Political Parties: జాతీయ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం పార్టీలు రెండుగా చీలిపోయాయి. బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి ఒకటైతే.. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు కలిసి ఇండియా పేరుతో కూటమిగా ఏర్పాడ్డాయి.
దేశంలోని ప్రధాన పార్టీలు దాదాపు ఏదో ఒక కూటమివైపు మొగ్గుచూపాయి. 11 పార్టీలు మాత్రమే తటస్థంగా ఉన్నాయి. అందులో మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు మూడున్నాయి. అవి తెలంగాణ నుంచి బీఆర్ఎస్, ఏపీ నుంచి వైసీపీ, ఒడిశా నుంచి బీజేడీ. మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ, బీఆర్ఎస్, వైసీపీతో కలిసి మూడు ప్రధాన పార్టీలు ఏ కూటమిలోనూ చేరకపోవడం విశేషం. ఎన్డీయే, ఇండియా కూటముల్లో మొత్తం 65 పార్టీలు చేరాయి. ఎన్డీయే కూటమిలో పార్టీలు, ఇండియా కూటమిలో 2 పార్టీలు చేరాయి. ఏ కూటమిలోనూ చేరకుండా మిగిలిపోయిన 11 పార్టీలకు సంబంధించి 91 మంది ఎంపీలున్నారు. ప్రస్తుతానికి ఈ పార్టీలు తటస్థంగానే ఉన్నాయి. ఇందులో వైసీపీ, టీడీపీ, బీఆర్ఎస్, బీజేడీ ఎంపీలు కలిసి మంది. మిగతా 28 మంది వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు.
నిజంగా తటస్థమేనా..?
ప్రస్తుతానికి కూటమిలో అధికారికంగా చేరకపోయినా.. కొన్ని పార్టీలు బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నాయి. వాటిలో వైసీపీ ముందుంటుంది. ఎన్డీయే కూటమిలో అధికారికంగా చేరలేదు. కానీ, ప్రతి విషయంలోనూ బీజేపీకి మద్దతిస్తోంది. పార్లమెంటులో కేంద్రం తీసుకొచ్చే బిల్లులకు బేషరతుగా మద్దతు ఇస్తూ వస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క విమర్శ కూడా చేయలేదు. వైసీపీ బీజేపీ వైపే ఉంటుందని స్పష్టమవుతోంది. ఇక టీడీపీ కూడా ప్రస్తుతం బీజేపీ మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. ఈ పార్టీ కూడా అధికారికంగా ఎన్డీయేలో చేరకపోయినా.. ఇది కూడా బీజేపీ, ఎన్డీయే కూటమివైపే ముగ్గు చూపుతుంది.
ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేడీ కూడా ఎప్పట్నుంచో బీజేపీకి మద్దతుగానే ఉంటుందన్న వాదన ఉంది. పార్లమెంటులో బీజేడీ అనేకసార్లు బీజేపీకి అనుకూలంగా ఓటు వేసింది. అయితే, తాము కేంద్రానికి సహకరిస్తున్నా.. కేంద్రం మాత్రం తమకు సహకరించడం లేదని బీజేడీ ఆరోపిస్తోంది. ఇకపై బీజేపీకి వ్యతిరేకంగా గళమెత్తుతామని చెప్పింది. ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. ఎన్డీయే కూటమిలో చేరకపోయినప్పటికీ గతంలో బీఆర్ఎస్.. బీజేపీకి అనుకూలంగానే వ్యవహరించింది. అయితే, కొంతకాలంగా బీజేపీని వ్యతిరేకిస్తూ వచ్చింది. మళ్లీ ఇటీవలి కాలంలో ఆ స్థాయి విమర్శలు చేయడం లేదు. అలాగని కాంగ్రెస్ పార్టీకి కూడా దగ్గరవడం లేదు. ప్రస్తుతానికి తటస్థంగానే ఉన్నప్పటికీ, భవిష్యత్తులో బీఆర్ఎస్ ఏ వైపు నిలబడుతుందో ఇంకా స్పష్టత లేదు.
మిగతా పార్టీల సంగతేంటి..?
ఈ పార్టీలతోపాటు ఎంఐఎం, శిరోమణి అకాళిదల్, జేడీఎస్, శిరోమణి అకాళిదళ్ (మాన్), ఆర్‌ఎల్‌పీ, ఏఐయూడీఎఫ్ పార్టీలు కూడా తటస్థంగానే ఉన్నాయి. బీఎస్పీ మాత్రం రాబోయే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పింది. ఉత్తర ప్రదేశ్ మాత్రమే కాకుండా, రాజస్థాన్, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో ఏ కూటమిలోనూ చేరకుండా పోటీ చేస్తామని ప్రకటించింది. ముస్లిం సామాజికవర్గ ఓట్లను ప్రభావితం చేయగల ఎంఐఎంను ఏ కూటమి లెక్క చేయడం లేదు. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమిలో ఎంఐఎం చేరే అవకాశం ఎలాగూ లేదు. ప్రతిపక్షాల నుంచి కూడా ఆహ్వానం అందలేదు. తమను అంటరానివారుగా చూస్తున్నారని, అందువల్లే ఇండియా కూటమికి దూరంగా ఉంటున్నామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చెప్పారు. ఎన్నికలకు ఇంకాస్త సమయం ఉన్న నేపథ్యంలో అప్పటి అవసరాలకు అనుగుణంగా తటస్థంగా ఉన్న పార్టీలు ఏదో ఒక కూటమిలో చేరిపోవచ్చు. అలాగే ఒక కూటమి నుంచి మరో కూటమిలోకి కొన్ని పార్టీలు మారినా ఆశ్చర్యపోనవసరం లేదు.