PM MODI: తెలంగాణ పసుపు రైతుల కల నెరవేరబోతుంది. కొన్నేళ్లుగా పసుపు రైతులు డిమాండ్ చేస్తున్న పసుపు బోర్డు ఏర్పాటు కాబోతుంది. తెలంగాణ పసుపు రైతుల డిమాండ్ మేరకు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్న ప్రధాని.. అధికారిక సభలో తెలంగాణకు వరాల జల్లు కురిపించారు. పసుపు రైతులు ఎదురు చూసిన నేషనల్ టర్మరిక్ బోర్డ్ ఏర్పాటుకు అంగీకరించారు. అలాగే సమ్మక్క-సారక్క పేరుతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.
ములుగు జిల్లాలో ఈ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతుంది. రూ.900 కోట్లతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని ప్రకటించారు. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా మార్చబోతున్నట్లు తెలిపారు. దీంతో తెలంగాణకు మోదీ కీలక వరాలు ప్రకటించినట్లైంది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. “తెలంగాణలో రూ.13,500 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. కేంద్రం చేపట్టే పథకాలతో ఎందరికో ఉపాధి దొరుకుతుంది. దేశంలో పండుగ సీజన్ మొదలైంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాం. తెలంగాణలో పసుపు అధికంగా పండుతుంది. పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నాం. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా పసుపు పంటకు డిమాండ్ పెరిగింది” అని మోదీ పేర్కొన్నారు.
తెలంగాణలోని నిజామాబాద్ ప్రాంతంలో పసుపు అధికంగా పండుతుంది. అయితే, పసుపు పంటకు మద్దతు ధర, సరైన ప్రోత్సాహం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తమకు పసుపు బోర్డు ఏర్పాటు కావాలని అక్కడి రైతులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో గత ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ధర్మపరి అర్వింద్.. తాను పసుపు బోర్డు ఏర్పాటు చేయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పసుపు బోర్డు ఏర్పాటు గురించి అక్కడి రైతులకు బాండ్ కూడా రాసిచ్చారు. అయితే, అర్వింద్ ఎంపీ అయి నాలుగేళ్లు దాటినా పసుపు బోర్డు ఏర్పాటు కాకపోవడంతో అక్కడి రైతులు ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు. ధర్మపురి అర్వింద్‌కు వ్యతిరేకంగా పసుపు రైతులు ఉద్యమాలు చేశారు. పలు పర్యటనల్ని అడ్డుకున్నారు. ఈ అంశం అర్వింద్‌కు పెద్ద ఇబ్బందికరంగా మారింది. అయితే, తాను హామీ ఇచ్చినట్లుగా పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని ప్రకటన చేయడంతో అర్వింద్‌కు, బీజేపీకి రాజకీయంగా మేలు జరిగే అవకాశం ఉంది. ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అన్నింటికీ మించి పసుపు రైతులు లబ్ధి పొందుతారు.