Sanatan Dharma: సనాతన ధర్మం గురించి తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయి. హిందూ సంఘాలే కాకుండా ఈ వ్యాఖ్యలు బీజేపీ, డీఎంకే మధ్య మాటల యుద్ధానికి తెర లేపాయి. ఈ నేపథ్యంలో ఉదయనిధిపై ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు. సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడితే మంత్రులైనా ఉపేక్షించేది లేదంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఉదయనిధి వైఖరికి ధీటుగా సమాధానం ఇవ్వాలంటూ మంత్రులకు మోదీ సూచించారు.
అటు బీజేపీ మంత్రులు కూడా ఉదయనిధిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి ఉదయనిధికి వార్నింగ్ ఇచ్చారు. సాంప్రదాయాలు పాటించకపోయినా.. కనీసం గౌరవించడం నేర్చుకోవాలంటూ చెప్పారు. ఉదయనిధిని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతివ్వాలంటూ ఆయన తమిళనాడు గవర్నర్‌కు లేఖ రాశారు. హిందూ సాంప్రదాయాల్ని అగౌరవపర్చేలా మాట్లాడితే, తమిళనాడు ప్రభుత్వాన్ని రద్దు చేయించేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానంటూ చెప్పారు.
1991లో డీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేసిన సంఘటనను గుర్తు చేశారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రభుత్వాన్ని రద్దు చేయించే ప్రక్రియను మొదలు పెడతామంటూ హెచ్చరించారు సుబ్రమణ్యస్వామి. స్టాలిన్ వ్యాఖ్యలు తదుపరి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.