విజయవాడ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. అసలు వరద గురించి తెలియని ప్రాంతాల్లో సైతం భారీ వరద రావడం… ఇళ్ళు నీట మునిగిపోవడంతో ప్రజల్లో ఇప్పుడు ఆందోళన మొదలయింది. లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. కృష్ణా నది కంటే బుడమేరు వాగు దెబ్బకు బెజవాడలో దాదాపు 30 నుంచి 35 శాతం నీళ్ళల్లోనే ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు వరద ప్రాంతాల్లో పర్యటన చేస్తూ… బాధితులకు ధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
నిన్న దాదాపు 22 కిలోమీటర్ల దూరం నాలుగున్నర గంటల పాటు చంద్రబాబు నాయుడు జేసీబీ మీదనే ప్రయాణం చేసారు. అంత వరకు బాగానే ఉంది గాని… ఇక్కడే ఒక వ్యక్తిని మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఆయనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పవన్ బ్యాక్ గ్రౌండ్ లో ఏం చేస్తున్నారు ఏంటీ అనేది కూడా చాలా మందికి క్లారిటీ లేదు. అయితే ఆయన కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో గత మూడు రోజుల నుంచి తిరిగి పని చేసి ఉంటే బాగుండేది. ఇతర మంత్రులు అందరూ పని చేస్తున్నా పవన్ మాత్రం బయటకు రాలేదు.
పవన్ నుంచి మీడియా సమావేశాలు కూడా పెద్దగా కనపడలేదు అనే చెప్పాలి. దీనితో వైసీపీ సోషల్ మీడియాలో పవన్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. వరద బాధిత ప్రాంతాల్లో పవన్ పర్యటన చేసి… సహాయ కార్యక్రమాలను కనీసం ఒక ప్రాంతానికి అయినా వేగవంతం చేసి ఉంటే చాలా బాగుండేది. కృష్ణ లంక ప్రాంతంలో అయినా పవన్ ఉంటే కొంచెం చంద్రబాబు, ఇతర మంత్రుల మీద పని ఒత్తిడి తగ్గేది, ఇతర ప్రాంతాల మీద ఫోకస్ పెట్టడం సాధ్యం అయ్యేది. అయితే పవన్ ఏం చేసినా మీడియా ముందు చేసినా బాగుండేది.
ఇప్పుడు ఇది విమర్శలకు వేదిక అయ్యే అవకాశం కనపడుతోంది. ఇప్పటికే పవన్ ను ఏ విధంగా టార్గెట్ చేయ్యాలనే దానిపై వైసీపీ నేతలు కాచుకుని కూర్చున్నారు. అటు జనసేన నేతలు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలకు పెద్దగా కనపడిన పరిస్థితి లేదు. మంత్రులు కూడా దూరంగానే ఉన్నారు. బందరు ఎంపీ వల్లభనేని బాలసౌరి నియోజకవర్గంలో కూడా వరద ప్రభావం ఉంది. ఆయన కూడా సహాయక కార్యక్రమాల్లో కనపడకపోవడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.