Ponguleti Srinivasa Reddy: ఖమ్మం నుంచి పొంగులేటి పోటీ.. అధికారిక ప్రకటనకు ముహూర్తం ఖరారు..!

తన రాజకీయ భవిష్యత్తుపై పొంగులేటి శ్రీనివాస రెడ్డి బుధవారం అధికారిక ప్రకటన చేయబోతున్నారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బుధవారం ఈ అంశంపై ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - June 13, 2023 / 09:21 AM IST

Ponguleti Srinivasa Reddy: తన రాజకీయ ప్రస్థానం విషయంలో ఇన్నాళ్లుగా నెలకొన్న సందిగ్ధతకు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెరదించబోతున్నారు. రాజకీయ భవిష్యత్తుపై బుధవారం అధికారిక ప్రకటన చేయబోతున్నారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బుధవారం ఈ అంశంపై ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. బుధవారం నిర్వహించే ప్రెస్‌మీట్‌లో పొంగులేటి, జూపల్లితోపాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్సీ కూడా పాల్గొంటారని తెలుస్తోంది.

ఈ నెల 15న ఖమ్మంలో అమిత్ షా నేతృత్వంలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా, 14న పొంగులేటి ప్రెస్‌మీట్‌ నిర్వహించబోతుండటం విశేషం. పొంగులేటి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే ఊహాగానాలకు కూడా బుధవారం తెరపడనుంది. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించిన అనంతరం ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని పొంగులేటి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తనతోపాటు తన అనుచరులకు కూడా ఖమ్మంలో సీట్లు ఇచ్చేలా పొంగులేటి కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించారు. పొంగులేటి ఖమ్మం నుంచి పోటీ చేస్తే ఈ సారి పోటీ రసవత్తరంగా ఉంటుంది. ఎందుకంటే ఖమ్మం నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. పువ్వాడ కూడా రాజకీయంగానే కాకుండా, ఆర్థికంగా కూడా బలమైన నేత. పైగా అధికార బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తుండటంతో ఈ నియోజకర్గ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా మారనుంది.

పొంగులేటితోపాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా భారీగా కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభలోనే పొంగులేటితోపాటు, జూపల్లి, ఇతర నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. ఈ సభను అత్యంత భారీగా నిర్వహించాలనుకుంటున్నారు. పొంగులేటిని బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నించారు. చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ పలుమార్లు చర్చలు జరిపారు. పొంగులేటి డిమాండ్లు అసాధ్యమైనవి కావడంతో బీజేపీ నుంచి స్పష్టమైన హామీ రాలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆయన డిమాండ్లను అంగీకరించింది. దీంతో పొంగులేటి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. పైగా కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ ఇమేజ్ పెరుగుతుండగా.. బీజేపీ ఇమేజ్ తగ్గడం కూడా పొంగులేటి నిర్ణయానికి ఒక కారణం.
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్
పొంగులేటి, జూపల్లి గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచారు. అయితే, గత ఎన్నికల్లో వారికి టిక్కెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత కూడా ప్రాధాన్యం దక్కలేదు. దీంతో బీఆర్ఎస్‪పై అసంతృప్తితో ఉన్న ఈ నేతలు అప్పుడప్పుడూ ఆ పార్టీపై విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇటీవల వీరిని బీఆర్ఎస్ తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకునేందుకు సమయం తీసుకున్నారు. అనేక అంశాలు పరిశీలించిన తర్వాత కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు.