G20 Summit: ముగిసిన జీ20 సదస్సు.. ఢిల్లీ డిక్లరేషన్‌కు ఆమోదం..!

ఆదివారం మధ్యాహ్నం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఈ సదస్సు ముగిసింది. తర్వాతి జీ20 సదస్సు అధ్యక్షత బాధ్యతలను ప్రధాని మోదీ.. బ్రెజిల్​ అధ్యక్షుడు లులా డా సిల్వకు గావెల్‌కు అప్పగించారు.

  • Written By:
  • Publish Date - September 10, 2023 / 03:59 PM IST

G20 Summit: భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 సదస్సు ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఈ సదస్సు ముగిసింది. తర్వాతి జీ20 సదస్సు అధ్యక్షత బాధ్యతలను ప్రధాని మోదీ.. బ్రెజిల్​ అధ్యక్షుడు లులా డా సిల్వకు గావెల్‌కు అప్పగించారు. మోదీ నుంచి జీ20 గావెల్​ను అందుకున్న బ్రెజిల్​ అధ్యక్షుడు సిల్వా మాట్లాడుతూ ప్రధా మోదీనిపై ప్రశంల వర్షం కురిపించారు. ప్రస్తుతం జీ20 సదస్సు ముగిసినప్పటికీ వచ్చే నవంబర్‌‌లో వర్చువల్‌గా మరోసారి సమావేశం నిర్వహించాలని మోదీ ప్రతిపాదించారు. ఎందుకంటే వచ్చే నవంబర్ చివరి వరకు జీ20 సదస్సు బాధ్యతలు ఇండియా చేతిలోనే ఉంటాయి. ఈ ఏడాది డిసెంబర్ నుంచి సదస్సు బాధ్యతలు బ్రెజిల్‌కు బదిలీ అవుతాయి.
శనివారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో దేశాధినేతలకు విందు సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం ఆదివారం ఉదయం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో దేశాధినేతల్ని ప్రధాని మోదీ రిసీవ్ చేసుకున్నారు. అక్కడ నేతలంతా మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. తర్వాత భారత మండపం వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఇక్కడి ఎగ్జిబిషన్‌ను నేతలు సందర్శించారు. ఈ ఎగ్జిబిషన్‌లో భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబించేలా తీర్చిదిద్దారు. సదస్సులో పాల్గొన్న జో బైడెన్ భారత్ నుంచి వియత్నాం బయలుదేరారు.
సదస్సు ముగింపు సందర్భంగా ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు.

ఈ సందర్భంగా ఢిల్లీ డిక్లరేషన్ ప్రకటించారు. దీని ప్రకారం దేశాలు సరిహద్దు, ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి ఉండాలని, సరిహద్దుల్ని ఆక్రమించేందుకు బలగాల్ని ప్రయోగించకూడదని ప్రతిపాదించారు. ప్రధానంగా ఐదు అంశాల ప్రాతిపదికగా ఈ డిక్లరేషన్ రూపొందింది. బలమైన, స్థిరమైన, సమతుల్య, సమగ్ర అభివృద్ధి సాధించడం, వేగవంతమైన అభివృద్ధి, సుస్థిర భవిష్యత్తు కోసం హరిత అభివృద్ధి ఒప్పందం, 21వ శతాబ్దానికి బహుపాక్షిక సంస్థలు, బహుపాక్షికతను పునురుద్ధరించడం వంటి అంశాల ప్రాతిపదికగా ఢిల్లీ డిక్లరేషన్ రూపొందింది. దీనికి సదస్సులోని భాగస్వామ్య దేశాలు అంగీకారం తెలిపాయి.

సదస్సులో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఒకే భూమి–ఒకే కుటుంబం అనే భావనపై చర్చించారు. దీనిపై జీ20 సదస్సు ఆశావహ దృక్పథంతో ఉన్నందుకు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు మోదీ తెలిపారు. యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. స్వాతి అస్తు విశ్వ.. అంటే ప్రపంచమంతా శాంతిని నెలకొల్పుదాం అనే నినాదంతో మోదీ ఈ సమావేశాల్ని ముగించారు. భారత్ ఈ సదస్సును ఘన విజయం చేసిందనే చెప్పాలి.