Rs 2000 Notes: కొట్టారుగా.. అదిరిపోయే దెబ్బకొట్టారుగా..! నోట్ల కట్టలు ఎరవేసి ఓట్లకు గాలం వేద్దామనుకున్న రాజకీయ నాయకులకు ఒక్క నిర్ణయంతో షాక్ ఇచ్చారు మోదీ.. అటు జగన్, ఇటు కేసీఆర్.. ఇద్దరిదీ కక్కలేని, మింగలేని పరిస్థితి. రూ.2వేల నోట్ల రద్దు నిర్ణయం ఎందుకు తీసుకున్నారు.. దానివల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావమెంత అన్నది పక్కన పెడితే పొలిటికల్ పార్టీలకు మాత్రం మోదీ గట్టి షాకే ఇచ్చారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంలకు మాత్రం దిమ్మతిరిగిపోయేలా దెబ్బ కొట్టారు. ఎన్నికల కోసం కట్టల గుట్టలు సిద్ధం చేసుకున్న నేతలు ఇప్పుడు తలపట్టుకుంటున్నారు.
మోదీ రూ.2వేల నోట్ల రద్దు నిర్ణయం వెనక కారణాలేమైనా.. రాజకీయ పార్టీలకు మాత్రం కాస్త గట్టిగానే షాక్ తగిలింది. లోక్‌సభ ఎన్నికలకు ఏడాది కూడా లేదు. అప్పటికి దాదాపు 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ ఎన్నికలకు పార్టీలు ఇప్పటికే సిద్ధమవుతున్నాయి. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్న నేతలు ఇప్పటికే వెనకేసిన నోట్లను పంపిణీకి సిద్ధం చేసుకున్నారు. ఈజీగా ఉంటుంది కాబట్టి రూ.2వేల నోట్లను దాచేశారు. చాలాకాలంగా చీకట్లో రెస్ట్ తీసుకున్న కట్టల పాములు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. కానీ 2వేల నోట్ల రద్దుతో నేతలకు మైండ్ బ్లాంక్ అయిపోయింది.
తెలంగాణలో ఈ ఏడాది చివరకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఈసారి పోరు మాములుగా ఉండదని అర్థమవుతోంది. రెండుసార్లు అధికారాన్ని అనుభవించిన కేసీఆర్.. హ్యాట్రిక్‌పై కన్నేశారు. అందుకోసం వ్యూహాత్మకంగా సిద్ధమయ్యారు. నియోజకవర్గానికి రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లైనా ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతోంది బీఆర్ఎస్. అందుకోసం ఇప్పటికే నగదు కూడా సిద్ధమైనట్లు పొలిటికల్ టాక్. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక నగదు తరలింపు ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందుగానే దాన్ని నియోజకవర్గాలకు తరలించాలన్నది పార్టీ ఆలోచన. అందులో మెజారిటీ నోట్లు రూ.2వేలే. ఇప్పుడు వాటిని రద్దు చేయడం ఊహించని నిర్ణయమే. రూ.2వేల నోట్ల రద్దు వార్తలు చాలాకాలంగా వినిపిస్తున్నా ఎవరూ దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. పోనీ ఇప్పటికిప్పుడు వాటిని నెమ్మదిగా మార్చుకుందాం అనుకున్నా అంత ఈజీ కాదు. వేలల్లోనో, లక్షల్లోనో అయితే మార్చుకోవచ్చు. కానీ కోట్లలో అంటే కష్టమే.. పైగా ఎన్నికలకు ఎక్కువ సమయం కూడా లేదు.
ఏపీ సీఎం జగన్‌ది మరో ఇబ్బందికర పరిస్థితి. టార్గెట్ 175 అని చెప్పుకుంటున్నా అధికారమే అనుమానమనేలా పరిస్థితులున్నాయి. టీడీపీ గట్టిగా పుంజుకుంది. జనసేన కూడా కలిస్తే కొట్టడం కష్టమని వైసీపీ భయపడుతోంది. అందుకే డబ్బుతో గట్టెక్కేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నియోజకవర్గానికి అవసరమైతే వంద కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టాలన్నది ఆ పార్టీ ఆలోచన అని పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ నాయకులు కూడా ఈసారి భారీగా పెద్ద నోట్లు వెదజల్లకపోతే గెలవడం కష్టమే అంటున్నారు. ఈ ప్రచారమే నిజమైతే 175 నియోజకవర్గాలకు నియోజకవర్గానికి వంద కోట్ల చొప్పున ఎన్ని వేల కోట్లు పంచాల్సి ఉంటుందో ఊహించండి. ఆ స్థాయిలో డబ్బంటే అప్పటికప్పుడు రాదు. ఎప్పట్నుంచో కూడబెట్టి ఉంచాలి.
