ఏపీ (AP) లో పిఠాపురం (Pithapuram) ఇప్పుడు హాట్ టాపిక్. ఎందుకంటే.. రీల్ హీరోగా అదరగొట్టినా.. పొలిటికల్ హీరోగా గెలుపు బోణీ కొట్టని పవన్ జాతకం ఎలా ఉండబోతోంది ? ఈసారి గెలుస్తారా ? లేదంటే వైసీపీ సీటు ఎగరేసుకుపోతుందా ? ఇలా రకరకాల అంశాలపై దిమ్మ తిరిగి బొమ్మ కనిపించే రేషియోలో ఆఫర్లు ఇచ్చి కోట్లలో పందాలు కాయడమే కారణం. కూటమి అభ్యర్థిగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. నియోజవర్గంలో 2 లక్షల 36 వేల 409 ఓట్లు ఉండగా.. 2 లక్షల 4వేల 811 మంది ఓటు హక్కును వాడారు. ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో 86.63% పోలింగ్ నమోదయింది. ఇదే ఇప్పుడు పందెం రాయుళ్ళకు హాట్ కేక్‌గా మారింది. ఎక్కడా లేనివిధంగా కోట్ల రూపాయలు పిఠాపురం ఫోకస్ గానే చేతులు మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ మెజార్టీ టార్గెట్‌గా బెట్టింగ్ జరుగుతుంది.
జనసేన (Janasena) చీఫ్ 50 వేల మెజార్టీతో గెలుస్తాడని రూపాయి పెడితే రెండు రూపాయలు ఆఫర్ చేస్తున్నారు. 40 వేలు వస్తుందని కాన్ఫిడెన్స్ ఉంటే రూపాయికి రూపాయిన్నర ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. పిఠాపురం, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలాలు, పిఠాపురం గొల్లప్రోలు మున్సిపాలిటీలు ఉన్నాయి. కొన్నిచోట్ల మండలాల వారీగా బెట్టింగ్ కూడా జరుగుతుంది. ఏ మండలంలో ఎవరు లీడ్ సాధిస్తారు ? ఏ గ్రామంలో ఎవరి ప్రభావం ఉంటుంది ? రకరకాలుగా ఓపెన్ ఆఫర్లు ఇస్తున్నారు. వైసీపీ (YCP) అభ్యర్థి వంగా గీతకు 40% ఓట్లకు తక్కువ రాదని ఒక పందెం, స్వల్ప ఓట్లతోనైనా వైసీపీ గెలుస్తుందని మరొక పందెం. ఆన్ లైన్‌లో కూడా ఈ దందా నడుస్తోంది. పిఠాపురం చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని మెజారిటీ పవన్ కళ్యాణ్‌కి వస్తుందని ఒక ప్రపోజల్ జరుగుతుంది.
ఇలా బూత్‌లు, ఏరియాలు, మండలాల వారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల నలుగురు ముగ్గురు కలిసి ఒక టీం గా ఏర్పడి పందానికి సై అంటున్నారు… పిఠాపురంలో మొత్తం 240 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. ఏ బూత్‌లో ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుందని కూడా బెట్టింగ్ జరుగుతోంది. ఇతర ప్రాంతాలలో ఉన్న వారు కూడా పిఠాపురం పై బెట్టింగ్ పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపున్నారు. విదేశాలలో ఉన్నవారు ఆన్ లైన్‌లో ఈ బెట్టింగ్‌లలో పాల్గొంటున్నారు. మధ్యవర్తుల ద్వారా డీల్ సెట్ చేసుకుంటున్నారు. చోటా మోటా బెట్టింగ్‌లు లక్షల్లో జరుగుతుంటే కోట్లలో బెట్టింగ్‌లకు సిద్ధమయ్యే వాళ్ళు ఉన్నారు.
సింపుల్ గా డీల్ సెట్ చేసుకొని జూన్ 4 వరకు ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ మెజారిటీ పైనే ఎక్కువగా ఫోకస్ చేశారు పందెం రాయుళ్లు. షరతులు వర్తిస్తాయి అంటూ అందరికి ఓపెన్ ఆఫర్‌లు ఇస్తూ తమ వైపు తిప్పుకుంటున్నారు. ఇలా పందెం రాయుళ్లు పిఠాపురం పైన ఎక్కువగా బెట్టింగ్ వేస్తున్నారు. పవన్ మెజారిటీ ఆధారంగా కోట్ల రూపాయలు చేతులు మారే పరిస్థితి ఉంది. దానికి తగ్గట్టుగా నియోజకవర్గంలో హైప్ క్రియేట్ అయింది. మరోవైపు బెట్టింగ్ నిర్వహించిన నిర్వాహకులు సైతం పర్సంటేజీలు తీసుకుంటున్నారు.