Political Parties: తెలంగాణలో బీసీ మంత్రం.. ఏపీలో కాపు మంత్రం.. అధికారం కోసం పార్టీల పాట్లు..?

రెండు రాష్ట్రాల్లోనూ అత్యధిక జనాభా ఉన్న సామాజికవర్గాలు మాత్రం అధికారానికి దూరంగానే ఉన్నాయి. తెలంగాణలో బీసీలు, ఏపీలో కాపులు అధిక జనాభా కలిగి ఉన్నారు. అయినప్పటికీ అధికారం మాత్రం అందని ద్రాక్షగానే ఉంది. ఇప్పటికీ రాజకీయాల్ని శాసించే స్థాయిలో మాత్రం లేరు.

  • Written By:
  • Publish Date - August 17, 2023 / 03:32 PM IST

Political Parties: తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా సామాజిక సమీకరణాలు చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ అంతగా కులాల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఏపీలో అయితే.. కులాన్ని బట్టే ఓటేసే వారి సంఖ్య అధికం. అందుకే ప్రస్తుతం రాజకీయ పార్టీలు కులాలపై ఫోకస్ చేస్తున్నాయి. అయితే, రెండు రాష్ట్రాల్లోనూ అత్యధిక జనాభా ఉన్న సామాజికవర్గాలు మాత్రం అధికారానికి దూరంగానే ఉన్నాయి. తెలంగాణలో బీసీలు, ఏపీలో కాపులు అధిక జనాభా కలిగి ఉన్నారు.

అయినప్పటికీ అధికారం మాత్రం అందని ద్రాక్షగానే ఉంది. ఇప్పటికీ రాజకీయాల్ని శాసించే స్థాయిలో మాత్రం లేరు. కారణం.. ఐక్యత లేకపోవడమే అనేది రాజకీయవర్గాలు చెప్పే మాట. తెలంగాణలో బీసీలు దాదాపు 53.5 శాతం ఉండగా, ఏపీలో కాపులు 24.7 శాతం ఉన్నట్లు ఒక అంచనా. ఇంత జనాభా ఉన్నా.. రాజకీయాల్లో వీరికి ఉన్న ప్రాధాన్యం తక్కువే. పార్టీలు కేవలం వీరి ఓట్లను కొల్లగొట్టేందుకు అవసరమైన సీట్లు మత్రమే ఇస్తున్నాయి. ఏపీకి సంబంధించి.. రెండు సామాజికవర్గాలు మాత్రమే ఇన్నేళ్లుగా అధికారం దక్కించుకుంటూ, ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నాయి. కొంతకాలంగా మాత్రం బలమైన కాపు సామాజికవర్గం అధికారం కోసం ప్రయత్నిస్తోంది. ఆ సామాజికవర్గానికి చెందిన పవన్ కళ్యాణ్.. జనసేన పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు.
బీసీలు, కాపుల ఓట్లపై కన్నేసిన పార్టీలు కొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ బీసీ మంత్రం జపిస్తున్నాయి. వీటిలో కాంగ్రెస్ పార్టీ బీసీలను ఆకర్షించడంలో ముందుంది. రాబోయే ఎన్నికల్లో అత్యధిక సీట్లు బీసీలకు కేటాయించాలని నిర్ణయించింది. బీజేపీ, బీఆర్ఎస్ కూడా వీలైనంత వరకు బీసీలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్.. బీసీలకోసం బీసీ బంధు పథకాన్ని ప్రకటించింది. ప్రతి ఎన్నికల సందర్భంలో బీసీలు తమ జనాభాకు తగ్గ సీట్లు ఇవ్వాలి అని అన్ని పార్టీలను కోరుతుంటాయి. అయితే, వారికి దామాషా ప్రకారం దక్కే సీట్లు మాత్రం తక్కువే. తెలంగాణలో బీసీల్లో ముదిరాజ్, యాదవ సామాజికవర్గం ఆధిపత్యం ఎక్కువ. అందువల్ల అన్ని పార్టీలు బీసీలకు సీట్లు కేటాయించేటప్పుడు ఈ రెండు సామాజికవర్గాలకు ప్రాధాన్యం ఇస్తాయి. మిగిలిన సామాజికవర్గాల్లో కొందరికి సీట్లు ఇచ్చి, బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. ఏదో ఒక పార్టీ సీట్లు ఇస్తే తీసుకోవడం తప్ప.. తమకు సామాజిక న్యాయం జరగడం లేదనే అసంతృప్తి బీసీల్లో ఉంది. ఐక్యత లేకపోవడం వల్లే ఈ పరిస్థితి అని బీసీల్లోని మేధావులు అంటున్నారు.

ఏపీకి సంబంధించి కాపుల ఓట్లను ఆకర్షించేందుకు అధికార వైసీపీ, టీడీపీ, జనసేన ప్రయత్నిస్తున్నాయి. కాపు, తెలగ, బలిజలు ఏపీలో అధికంగా ఉన్నారు. కాపులు ఎక్కువగా గోదావరి జిల్లాల్లో ఉన్నారు. ప్రస్తుతం కాపుల ఓట్లను ఆకర్షించేందుకు జనసేన, వైసీపీ ప్రయత్నిస్తున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య కాపులు చీలిపోయారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమివైపు ఒక వర్గం.. వైసీపీ వైపు మరో వర్గం ఉంది. అన్ని పార్టీల్లోనూ కాపులున్నారు. ప్రధానంగా జనసేనకు కాపులు మద్దతు ఇస్తున్నారు. కానీ, జనసేన, టీడీపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వస్తే చంద్రబాబు సీఎం అవుతారు. అందుకే కాపు సామాజికవర్గంలోని కొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తమ తరఫున పవన్ కళ్యాన్ సీఎం కావాలని ఆశిస్తున్నారు. అయితే, అందుకుతగ్గ పరిస్థితులు రాష్ట్రంలో లేవు. ఒకవేళ కూటమి తరఫున పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉంటే మాత్రం కాపులు అత్యధిక శాతం జనసేనకు మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఇదంతా రాబోయే ఎన్నికలనాటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. బలమైన సామాజికవర్గమే అయినప్పటికీ.. పార్టీల మధ్య చీలిపోవడంతో రాజకీయంగా ఎదగలేకపోతున్నారు. అధికారం దక్కించుకోలేకపోతున్నారు.