రష్యాకు మిత్ర దేశంగా ఉన్న చైనా.. ఉక్రెయిన్‌పై జరుగుతున్న దాడిపై వ్యూహాత్మకంగానే మౌనంగా ఉందని ప్రపంచ దేశాలు భావించాయి. అయితే హఠాత్తుగా చైనా పాలకులకు ఉక్రెయిన్ ప్రయోజనాలు గుర్తుకొచ్చాయి. అవసరమైతే తాము మధ్యవర్తిత్వం వహించి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి స్వయంగా ఫోన్ చేసిన జిన్‌పింగ్ యుద్ధానికి ముగింపు పలికేలా రాజకీయ పరిష్కారం కనుగొనేందుకు తమవైపు నుంచి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. రష్యాలో చైనా మాజీ అంబాసిడర్‌ను త్వరలోనే ఉక్రెయిన్ పంపించి యుద్ధానికి ముగింపు పలుకుతామని హామీ ఇచ్చారు.
చైనాలో సడన్‌గా ఈ మార్పు ఎందుకు ?
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత జిన్‌పింగ్ అధ్యక్షుడు పుతిన్‌ను రెండుసార్లు కలిసారు. మార్చిలో రష్యాలో పర్యటించినప్పుడు కూడా పుతిన్‌ను కలిసి అనేక ద్వైపాక్షిక అంశాలను చర్చించారు. ఆ సమయంలో కూడా జిన్‌పింగ్ ఉక్రెయిన్ యుద్ధం గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. చైనా అధ్యక్షుడి రష్యా పర్యటనలో ఈ ప్రస్తావన వస్తుందని ప్రపంచదేశాలు భావించాయి. కానీ జిన్‌పింగ్ నోరు మెదపలేదు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ఫోన్ చేసి మాట్లాడారు జిన్‌పింగ్. ఉక్రెయిన్-రష్యా మధ్య మధ్యవర్తిత్వం జరపడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు
చైనా డబుల్ గేమ్ ఆడుతుందా ?
శత్రువుకు శత్రువు మనకు మిత్రుడంటారు. చైనా రష్యా మిత్రులు. రష్యాకు ఉక్రెయిన్ శత్రుదేశం. ఆ రకంగా చూస్తే తన మిత్రుడికి శత్రువైన ఉక్రెయిన్‌ను చైనా దూరంగానే పెట్టాలి. కానీ ఇక్కడే చైనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే రెండు దేశాలతో డబుల్ గేమ్ ఆడుతుందేమో అనిపిస్తోంది. చైనా ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక బంధాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తమ దేశం కట్టుబడి ఉందని జెలెన్‌స్కీతో చెప్పిన జిన్‌పింగ్.. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనే ఇదే మాట కొంచెం భిన్నంగా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు సంభించినా సరే..చైనా రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొత్త శకం వైపు నడిపించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. జిన్‌పింగ్ మాటలను బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే. ఉక్రెయన్‌తో చైనా భాగస్వామ్యం కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. అదే రష్యాతో పాటు ఎలాంటి షరతులు లేకుండా ముందుకు కొనసాగుతుంది.
చైనా మధ్యవర్తిత్వాన్ని ఎలా చూడాలి ?
ఉక్రెయిన్ యుద్ధం తారాస్థాయికి చేరిన తర్వాత పశ్చిమ దేశాలన్నీ రష్యాపై ఆంక్షలు విధించాయి. పుతిన్ ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేందుకు అంతర్జాతీయ లావాదేవీలపైనా ఆమెరికా ఆంక్షలు పెట్టింది. అమెరికాతో పాటు దాని మిత్ర దేశాల నిర్ణయంతో చాలా దేశాలు రష్యాతో వ్యాపారానికి ముగింపు పలకాల్సి వచ్చింది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ రష్యాతో పూర్తిస్థాయిలో వాణిజ్య, వ్యాపార బంధాన్ని కొనసాగించింది చైనా. రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయిల్, గ్యాస్‌ను చైనా కొనుగోలు చేసింది. పెద్దన్నగా ప్రపంచంపై అమెరికా చేసే పెత్తనాన్ని అడ్డుకోవడంలో రష్యా కీలక పాత్ర పోషిస్తుందని నమ్మే చైనా.. పుతిన్‌కు అదేస్థాయిలో మద్దతు ప్రకటించింది. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధాన్ని ప్రపంచదేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించినా చైనా మాత్రం రష్యాపై ఈగవాలనివ్వలేదు. రష్యాపై పశ్చిమదేశాలు చేస్తున్న దాడిని కూడా చైనా తిప్పికొట్టింది.
