Gaddar: రాజకీయ పార్టీలకు నిజమైన సిద్ధాంతాలుండవు. అవసరాలే ఉంటాయి. తమ ఉనికి కోసం ఏ సిద్ధాంతాన్నైనా ఒంటబట్టించుకుంటాయి. ఎవరినైనా అక్కున చేర్చుకుంటాయి. గద్దర్ మరణంలో పార్టీలు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం.
గద్దర్.. రాజకీయ పార్టీలపై పోరాడిన ఉద్యమకారుడు.. పార్టీల ప్రజా వ్యతిరేక విధానాల్ని తూర్పారపట్టారు. భూస్వామ్య వాదాన్ని, పెట్టుబడిదారి విధానాన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసిన మావోయిస్టులకు మద్దతిచ్చారు. ప్రజా ఉద్యమాలకు గొంతు కలిపారు. ప్రజలకోసం పోరాటాలు చేశారు. జీవితాంతం తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు. అలాంటి గద్దర్‌పై ప్రభుత్వాలు ఆగ్రహంతోనే ఉండేవి. ఆయనపై ఎన్నో కేసులు పెట్టాయి. చివరకు ఆయనపై బుల్లెట్ల వర్షం కురిసినా.. ప్రభుత్వాలు న్యాయం చేయలేకపోయాయి. పాతికేళ్లైనా నిందితుల్ని కూడా పట్టుకోలేదంటే ఆయన విషయంలో ఎంత వివక్ష చూపాయో అర్థం చేసుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు గద్దర్ మరణించారని తెలియగానే పార్టీలన్నీ గద్దర్ మరణం చుట్టూ రాజకీయం మొదలెట్టాయి. గద్దర్ జీవితాంతం ఎవరిపై పోరాడారో.. వారే ఇప్పుడు గద్దర్ మరణంతో.. ఆయన తమ వాడంటూ చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నాయి.
బూర్జువా వ్యవస్థపై, పాలకుల అవినీతి, అక్రమాలపై గద్దర్ పోరాడారు. అన్ని రాజకీయ పార్టీలపైనా నిరసన వ్యక్తం చేశారు. ప్రజల్ని చైతన్యం చేశారు. కుల వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించారు. దళితులు, బడుగు బలహీనవర్గాలకు అండగా నిలబడ్డారు. తన ఆట, పాటతో ప్రజల్ని చైతన్యపరిచారు. బూటకపు ఎన్‌కౌంటర్లను నిరసించారు. అన్యాయాలపై తిరగబడ్డ ఉద్యమకారుల్ని అణచివేయడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ హత్యల్నిఖండించారు. ఇవన్నీ ప్రభుత్వాలకు వ్యతిరకమైన పనులే. అందుకే ఆయనను ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకించాయి. గద్దర్ భావజాలం వ్యాప్తి చెందకుండా అడ్డుకున్నాయి. గద్దర్ వ్యతిరేకించిన.. గద్దర్‌ను వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు ఇప్పుడు ఆయన మరణాన్నే వాడుకునేందుకు ప్రయత్నించడం విశేషం.
కొత్తరాగం అందుకున్న పార్టీలు..
గద్దర్ మరణాన్ని వాడుకునేందుకు పార్టీలు పోటీ పడుతున్నాయి. గద్దర్ మరణించారని తెలియగానే కాంగ్రెస్ ముందుగా స్పందించింది. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రేతోపాటు కాంగ్రెస్ నేతలు రియాక్టయ్యారు. ఆయన భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి ఎల్బీ స్టేడియానికి తరలించారు. ఇది గ్రహించిన బీఆర్ఎస్ కూడా వెంటనే స్పందించింది. గద్దర్ అంత్యక్రియల్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ నేతలు కూడా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీసహా ఇతర పార్టీల నేతలు గద్దర్‌కు నివాళులు అర్పించేందుకు పోటీలు పడ్డారు. రాష్ట్రంలోని కీలక నేతలంతా గద్దర్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఇదంతా రాజకీయ పార్టీలు ఆడుతున్న డ్రామాగానే పరిగణించాలి.
నివాళులు అర్పిస్తే సరిపోతుందా..?
ఎన్‌కౌంటర్లను గద్దర్ వ్యతిరేకించారు. కానీ, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఎన్‌కౌంటర్లలో ఎన్నో బూటకపువి ఉన్నాయనేది నక్సల్స్ సానుభూతిపరులు చెప్పేమాటే. నక్సల్స్‌ను చంపడమే కాదు.. ఎంతోమంది విప్లవకారుల్ని, తిరుగుబాటు దారుల్ని ప్రభుత్వాలు దారుణంగా అణచివేస్తుంటాయి. ఇలాంటి వాటిని గద్దర్ వ్యతిరేకించారు. ఇన్నాళ్లూ గద్దర్ భావజాలాన్ని, సిద్ధాంతాల్ని అంగీకరించని పార్టీలు.. ఆయన మరణాన్ని వాడుకోవాలనుకోవడం పార్టీల స్వార్ధమే. నిన్నామొన్నటిదాకా గద్దర్‌ను ప్రజాస్వామిక వ్యతిరేక శక్తిగా చూశాయి ఈ పార్టీలు. అలాంటిది ఇప్పుడు పోటాపోటీగా వివిధ పార్టీలు గద్దర్ మరణాన్ని వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. గద్దర్‌ను అందరూ అభిమానిస్తారు. అందులో సందేహం లేదు. కానీ, కొన్ని సామాజికవర్గాల వాళ్లు ఆయనను సొంత మనిషిలా భావిస్తాయి. అలాంటి గద్దర్ మరణం విషయంలో సరిగ్గా స్పందిచకపోతే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి రాజకీయ పార్టీలు వేగంగా స్పందిస్తున్నాయి. పైగా ఆయన దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ కోణంలోనూ పార్టీలు ఆలోచిస్తున్నాయి. ఆయనకు సరైన గౌరవం ఇవ్వకుంటే జరిగే నష్టాన్ని అంచనా వేసిన పార్టీలు గద్దర్ అంత్యక్రియల్లో పాల్గొంటున్నాయి. అసలే ఇది ఎన్నికల సీజన్. అందుకే వీలైనంత వరకు క్రెడిట్ కొట్టేసేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. నివాళులు అర్పిస్తున్నాయి. అయితే, గద్దర్‌కు నివాళులు అర్పిస్తే సరిపోతుందా..? సమాజంలో ఆయన కోరుకున్న మార్పులకు రాజకీయ పార్టీలు నాంది పలకవా..?