ఉదయ్‌పూర్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లిన పవన్.. బీజేపీ టాప్ నేతలతో భేటీ కాబోతున్నారు. ఇదే ఇప్పుడు ఈ చర్చకు కారణం అవుతోంది. దక్షిణాదిలో పాగా వేయాలని బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. సౌత్‌లో తొలిసారిగా కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. దాన్ని నిలబెట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోందిప్పుడు ! ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న టార్గెట్‌తో వ్యూహాలను రచిస్తోంది. విక్టరీ కోసం ఉన్న అవకాశాలన్నింటినీ వాడుకోవాలని చూస్తోంది బీజేపీ.
అందులో భాగంగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని ప్రచారంలోకి దించాలని భావిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నాయ్. ఈ స్నేహంతోనే కర్ణాటకలో ప్రచారం చేయాలని రిక్వెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీకి పిలిపించి మాట్లాడింది ఇదేనా అనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఉత్తర కర్ణాటకలో తెలుగు ప్రాబల్యం ఎక్కువ. బళ్లారి నుంచి రాయచూరు, సింధనూరు, గంగావతి, దవణగిరి, గుల్బర్గ, బీదర్ వరకూ.. ఏపీ, తెలంగాణ సెటిలర్స్ ఓటర్లు కీలకం.
ఆ తెలుగు ఓట్లను ప్రభావితం చేసేలా స్టార్ క్యాంపెయినర్‌గా పవన్ ఉపయోగపడతారు అనేది బీజేపీ భావన. అందుకే ఆయన్ని ప్రచారానికి దింపాలని బీజేపీ ప్లాన్. 2018లో బీజేపీ, టీడీపీతో పొత్తులో ఉన్న పవన్.. మోదీ సూచనలతో ఆ ఎన్నికల్లో కన్నడనాట ప్రచారం నిర్వహించారు. కమలం పార్టీకి మంచి మైలేజ్ తీసుకువచ్చారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములా వర్కౌట్ చేయాలన్నది బీజేపీ ప్లాన్. ఢిల్లీ బీజేపీ పెద్దలతో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని.. రాష్ట్రస్థాయి నేతలతోనే అసలు సమస్య అని పవన్ బహిరంగంగానే చెప్తున్నారు.
ఇప్పుడు అదే ఢిల్లీ పెద్దలు.. సేనాని పిలిపించుకొని మరీ సూచనలు చేశారు. మరి దీనికి పవన్ అంగీకరిస్తారా.. కన్నడనాట ప్రచారంలో కాలు పెడతారా లేదా అన్నది కీలకంగా మారింది. ఏపీలో బీజేపీకి పవన్ దూరంగా ఉంటున్నా.. ఇప్పటికీ ఆ రెండు పార్టీలు పొత్తులోనే ఉన్నాయ్. ఆ విషయం గుర్తుంచుకోవాలి అనేది మరికొందరి వాదన !