YCP politics: ‘టికెట్ ఇస్తావా లేదా’? జగన్‌కు పేర్ని నాని ఝలక్‌!

పేర్ని నాని రిటైర్‌మెంట్‌ వ్యాఖ్యలను జగన్‌ ఊహించలేదా? నాని వ్యాఖ్యలు జగన్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాయా? తన కుమారుడికి టికెట్‌ ఇవ్వాల్సిందేనని నాని పదేపదే పట్టుపట్టినా..ఇప్పటివరకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వని జగన్‌కు నాని ఝలక్‌ ఇచ్చారా?

  • Written By:
  • Publish Date - May 23, 2023 / 04:36 PM IST

బందరు పోర్టు ప్రారంభోత్సవానికి సీఎం జగన్‌ వస్తుండడంతో మచిలీపట్నం రోడ్లన్ని వైసీపీ ఫ్లెక్సిలు, కటౌట్‌లతో నిండిపోయాయి. ఎటు చూసినా బ్లూ కలరే కనిపించేలా రోడ్లన్నీ జెండాలతో నింపేశారు ఫ్యాన్‌ కార్యకర్తలు. అయితే అన్నీ ఫ్లెక్సీలు, కటౌట్లలోనూ కామన్‌గా ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తినే కనిపించాడు. నాని కూడా ఆ ఫ్లెక్సీల్లో ఉన్నప్పటికీ పెద్ద ఫోటో మాత్రం ఆయన కొడుకు కిట్టుదే. అటు జగన్‌ రాక గురించి చెప్పడానికి ఆటోల ద్వారా మైకుల్లో ప్రచారం చేశారు. అక్కడ కూడా కిట్టు పేరే.. నాని పేరు ఎక్కడ వినపడలేదు. దీని వెనుక చాలా కథే ఉంది.

పోర్టు ప్రారంభోత్సవానికి జగన్‌ వచ్చిన తర్వాత బందరు రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటి చేయనని ఇప్పటికే అనేకసార్లు చెప్పిన మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని.. ఈ సారి ప్రజల అందరి సమక్షంలో జగన్ స్టేజీపై ఉండగానే రిటైర్‌మెంట్‌ వ్యాఖ్యలు వెనక ఆంతర్యం వేరే ఉందన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి నాని ఎప్పటినుంచో తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పట్టుపడుతున్నారు. నాని తరహాలోనే మరికొందరి ఎమ్మెల్యేలు సైతం తమ వారసులకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారు. అయితే జగన్‌ మాత్రం 2019 విన్నింగ్‌ వీరులు అలానే కొనసాగాలని.. 2029నాటికి వారసుల సంగతి ఆలోచిద్దామని చెబుతున్నారు. 2024ఎన్నికల్లో వారసులు కాకుండా మీరే పోటి చేయండి అని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. అయినా నాని మాత్రం తన కుమారుడికి ఇవ్వాలని లేకపోతే తాను కూడా పోటి చేయనని చెప్పినట్లుగా స్పష్టమవుతోంది.

నాలుగు గోడల మధ్య జరిగిన మీటింగ్‌లో కాకుండా ప్రజల అందరి సమక్షంలో నాని తాను ఇంకా రిటైర్‌ అవుతానని ప్రకటించడం వెనక రీజన్‌ అదే. ఇస్తే తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని..తాను మాత్రం పోటి చేసే ప్రసక్తే లేదని నాని ఖరాఖండిగా చెప్పినట్లే లెక్క! ప్రారంభోత్స సభ ముగిసిన తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలు వింటే ఈ విషయం క్లియర్‌ కట్‌గా అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల్లో తాను పోటి చేయడం లేదని.. అయితే తన కుమారుడికి టికెట్ ఇస్తారా లేదా అన్నది జగన్‌ ఇష్టమని చెప్పారు నాని. ఒకవేళ ఇవ్వకపోయిన తాను, తన కొడుకు కిట్టు వైసీపీ జెండానే మోస్తామని.. జగన్‌ కోసమే ప్రచారం చేస్తామని కుండబద్దలు కొట్టారు. అంతే కానీ.. ఒకవేళ కిట్టుకు టికెట్‌ ఇవ్వనంటే తాను పోటి చేస్తానని నాని ఎక్కడా కూడా చెప్పలేదు.

నాని ఇచ్చిన ఝలక్‌తో జగన్‌కు పాత తలనొప్పే కొత్తగా మొదలైంది. మచిలీపట్నం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాని మరోసారి గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2014లో పవన్‌ కల్యాణ్‌ టీడీపీకి మద్దతివ్వడంతో మచిలిపట్నంలో కాపుల ఓట్లు చీలిపోయాయి. చాలా మంది యువత టీడీపీకి ఓటు వేయడంతో అప్పుడు తెలుగుదేశం పార్టీనుంచి కొల్లు రవీంద్ర గెలిచారు. అయితే 2014-19మధ్య ఆయన బందరుకు చేసిందేంటో అతనికైనా తెలుసా అని ఓటర్లు పలుమార్లు ప్రశ్నించారు. ఇక రవీంద్రకు కేసుల టెన్షన్‌ ఎలాగో ఉంది. ఇలాంటి సమయంలో నాని గెలుపు ఈజీనే.. ఇది జగన్‌ లెక్క.. కానీ నానికి మాత్రం తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తన కొడుకు కూడా రాజకీయాల్లో ఎదగాలని కోరుకుంటున్నారు. జగన్‌కు మాత్రం రిస్కు తీసుకోవడం ఏ మాత్రం ఇష్టంలేదు. ఒకవేళ నాని అడిగినట్టు కిట్టుకు టికెట్ ఇస్తే.. మిగిలిన వాళ్లు తమ కుమారులకు ఇవ్వాలని పట్టుపడతారు.. ఇవ్వకపోతే అప్పుడు సీన్‌ వేరేలా ఉంటుంది. ఇదంతా జగన్‌కు మైనస్‌..మరి చూడాలి జగన్‌ నానిని ఎలా సర్థిచెబుతారో..లేక కిట్టుకే టికెట్ ఇస్తారో..!