పైగా చిన్ననోట్లైతే పంపిణీకి కష్టం. కాబట్టి ఇప్పటికే తాడేపల్లి ప్యాలెస్ రూ.2వేల నోట్ల కట్టలను సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. కట్టలు కాదు గుట్టలనే మరికొందరు చెప్పుకుంటున్నారు. మద్యం, ఇసుకపై వెనకేసిందంతా రూ.2వేల నోట్ల రూపంలోనే ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అంత నగదును ఎన్నికల సమయంలో తీసుకెళ్లాలంటే కష్టమే. కాబట్టి ఇప్పట్నుంచే జిల్లాలకు పంపుతున్నట్లు కూడా చెబుతున్నారు. టికెట్లు గ్యారెంటీ అని భావించిన కొందరు నేతలకు ఇప్పటికే కొంత మేర నగదు అందినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పెద్దనోట్ల రద్దుతో జగన్‌కు కొత్త కష్టాలు వచ్చిపడ్డట్లే. అయితే కేంద్రంతో సఖ్యత ఉంది కాబట్టి ఎలాగోలా వాళ్లకాళ్లు.. వీళ్లకాళ్లు పట్టుకుని ఆ నగదును మార్పిడి చేసుకోవచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే అది అంత ఈజీ కాదని చెబుతున్నారు. పార్టీ నేతల దగ్గర కూడా భారీగానే పెద్ద నోట్లు ఉన్నట్లు టాక్ నడుస్తోంది.
రూ.2వేల నోట్లు 25 జేబులో పెట్టుకుంటే అసలు జేబులో డబ్బులున్నట్లే తెలియదు. అదే 5వందల నోట్లంటే ఓ కట్ట కావాలి. కాబట్టి పెద్ద నోటు ఈజీ టు క్యారీ అన్నమాట. పంచడానికి చాలా సౌలభ్యంగా ఉంటుంది. దాచేయడానికి ఎక్కువ స్పేస్ కూడా అవసరం లేదు. అయితే ఇంతకాలం జాగ్రత్తగా దాచిన పెద్దనోటును బ్యాంకుకు పంపాల్సిందే. కానీ పెద్ద మొత్తంలో మార్చుకోవాలంటే కాస్త కష్టమే. మోదీ కూడా రాజకీయ కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో వేయి రూపాయల నోట్లున్నప్పుడు బ్లాక్ మనీ కింద వాటిని దాచేవారు.
కానీ రూ.2వేల నోటు రావడంతో వారి పని మరింత సులభమైంది. దీనిపై పలు విమర్శలు కూడా వచ్చాయి. పైగా వందల కోట్లలో బ్లాక్‌మనీ బయటపడ్డ చోట్ల ఎక్కువగా కనిపించింది రూ.2వేల నోట్లే. రిజర్వ్‌బ్యాంక్ వాటి ప్రింటింగ్ ఆపివేసి చాలా కాలమైంది. మార్కెట్లో 245కోట్ల 2వేల నోట్లు ఉన్నాయి. కానీ చలామణిలో ఉన్నది మాత్రం చాలా తక్కువ. చాలావరకు అక్రమార్కుల బ్యాంకు లాకర్లు, బీరువాలు, గోడౌన్లు, పరుపుల్లో మూలుగుతోంది. ఇప్పుడు దాన్నంతా బయటకు తీయాల్సిన పరిస్థితి. మొన్నటి కర్ణాటక ఎన్నికల ప్రభావం కూడా మోదీ నిర్ణయానికి కారణమై ఉండొచ్చంటున్నారు. అక్కడ జరిగిన నగదు పంపిణీ తీరును అంచనా వేసిన తర్వాత నోట్ల రద్దుపై నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.