Posani Krishna Murali: పోసానికి మెగా క్యాంప్ డోర్స్ క్లోజ్.. సినిమాల్లో అవకాశాలు లేవనే పవన్‌పై విరుచుకుపడుతున్నాడా..?

పవన్‌పై పోసాని ఇలా వ్యాఖ్యలు చేయడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో అనేకసార్లు పవన్‌పై తీవ్ర, అనుచిత విమర్శలు కూడా చేశారు. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు వైసీపీ నేతలకంటే ఘోరంగా వ్యక్తిగత విమర్శలు చేశారు. పవన్ భార్య, కూతురుపై కూడా విమర్శలు చేస్తూ మాట్లాడారు.

  • Written By:
  • Publish Date - July 13, 2023 / 06:21 PM IST

Posani Krishna Murali: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి సందర్భం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్నాడు. పవన్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ బుధవారం పోసాని ప్రెస్‌మీట్ పెట్టాడు. పవన్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. కూరలో కరివేపాకు అంటూ తీసిపారేశాడు. పవన్ ఓడిపోవడానికి టీడీపీయే కారణమని, ఆ పార్టీ పవన్‌ను ఓడించేందుకు రూ.15 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు.

వాలంటీర్లకు పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్‌పై పోసాని ఇలా వ్యాఖ్యలు చేయడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో అనేకసార్లు పవన్‌పై తీవ్ర, అనుచిత విమర్శలు కూడా చేశారు. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు వైసీపీ నేతలకంటే ఘోరంగా వ్యక్తిగత విమర్శలు చేశారు. పవన్ భార్య, కూతురుపై కూడా విమర్శలు చేస్తూ మాట్లాడారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలపై సినిమా ఇండస్ట్రీ నుంచే పోసానిపై విమర్శలు వచ్చాయి. పోసాని మరీ దిగజారుడు వ్యాఖ్యలు చేశారంటూ కొందరు మండిపడ్డారు. ఈ విషయంలో పెద్ద రచ్చే జరిగింది. అయితే, పవన్ వీటిని పట్టించుకోకుండా తన రాజకీయం తాను చేస్తుండిపోయాడు.

ఈ వ్యాఖ్యల ప్రభావం పోసాని సినీ కెరీర్‌పై గట్టిగానే పడింది. పవన్, చిరంజీవి కుటుంబంపై చేసిన ఈ వ్యాఖ్యల వల్ల మెగా క్యాంప్‌‌లో పోసానికి అవకాశాలు లేకుండా పోయాయి. మెగా హీరోల సినిమాల్లోనే కాదు.. అల్లు అరవింద్ వంటి నిర్మాతల చిత్రాల్లోనూ ఛాన్స్‌లు కరువయ్యాయి. అలాగే మెగా కుటుంబానికి సన్నిహితంగా ఉండే దర్శకనిర్మాతలు కూడా పోసానికి వేషాలు ఇవ్వడం మానేశారు. దీంతో గతంలోలాగా పోసానికి ఇప్పుడు అవకాశాలు లేవు. అలాగని పూర్తిగా అవకాశాలేమీ దూరం కాలేదు. అప్పుడప్పుడూ సినిమాల్లో చేస్తూనే ఉన్నారు. కానీ, పవన్‌పై, చిరు కుటుంబంపై విమర్శల వల్ల సగానికి సగం అవకాశాలు కోల్పోయాడనే చెప్పాలి. అయినప్పటికీ పోసాని వెనక్కు తగ్గడం లేదు. ఎలాగూ అవకాశాలు కరువయ్యాయనే అభిప్రాయానికి వచ్చిన పోసాని మరింతగా పవన్‌ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. జగన్‌ను పవన్ విమర్శించినప్పుడల్లా, వైసీపీ తరఫున పవన్‌‌పై విమర్శలు చేస్తూనే ఉన్నాడు.
ప్రయోజనం ఇది..!
పవన్‌పై విమర్శల ద్వారా సినిమాల్లో అవకాశాలు కోల్పోయిన్ పోసానికి దక్కింది మాత్రం ఒక చిన్న పదవి. పవన్‌పై విరుచుకుపడుతున్న పోసాని సేవల్ని గుర్తించిన ఏపీ సీఎం జగన్.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవిని పోసానికి కట్టబెట్టారు. పవన్‌ను విమర్శించే వాళ్లకు అంతకుమించిన ప్రయోజనాలే అందుంటాయనే విమర్శ ఉన్నా.. ఈ ప్రచారంలో నిజాల సంగతి ఎవరికీ తెలీదు. ప్రస్తుతం పోసాని కొన్ని సినిమాల్లో మాత్రమే అవకాశం దక్కించుకుంటున్నాడు. కొన్నేళ్లుగా చెప్పుకోదగ్గ పాత్ర ఒక్కటీ పడలేదు. ఏదో అలా నెట్టుకొస్తున్నారంతే.