ఈ యుద్ధంలో ఒక్కో పార్టీది ఒక్కో వ్యూహం.. అభివృద్ధే గెలిపిస్తుందని బీఆర్ఎస్ అంటుంటే.. కేసీఆర్ పాలన మీద వ్యతిరేకత విజయాన్ని అందిస్తుందని కాంగ్రెస్, బీజేపీ ప్లాన్ చేస్తున్నాయ్. బీఆర్ఎస్ సంగతి ఎలా ఉన్నా.. బీజేపీ, కాంగ్రెస్ మాత్రం పోటాపోటీ వ్యూహాలతో జోరు మీద కనిపిస్తున్నాయ్. ఇప్పుడు రెండు పార్టీల టార్గెట్ ఒక్కటే.. పార్టీల్లోకి చేరికలను ఆహ్వానించడం.
బీజేపీ దీనికోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తే.. చాపకింద నీరులా కాంగ్రెస్ తన పని తాను చేసుకుపోతోంది. కర్ణాటక విజయం.. తెలంగాణలో కాంగ్రెస్‌కు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. సీనియర్లంతా నెమ్మదిగా ఐక్యతారాగం పాడుతున్నారు. బలగం సినిమాను గుర్తు చేస్తున్నారు. అంతా కలిసి ఒక్కతాటి మీద నడుస్తున్నారు. విభేదాలు పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం పనిచేయడానికి రెడీ అయ్యారు.
దీంతో హస్తం పార్టీకి మరింత ఊపు వచ్చింది. దీంతో ఒకప్పుడు పార్టీకి దూరం అయిన వాళ్లంతా.. ఇప్పుడు హస్తం గూటికి చేరుకుంటున్నారు. ఇదే బీఆర్ఎస్‌ను ముఖ్యంగా బీజేపీని టెన్షన్ పెడుతోంది. రాష్ట్రంలో బీజేపీకి బలం తక్కువగానే ఉంది. ఏదో కొన్ని స్థానాలు మినహా.. మిగిలిన స్థానాల్లో కమలం పార్టీకి బలం కానీ.. నాయకులు కాని లేరు. దీంతో ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెట్టింది బీజేపీ. కొందరిని లైన్‌లోకి కూడా తీసుకువచ్చింది.
ఐతే కర్ణాటక విజయం తర్వాత సీన్ మారిపోయింది. నిన్నటివరకు బీజేపీ వైపు చూసిన నేతలు.. ఇప్పుడు కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు. దీంతో హస్తం పార్టీలోకి భారీగా వలసలు పెరిగాయ్. ఖమ్మంలో పొంగులేటి కీలక అనుచరుడు.. మట్టా దయానంద్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మెదక్‌లో పటోళ్ల శశిధర్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇలా బీజేపీ వైపు చూసిన నేతలంతా.. ఇప్పుడు కాంగ్రెస్ వైపు నడుస్తున్నారు.
ఇదే ఇప్పుడు బీజేపీని టెన్షన్ పెడుతోంది. కాంగ్రెస్‌లోకి వలసలకు బ్రేకులు వేసేందుకు కమలం పార్టీ భారీ వ్యూహాలు రచిస్తోంది. చేరికలు లేకపోతే.. బీజేపీకి చాలా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా కరువయ్యే పరిస్థితి. ఇక బీఆర్ఎస్‌ది మరో టెన్షన్. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. ఇప్పుడు చేరికతో పార్టీలో జోష్ మొదలై.. అంతా యాక్టివ్ అయితే.. గడ్డు పరిస్థితులు తప్పవు. దీంతో కేసీఆర్ కూడా భారీ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.