కళ్యాణ్ పేరుతో ఉన్న అభ్యర్థుల్ని పోటీలో దించుతోంది.

TDP VS YSRCP: తిరుపతిలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు

పవన్ పూర్తి పేరు కొణిదెల పవన్ కళ్యాణ్. అయితే, ఈ పేరుకు దగ్గరగా ఉండే.. కోనేటి పవన్ కళ్యాణ్, కనుమూరి పవన్ కళ్యాణ్ అనే ఇద్దరు అభ్యర్థులు కూడా పిఠాపురం నుంచి అసెంబ్లీకి బరిలో నిలిచినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది నిజమో.. కాదో.. ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ నిజమైతే మాత్రం పవన్‌కు ఇబ్బంది తప్పదు. పవన్ కళ్యాణ్‌ పేరుతో ఉన్న మూడు పేర్ల విషయంలో కొందరు ఓటర్లైనా కన్‌ఫ్యూజ్‌ అయ్యే అవకాశం ఉంది. దీంతో కొణిదెల పవన్ కళ్యాణ్‌కు వేయాల్సిన ఓటు.. వేరే పవన్ కళ్యాణ్‌కు వేయొచ్చు. దీంతో పవన్‌కు భారీ నష్టం తప్పదు. ఇప్పటికే జనసేన గుర్తు విషయంలో చాలా సమస్య ఉంది. గ్లాసు గుర్తును పోలిన బకెట్ గుర్తు ఆ పార్టీకి ఇబ్బందిగా మారొచ్చు. అలా గ్లాసు వేయాల్సిన ఓటు బకెట్‌కు వేసినా జనసేన అభ్యర్థులకు నష్టం తప్పదు. అటు గ్లాసు గుర్తు.. ఇటు పవన్ కళ్యాణ్ పేరుతో ఉన్న అభ్యర్థులు జనసేనకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

అయితే, ఇలాంటి వాళ్ల నామినేషన్ వెనుక వైసీపీ ఉందన్నది జనసైనికులు మాట. పవన్‌ను నేరుగా ఎదుర్కోలేక.. జగన్ ఇలాంటి పని చేయిస్తున్నాడని జనసైనికులు విమర్శిస్తున్నారు. అయితే, ఈ మాత్రం దానికే ఓటర్లు పొరపాటు పడి.. జనసేనకు దెబ్బ వేస్తారని చెప్పలేం. చాలా మంది ఓటర్లు చదువుకున్న, చైతన్యవంతులే కాబట్టి.. సరైన అభ్యర్థికే ఓటు వేస్తారని జనసేన శ్రేణులు అంటున్నాయి. అవసరమైతే.. ఈ విషయంలో ఈసీకి ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. మరి ఈ గుర్తులు.. పేర్లు.. పవన్‌కు, జనసేనకు ఏ మేరకు నష్టం కలిగిస్తాయో చూడాలి.