Ponguleti Srinivas: భట్టితో పొంగులేటి కీలక భేటీ.. ఏం చర్చించారంటే..

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న ాకొద్దీ.. రాజకీయాలు వేగంగా మారుతున్నాయ్. కర్ణాటక ఫలితాల ప్రభావంతో తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త జోష్ కనిపిస్తోంది. కాంగ్రెస్ జోరు చూసి ఆ పార్టీలోకి వలసలు పెరిగిపోతున్నాయ్.

  • Written By:
  • Publish Date - June 22, 2023 / 02:01 PM IST

ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్ నాయకులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ.. చేరిక గురించి చర్చిస్తున్న పొంగులేటి.. ఇప్పుడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దల్లో భట్టి ఒక్కరు. కాంగ్రెస్ గెలిస్తే.. సీఎం రేసులో వినిపించే పేర్లలో టాప్ త్రీ ఉంటారాయాన. అలాంటి వ్యక్తితో.. పొంగులేటి ఏకాంతంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రస్తుతం నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేస్తున్న భట్టిని.. పొంగులేటి కలిసారు. కేతేపల్లి దగ్గర పాదయాత్ర శిబిరంలోని వీరిద్దరు భేటీ అయ్యారు. మండుటెండలో పాదయాత్ర కొనసాగించిన భట్టి విక్రమార్క కాస్త అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న పొంగులేటి.. కాంగ్రెస్‌లో చేరికపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది.

ఇద్దరు నేతలది ఖమ్మం జిల్లానే కావడం.. ఇద్దరు ఏకాంతంగా భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి అధికారంలోకి తీసుకువచ్చే వ్యూహాల గురించి వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలపై కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అటు కాంగ్రెస్‌లోకి పొంగులేటి రాకను.. ఖమ్మం జిల్లాకు చెందిన సొంత పార్టీ నేతలే విభేదిస్తున్నారు. ఈ అంశం మీద కూడా ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం.