Ponguleti Srinivas: కాంగ్రెస్‌లో చేరికపై రేపు పొంగులేటి ప్రకటన పోటీ చేయబోయేది ఎక్కడి నుంచి అంటే..

కాంగ్రెస్‌లో పొంగులేటి చేరికపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు మరో 24 గంటల్లో బ్రేక్‌ పడబోతుందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. అమిత్ షా సభకు ఒక్కరోజు ముందు.. అంటే బుధవారం పొంగులేటి కీలక ప్రెస్‌మీట్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయ్. కాంగ్రెస్‌లో చేరికపై.. తాను పోటీ చేయబోయే స్థానం గురించి.. పొంగులేటి క్లారిటీ ఇవ్వబోతున్నారు. నిజానికి ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.

  • Written By:
  • Publish Date - June 13, 2023 / 06:46 PM IST

పొంగులేటితో కాషాయ కండువా కప్పించాలని కమలం పార్టీ చాలా కష్టపడింది. చాలామందితో రాయబారం పంపించింది. చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్‌ కూడా వెళ్లి మాట్లాడారు. తన అనుచరులు బీజేపీ వైపు మొగ్గు చూపకపోవడంతో.. పొంగులేటి ఆలోచనలో పడ్డారు. చేతిలో చేయేసి నడవడమే ఉత్తమం అని ఫిక్స్ అయ్యారు. బుధవారం నిర్వహించబోయే ప్రెస్‌మీట్‌లో.. తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించబోతున్నారు పొంగులేటి. తాము ఎందుకు బీఆర్‌ఎస్ వీడాల్సి వచ్చింది. అధిష్ఠానంతో ఎందుకు గ్యాప్ పెరిగిందో వివరిస్తారు.

కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి ఉన్న కారణాలు, బీజేపీలో చేరడానికి ఉన్న సమస్యలు జనాల ముందు ఉంచే అవకాశాలు ఉన్నాయ్. కాంగ్రెస్ అధినాయకత్వంతో పొంగులేటి ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో తన అనుచరులకు ఎక్కువ మందికి టికెట్స్ ఇవ్వడానికి హస్తం పార్టీ పెద్దలు అంగీకరించినట్లు టాక్. పొంగులేటి కూడా ఈసారి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్‌ గెలిచి.. మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయనపై పోటీకి పొంగులేటి రెడీ అయినట్లు కనిపిస్తోంది.

పొంగులేటితోపాటు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు కాంగ్రెస్‌ పార్టీలో భారీగా చేరబోతున్నారని తెలుస్తోంది. అదే జరిగితే.. ఈ పరిణామం కాంగ్రెస్‌కు మంచి బూస్ట్‌లా పనిచేయడం ఖాయం. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం తర్వాత నుంచి పొంగులేటి పార్టీకి దూరంగా జరుగుతూ వచ్చారు. ఆయన మౌనంపై చాలా ఊహాగానాలు వినిపించాయ్. ఐతే చివరికి కాంగ్రెస్ వైపు మొగ్గుచూపేందుకు పొంగులేటి సిద్ధం అయ్యారు. పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కూడా.. హస్తం పార్టీలో చేరికకు సంబంధించి.. ఒకేసారి ప్రకటన చేయబోతున్నారని సమాచారం. ఐతే ఈ ముగ్గురితో పాటు ఇంకా ఎవరు.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

నిజానికి పొంగులేటిని కీ ప్లేయర్‌గా పెట్టుకొని.. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పాలని అమిత్ షా ప్లాన్ చేశారు. ఐతే ఇప్పుడు అదే అమిత్ షా సభకు ఒక్కరోజు ముందు.. పొంగులేటితో ప్రకటన చేయించి.. బీజేపీని దెబ్బతీయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.