Praja Vani: ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన ప్రజా దర్బార్ పేరు మారింది. ఇది ఇకపై ప్రజా వాణిగా కొనసాగనుంది. హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే ప్రజాభవన్ (గతంలో ప్రగతి భవన్)లో గత వారం రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. వేల సంఖ్యలో జనం ఇక్కడికొచ్చి దరఖాస్తులు సమర్పించారు.
GROUP 2: గ్రూప్ 2 పరీక్షపై రేవంత్ కీలక నిర్ణయం
గత శుక్రవారం ప్రజా దర్బార్ ప్రారంభం కాగా.. సోమవారం వరకు మొత్తం 4,471 వరకు దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఎక్కువగా పింఛన్లు, ధరణితో తలెత్తిన భూసమస్యలు, రెండు పడక గదుల ఇళ్లు మంజూరు, నిర్మాణం వంటి సమస్యలే ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రజా వాణిగా మార్చింది. దీనికి సంబంధించి కొన్ని నిబంధనల్ని కూడా మార్చింది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. వారంలో రెండు రోజులు ప్రజా వాణి నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ కార్యక్రమం ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలోపు ప్రజాభవన్ చేరుకున్న వారికి మాత్రమే వినతులు ఇచ్చే అవకాశం కల్పిస్తారు.
ప్రజా వాణి కార్యక్రమానికి వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటుచేయాలని, తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రగతి భవన్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను కూడా వినియోగిస్తున్నారు. ప్రజల వినతుల్ని డిజిటలైజ్ చేస్తున్నారు.