War Rooms: ఎన్నికల కోసం వార్ రూమ్స్ సిద్ధం చేస్తున్న పార్టీలు.. బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్, బీజేపీ

ఇప్పుడు పార్టీలు తెలంగాణలోనూ ఎన్నికల కోసం వార్ రూమ్స్ ఏర్పాట చేస్తున్నాయి. అంటే ఎన్నికలకు సంబంధించిన అన్ని అంశాల్ని ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తుంటారు. అభ్యర్థుల ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహాలు, చర్చలు వంటివన్నీ ఇక్కడినుంచే జరుగుతాయి.

  • Written By:
  • Updated On - July 26, 2023 / 03:32 PM IST

War Rooms: తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకపోయనా, అభ్యర్థుల ప్రకటన రాకపోయినా పార్టీలు మాత్రం ఎన్నికల సన్నాహాల్లో మునిగిపోయాయి. అధికార బీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళికతో వెళ్లేందుకు బీజేపీ, కాంగ్రెస్ సిద్ధమవుతున్నాయి. ఇందుకు అనుగుణంగా పార్టీ కార్యాలయాల్లో ప్రత్యేకంగా వార్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాయి. సాధారణంగా ఏదైనా ఒక ప్రత్యేక విభాగం కోసం, అవసరం కోసం ఏర్పాటు చేసే గదుల్ని వార్ రూమ్స్‌గా పిలుస్తుంటారు. ఇప్పుడు పార్టీలు తెలంగాణలోనూ ఎన్నికల కోసం వార్ రూమ్స్ ఏర్పాట చేస్తున్నాయి. అంటే ఎన్నికలకు సంబంధించిన అన్ని అంశాల్ని ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తుంటారు.

అభ్యర్థుల ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహాలు, చర్చలు వంటివన్నీ ఇక్కడినుంచే జరుగుతాయి. పార్టీ కార్యాలయంలో అనేక విభాగాలుంటాయి. ఎన్నికల సమయంలో దీనికోసం ప్రత్యేక పర్యేవేక్షణ, సిబ్బంది అవసరం. అందుకోసమే వార్ రూమ్స్ ఏర్పాటు చేసుకుని, ఎన్నికలపై సమీక్ష జరుపుతుంటారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయాల్లో వార్ రూమ్స్ ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ బీజేపీ కూడా ప్రధాన కార్యాలయంలో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేయబోతుంది. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో వార్ రూమ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. వార్ రూమ్ ఇంఛార్జిగా బీజేపీ జాతీయ ప్రతినిధి జాఫర్ ఇస్లాంను నియమించే అవకాశం ఉంది. ఈ విభాగంతో సమన్వయం చేసేందుకు మీడియా టీమ్‌ను కూడా ఎంపిక చేసింది. ఈ విభాగంలో జాతీయ నాయకురాలు శ్వేత పని చేస్తున్నారు. సోషల్ మీడియా విభాగాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తోపాటు యోగానంద్ పర్యవేక్షిస్తారు. బీజేపీ సీనియర్ నేతలు ఇంద్రసేనా రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి కూడా ఈ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తారు. ఎన్నికల కోసం బీజేపీ 22 కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ టీమ్స్ అన్నీ కలిపి ఎన్నికల కోసం ప్రతిరోజూ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తాయి. వీటిని అంతిమంగా హోంమంత్రి అమిత్ షా సమీక్షిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఇందిరా భవన్‌కు వార్ రూమ్‌ను మార్చబోతుంది. గతంలో కాంగ్రెస్ వార్ రూమ్ వేరే చోట ఉండేది. ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోనే వార్ రూమ్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో తిరిగి ఇందిరాభవన్‌కు మార్చబోతున్నారు. ఇటీవల వార్ రూమ్‌పై పోలీసులు దాడి చేసి అక్కడి కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వార్ రూమ్స్‌లో కంప్యూటర్ల ద్వారా సిబ్బంది నిరంతరం ఎన్నికల్లో పార్టీ తీరును అంచనా వేస్తారు. అవసరమైన సూచనలు చేస్తారు. సోషల్ మీడియా విభాగాన్ని కూడా వాడుకుని పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తారు.