Ponguleti Srinivas Reddy: తెలంగాణలోని ఖమ్మం రాజకీయాలు కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి చుట్టూనే తిరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో పొంగులేటి సీనియర్ నేత. జిల్లా అంతా మంచి పట్టుంది. అన్ని నియోజకవర్గాల్లోనూ తన అనుచరులు ఉన్నారు. ఆర్థికంగానూ బలమైన నేత. మొన్నటివరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆయనకు కేసీఆర్ ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటూ వచ్చాడు. ఇటీవలే పొంగులేటిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో పొంగులేటి ఏ పార్టీలో చేరుతారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఒకవైపు కాంగ్రెస్.. మరోవైపు బీజేపీ ఆయన కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. మొదట్లో బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అంటూ మరో ప్రచారం ఊపందుకుంది. దీనికి తగ్గట్లే రాహుల్ గాంధీకి చెందిన టీమ్ పొంగులేటితో గత నెలలో భేటీ అయింది. నాలుగైదు గంటలపాటు చర్చలు జరిపింది. పొంగులేటి తన డిమాండ్లను రాహుల్ టీమ్ ముందు ఉంచారు. తనతోపాటు, జిల్లాలో తన అనుచరులకు సీట్లు ఇవ్వాలని ఆయన కోరారు. దీనికి రాహుల్ టీమ్ సానుకూలంగా స్పందించింది. మరోవైపు అదే జిల్లాకు చెందిన సీనియర్ నేత రేణుకా చౌదరితోనూ కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు జరిపింది. పొంగులేటి చేరికకు ఆమె కూడా సానుకూలంగానే స్పందించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే పొంగులేటి కాంగ్రెస్‌లో చేరడం ఖాయం అని ఓ నిర్ణయానికి వచ్చేశారంతా.
ఈ తరుణంలో బీజేపీతో చర్చించడం సంచలనంగా మారింది. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలోని బీజేపీ బృందం గురువారం ఉదయం పొంగులేటిని కలిసింది. పొంగులేటిని పార్టీలో చేరాల్సిందిగా కోరింది. పొంగులేటి డిమాండ్లకు బీజేపీ నేతలు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఇంతకాలం కాంగ్రెస్‌లో చేరుతాడు అనుకున్న పొంగులేటి ఇప్పుడు బీజేపీలో చేరుతారని ప్రచారం మొదలైంది. నిజానికి తనకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఆహ్వానం ఉన్న నేపథ్యంలో ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయించుకోలేదు. మరో వారంలో కర్ణాటక ఎన్నికలున్నాయి. ఆ తర్వాత ఫలితాలు వెలువడుతాయి. కర్ణాటక ఫలితాల తర్వాత దేశ రాజకీయాల్లోనూ మార్పులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆ తర్వాతే తాను ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అంతవరకు పొంగులేటికి బీజేపీ, కాంగ్రెస్.. రెండు ఆప్షన్స్ ఓపెన్‌గానే ఉంటాయి. గతంలో సొంత పార్టీ కూడా పెడతాడని ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఆచితూచి అడుగులేస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత తన అనుచరులతో చర్చించి, సరైన నిర్ణయం తీసుకుంటారు. అప్పటివరకు ఆయన ఏ పార్టీలో చేరుతారు అనేదానిపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి.