Pilli Subhash chandra Bose: అధికార వైసీపీలో ఇప్పుడిప్పుడే వర్గపోరు బయటపడుతోంది. నెల్లూరులో ఇప్పటికే అనిల్ కుమార్ యాదవ్ వర్గానికి, ఆయన సొంత బాబాయి రూప్ కుమార్ యాదవ్‌తో విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇలా అనేక చోట్ల వైసీపీలో పలువురు నేతల మధ్య వర్గపోరు నడుస్తోంది. ఇంకా బయటకు రాకున్నా.. చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉందని అంచనా. తాజాగా కోనసీమ జిల్లా రామచంద్రాపురం వైసీపీలో విబేధాలు బయటపడ్డాయి.
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గాల మధ్య వైసీపీలో వర్గపోరు నడుస్తోంది. ఇద్దరి మధ్య సమస్య జగన్ వరకూ చేరింది. జగన్ పిల్లి సుభాష్‌ను పిలిపించుకుని మాట్లాడారు. అయితే, సీఎం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో పిల్లి అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికీ వేణు వర్గం, పిల్లి వర్గం నువ్వా.. నేనా.. అన్నట్లుగా పోటీపడుతున్నాయి. దీనికి కారణం.. రామచంద్రాపురం సీటు. ప్రస్తుతం ఇక్కడి నుంచి చెల్లుబోయిన వేణు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే, ఇది ఆయన సొంత నియోజకవర్గం కాదు. దీంతో ఇక్కడ తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పిల్లి సుభాష్ భావిస్తున్నారు. తనకు లేదా తన కుమారుడికి రామచంద్రాపురం టిక్కెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.
దీనికి సీఎం జగన్ సిద్ధంగా లేరు. మంత్రి వేణునే అక్కడి నుంచి పోటీ చేస్తారని జగన్ స్పష్టం చేశారు. అవసరమైతే ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడుతానని జగన్ చెప్పారు. అయితే, ఆ భేటీకి రాలేనని పిల్లి జగన్‌కు చెప్పారు. జగన్ నిర్ణయంపై పిల్లి అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో పిల్లి అవసరమైతే పార్టీకి రాజీనామా చేసి, ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తానని చెబుతున్నారు. లేదా టీడీపీ తరఫున కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ రామచంద్రాపురం నుంచి తాను లేదా తన కుమారుడు పోటీ చేయడం ఖాయం అని అనుచరులతో చెప్పారు. తన సామాజికవర్గాన్ని, అనుచరులను మంత్రి వేణు అణగదొక్కుతున్నారని పిల్లి సుభాష్ ఆరోపిస్తున్నారు. దీంతో అటు వేణు వర్గం, ఇటు సుభాష్ వర్గం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి.
ఇక ఇప్పటికే ఇక్కడి నుంచి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చిన పిల్లి సుభాష్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నాడు. తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నాడు. మంత్రి వేణుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు. తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రి వేణు అనుచరులు కూడా భేటీ అయ్యారు. వేణు వర్గం వైసీపీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసింది. త్వరలో ఇద్దరూ నియోజకవర్గంలో బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. వైసీపీ అధిష్టానం ఈ అంశాన్ని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.