తెలంగాణాలో జనసేన పార్టీ బలోపేతం కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా పోటీ చేయాలని ఆయన గట్టిగానే సిద్దమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి అధికారం అనుభవిస్తున్న జనసేన పార్టీ… తెలంగాణాలో కూడా అధికారంలో భాగం కావాలని పట్టుదలగా ఉంది. అక్కడ టీడీపీ, బిజెపి కలిసి ఎన్నికలకు వెళ్ళడం దాదాపుగా ఖరారు అయింది. ఇక జనసేన పార్టీని కూడా కలుపుకుని వెళ్ళే యోచనలో ఆ రెండు పార్టీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పొత్తుని తెలంగాణాలో కూడా కంటిన్యూ చేయాలని చూస్తున్నారు.
దాదాపుగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుంచే ఇది మొదలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మీద బిజెపి గట్టిగానే దృష్టి సారించింది. బీఆర్ఎస్ బలహీనపడింది కాబట్టి ఆ స్థానాన్ని తాము ఆక్రమించాలని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గత ఎన్నికల మాదిరిగా గట్టి పోటీ ఇస్తే మాత్రం బిజెపి నిలబడినట్టే. ఇప్పటికే 8 ఎంపీ స్థానాలతో ఆ పార్టీ తెలంగాణాలో తన ప్రభావం చూపిస్తుంది. అందుకే ఇప్పుడు జనసేన, టీడీపీ లను అక్కడ కూడా వాడుకోవాలని చూస్తోంది. దీనితో పవన్ కళ్యాణ్ కూడా గట్టిగానే సిద్దమవుతున్నారు.
తెలంగాణాలో జనసేన పార్టీకి అధ్యక్షుడని నియమించాలని అది పార్టీకి ఇమేజ్ తెచ్చే నాయకుడు కావాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. తెలంగాణా జనసేన పార్టీ బాధ్యతలను సాయి ధరం తేజ్ కి ఇచ్చే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారట. బయటి వారికి కాకుండా కుటుంబ సభ్యుడు, యువకుడుకి అయితే బాగుంటుందని, కష్టపడే మనస్తత్వం కాబట్టి సాయి ధరం కి తేజ్ కి ఇస్తే మంచిది అనే యోచనలో పవన్ ఉన్నారు.
దీనికి సాయి ధరం తేజ్ కూడా ఓకే అన్నారట. అందుకే సినిమాలకు కాస్త గ్యాప్ ఇస్తున్నారని టాక్ వస్తోంది. ముందు నాగబాబుకి అనుకున్నా… ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో… వరుస పర్యటనలు కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే జిల్లా కమిటీలు నియమించాల్సి ఉంటుంది. నాగబాబు వయసు రిత్యా ఇవన్నీ ఆయనకు ఇబ్బంది అని భావించి పవన్ కళ్యాణ్ ఆ బాధ్యతలను సాయి ధరం తేజ్ కు ఇవ్వాలని భావిస్తున్నారట.