మధ్యవర్తిత్వం వెనుక చైనా వ్యూహమేంటి ?
ఇప్పటికే చాలా అంశాల్లో చైనా అమెరికాను వెనక్కి నెట్టి తలెగరేసే పరిస్థితికి చేరుకుంది. గ్లోబల్ పవర్ సెంటర్‌గా అవతరించేందుకు చైనా తహతహలాడుతోంది. తన ప్రయోజనాలను నెరవేర్చుకుంటూనే అంతర్జాతీయంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనుకుంటోంది. అమెరికా సహా పశ్చిమ దేశాలన్నీ రష్యాను తిట్టిపోస్తూ ఉక్రెయిన్ పక్షాన నిలిస్తే.. కర్ర విరగకుండా.. పాము చావకుండా.. మధ్యవర్తిపాత్రను పోషించేందుకు సిద్ధమయ్యింది. వాస్తవానికి చైనా కొన్ని దశాబ్దాలుగా ఇతర దేశాల వ్యవహారాల్లో తలదూర్చడం కంటే.. తమ దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకోవడంపైనే దృష్టి పెట్టింది. అయితే ఇటీవల వ్యూహాన్ని కాస్త మార్చుకుంది. తన ప్రయోజనాలను కాపాడుకుంటేనే వివిధ కారణాల వల్ల ఘర్షణాత్మక వైఖరిని ప్రదర్శిస్తున్న దేశాల మధ్య సయోధ్య కుదిర్చే పనిచేస్తోంది.
చైనా రాయబారంతో బలపడిన బంధం
సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య సంవత్సరాలుగా ఘర్షణ వాతావరణం ఉంది. చివరకు ఆయా దేశాల రాయబార కార్యాలయాలను కూడా మూసేసే స్థాయికి రెండు దేశాల సంబంధాలు దిగజారిపోయాయి. అయితే అనూహ్యంగా చైనా ఎంట్రీ ఇచ్చింది. బీజింగ్‌లో చర్చలు జరిపింది. అంతే సౌదీ అరేబియా, ఇరాన్ నుంచి ఊహించని ప్రకటన వెలువడింది. తమ దేశ రాజధానుల్లో ఉన్న రాయబార కార్యాలయాలను తిరిగి ఓపెన్ చేస్తున్నట్టు రెండు దేశాలు ప్రకటించాయి. దశాబ్దాలుగా ఉప్పు నిప్పులా ఉన్న ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య కూడా మధ్యవర్తిత్వం నెరిపేందుకు చైనా ముందుకు రావడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. వ్యాపార ప్రయోజనాలను నెరవేర్చుకోవడం, అమెరికాను తలదన్నెలా అంతర్జాతీయ పాత్ర పోషించడం ఈ రెండు అంశాలనే ఎజెండా చేసుకుని చైనా శాంతిదూత అవతారం ఎత్తినట్టు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.
శాంతిదూతగా ప్రయత్నాలు ఫలిస్తాయా?
యుద్ధం కారణంగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రష్యా నుంచి పెద్ద ఎత్తున ఇంధనం, గ్యాస్‌ను కొనుగోలు చేసి రష్యాకు అండగా ఉన్న చైనా.. అదే సమయంలో తక్కువ ధరలకే రష్యా నుంచి వాటిని పొంది ఆర్థికంగా లబ్దిపొందింది. రష్యా యుద్ధం ప్రకటించకముందు ఉక్రెయన్‌కు అతిపెద్ద ట్రేడింగ్ పార్టనర్‌గా ఉన్నది చైనా మాత్రమే. చైనా కంపెనీలు ఉక్రెయిన్‌లో మౌలిక సదుపాయల ప్రాజెక్టులు కూడా చేపట్టేందుకు ముందుకు వచ్చాయి. శ్రీలంకకు, పాకిస్థాన్‌కు అందించినట్టే వివిధ దేశాల ఆర్థికంగా అండగా ఉంటూ ఆయా దేశాలతో వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకునే వ్యూహాలు చైనా అమలు చేస్తోంది. అందులో భాగంగానే యూరోపియన్ దేశాలవైపు చూస్తోంది. మధ్యవర్తిగా తాను పోషించే పాత్ర ద్వారా ఆయా దేశాల ప్రయోజనాలను నెరవేర్చడంతో పాటు అంతిమంగా ధీర్ఘకాలికంగా తమ ప్రయోజనాలను కాపాడుకోవాలని చూస్తోంది చైనా. ఉక్రెయిన్ -రష్యా మధ్య చైనా నెరిపే శాంతిరాయబారం ఎంత వరకు ఫలితాలనిస్తుందో వేచిచూడాలి.