Pawan Kalyan: వారాహి యాత్ర మొదలుపెట్టిన జనసేనాని పవన్ ఇక జనం మధ్యే ఉండనున్నారు. మొదటి దశలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని 11నియోజకవర్గాల్లో పవన్ యాత్ర కొనసాగనుంది. యాత్రతో పాటు, సభలు కూడా నిర్వహించనున్నారు. ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ పవన్ యాత్రతో మరింత రాజకీయ వేడి పెరగనుంది. అన్నవరం నుంచి యాత్ర మొదలుకాగా.. ప్రతీ నియోజకవర్గానికి రెండు రోజుల సమయం కేటాయించాలని నిర్ణయించారు.
స్థానికంగా జనాల నుంచి సమస్యలు తెలుసుకోవాలనికి ప్రజా వాణి నిర్వహించనున్నారు. ప్రజాసమస్యలపై పోరాటం, అధికార వైసీపీ అవినీతి, అక్రమాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించడమే లక్ష్యంగా సాగనున్న యాత్ర జిల్లాలో నాలుగు నియోజకవర్గాల మీదుగా జరగనుంది. పర్యటనలో కత్తిపూడి, ఉప్పాడ బస్టాండ్ సెంటర్, సర్పవరంలో మొత్తం మూడు బహిరంగ సభల్లో పవన్‌కళ్యాణ్ ప్రసంగించనున్నారు. కీలక సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటం చేయడంలో భాగంగా ఏదో ఒక ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. యాత్రకు పోలీసు శాఖ అనుమతి ఇచ్చింది. ఎక్కడా సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
పవన్ యాత్ర ద్వారా జిల్లాలో తమ బలం ఏ స్థాయిలో ఉందో చూపించాలని జనసేన నేతలు పట్టుదలగా ఉన్నారు. అందుకోసం అన్నవరం నుంచి బహిరంగ సభ జరిగే కత్తిపూడి వరకు భారీ కటౌట్లు, ఫ్లెక్సీలతో నింపేశారు. 16న పిఠాపురంలో, 18న కాకినాడలో, 20న ముమ్మడివరంలో, 21న అమలాపురంలో, 22న పి గన్నవరంలో అదే రోజు మల్కిపురంలో, 23న నర్సాపురంలో పవన్ యాత్ర, సభ జరిగేలా ప్రణాళికలు సిద్దం చేసారు. పవన్ అన్నివర్గాలకు చేరువయ్యేలా వ్యూహం రూపొందించుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అన్ని సామాజికవర్గాల ప్రజలు, నేతలు, నిపుణులతో చర్చలు జరిపి వారి అభిప్రాయాలు పవన్ తెలుసుకోనున్నారు. పవన్ చాలా కాలం తరువాత జనంలోకి వస్తున్నారు. 2019 ఎన్నికల తరువాత రాష్ట్రంలో పర్యటనలు చేసినా, కార్యక్రమాల్లో పాల్గొన్నా, ఇప్పుడు దాదాపు 15 రోజుల పాటు పూర్తిగా ప్రజల్లోనే ఉండాలని పవన్ నిర్ణయించారు.
ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రయోగాలు ఉండవని పవన్ తేల్చి చెప్పారు. అందులో భాగంగా సినిమాలకు పవన్ బ్రేక్ ఇచ్చారు. రెండు వారాల పాటు ప్రజలతో మమేకం కానున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేడర్‌లో ఉత్తేజం నింపేదుందకు పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో పవన్ పర్యటన ప్రారంభం కానుంది.