Party Funds: ఎన్నారైల నిధుల కోసం పార్టీల పాట్లు.. అమెరికాలో నిధులు సేకరిస్తున్న పార్టీలు.. కులాలవారీగా మద్దతు..!

ఎన్నికలంటే ఏ పార్టీ అయినా భారీగా ఖర్చుపెట్టాల్సిందే. అందుకే ఇప్పుడు నిధుల కోసం రాజకీయ పార్టీలు ఎన్నారైలపై గురిపెట్టాయి. ముఖ్యంగా అమెరికాలో స్థిరపడ్డ భారతీయుల నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు సేకరించేందుకు ప్లాన్ చేస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - July 11, 2023 / 03:46 PM IST

Party Funds: ఏడాదిలోపు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. మరి ఎన్నికలంటే ఏ పార్టీ అయినా భారీగా ఖర్చుపెట్టాల్సిందే. ఇలా ఖర్చు పెట్టాలంటే నిధులు కావాలి. అందుకే ఇప్పుడు నిధుల కోసం రాజకీయ పార్టీలు ఎన్నారైలపై గురిపెట్టాయి. ముఖ్యంగా అమెరికాలో స్థిరపడ్డ భారతీయుల నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు సేకరించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. నిధుల సేకరణతోపాటు దేశంలో, తమ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీల దగ్గర్నుంచి టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్నారైల దగ్గరి నుంచి నిధులు సేకరించే పనిలో ఉన్నాయి.
నాయకుల విదేశీ పర్యటనలు
అమెరికాలో తెలుగువారికి సంబంధించిన నాటా, తానా, ఆటా వంటి సంస్థలతోపాటు వివిధ భారతీయ సంస్థలు ప్రతి సంవత్సరం ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తుంటాయి. ఈ సభలకు రాజకీయ నాయకులు హాజరవుతున్నారు. ముఖ్యంగా పార్టీల అధినేతలు, కీలక నేతలు సభలకు వెళ్తున్నారు. అక్కడ స్థిరపడ్డ తెలుగువారు, భారతీయులతో సమావేశమవుతున్నారు. వారికి తమ పార్టీ సిద్ధాంతాలు, అవసరాల గురించి వివరించి ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరుతున్నారు. తమ పార్టీ గెలుపుకోసం అవసరమైన సాయం చేయాలి అని అడుగుతున్నారు. తాజాగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి తెలుగువారితో సమావేశమయ్యారు. ఆ పార్టీకి అనుకూలంగా ఉండేవారితో చర్చలు జరిపారు. టీడీపీ తరఫున బాలకృష్ణ కూడా అక్కడ పర్యటిస్తున్నారు. తమిళనాడుకు సంబంధించి డీఎంకే తరఫున సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి నిధలు సేకరిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఇదే తరహాలో అమెరికాలో పర్యటించారు. అక్కడ తమ పార్టీ మద్దతుదారులు, యూపీకి చెందిన వారితో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం సహకరించాల్సిందిగా కోరారు. ఎన్ఆర్ఐలతో సమావేశమై వారి మద్దతు కూడగడుతున్నారు. విరాళాలు సేకరిస్తున్నారు. కాంగ్రెస్ భావజాలం నచ్చిన వాళ్లు రాహుల్ గాంధీకి సాయం అందిస్తున్నారు. మోదీ నిత్యం విదేశాల్లో పర్యటిస్తుంటారనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కూడా ప్రధాని అక్కడ స్థిరపడ్డ భారతీయులతో సమావేశమవుతుంటారు. తన రాష్ట్రం గుజరాతీలతోనూ ముచ్చటిస్తుంటారు. నిధుల సేకరణతోపాటు, ఇండియాలో పెట్టుబడులకు ఆహ్వానిస్తారు.
152 దేశాల్లో భారతీయులు
అమెరికా, యూరప్‌తోపాటు మొత్తం 152 దేశాల్లో భారతీయులు స్థిరపడ్డారు. వీరిలో బాగా స్థిరపడ్డ కుటుంబాలు బోలెడు. కొన్ని దేశాల్లో రియల్ ఎస్టేట్, ఐటీ, హోటల్స్ వంటి బిజినెస్‌లలో రాణిస్తున్నారు. పరిశ్రమల్ని స్థాపిస్తున్నారు. వీళ్లంతా సంపన్నులు కావడంతో వీరి నుంచి పార్టీలు నిధులు సేకరిస్తున్నాయి. అలాగే కొందరే దేశంలో పెట్టుబడులు పెడుతూ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు. వీరికి భారత ప్రభుత్వం తగిన సహకారం అందిస్తోంది. ఎన్నారైలకు దేశం మీద, తమకు నచ్చిన పార్టీ మీద ఉన్న అభిమానం వల్ల నిధులు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇంకొందరు అవసరమైతే నేరుగా ఇండియాలో పోటీ చేయడమో.. లేక తమకు కావాల్సిన వాళ్లకు సీట్లు ఇప్పించుకోవడమో కూడా చేస్తున్నారు.
కులాల వారీగా మద్దతు
అమెరికాసహా విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులు, తెలుగు వాళ్లు అంతా ఒకటే అనుకుంటే పొరపాటే. విదేశాల్లో ఉన్నప్పటికీ కొందరు తమ కులజాఢ్యాన్ని వదలడం లేదు. అక్కడ కూడా కులాలవారీగా సంఘాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మన దేశపు రాజకీయాలకు సంబంధించి తమ కులం వారికే మద్దతు ఇస్తున్నారు. తమ సామాజికవర్గానికి చెందిన నేతలు, పార్టీలకే నిధులు సమకూరుస్తున్నారు. గతంలో మతం పరంగా మాత్రమే అక్కడ మనవాళ్లు బేధం చూపించేవాళ్లు. కానీ.. రానురాను కులాలవారీగా విడిపోయారు. తమకు కావాల్సిన వారి కోసమే నిధులు సేకరించి ఇస్తున్నారు. రాజకీయంగా, సినిమాల పరంగా కూడా కులాల్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇటీవలి కొన్ని సభల్లో రాజకీయాలు, సినిమాల పరంగా కొందరు తెలుగువాళ్లు గొడవపడ్డ సంగతి తెలిసిందే. తెలుగుకు సంబంధించి కమ్మ, రెడ్లు, కాపులు, వెలమలు అంటూ అక్కడివాళ్లు విడిపోయి తమ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.