Prajavani Letter: కల్తీ మద్యం కిక్కు ప్రజావాణికెక్కింది..!

సాధారణంగా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా ప్రజావాణి, స్పందన, మీ ఈవో ఇలాంటి రకరకాల పేర్లతో ఏర్పాటు చేస్తారు. ఇందులో బాధితులు తమ కష్ట పరిస్థితులను అధికారులకు తెలియజేసేందుకు వచ్చి ఒక అర్జీ పత్రాన్ని ఇస్తారు. తద్వారా సమస్యకు పరిష్కారం పొందుతారు. ఇక్కడ సరిగ్గా అదే జరిగింది. అయితే ఇక్కడ కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. ఒక బాధితుడు తనకు కంపెనీ మద్యం లభించడం లేదని కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తూ ఒక వినతి పత్రాన్ని అందజేశాడు. అదే ఇప్పుడు వింతగా మారింది. ఇలా కూడా అర్జీని పొందుపరుస్తారా అని నోరెళ్లబెట్టుకునేలా చేసింది. విషయం పైకి చూడటానికి చిన్నదిగా కనపడవచ్చు. దీని పర్యావసానం చాలా పెద్దది. కుటుంబాలకు కుటుంబాలే రోడ్డున పడే ప్రమాదం ఉంది.

  • Written By:
  • Updated On - February 27, 2023 / 06:24 PM IST

ప్రజావాణిలో మద్యంపై వినతి పత్రం:
జగిత్యాలజిల్లాకి చెందిన బీరం రమేష్ అనే వ్యక్తి మద్యం దుకాణాల్లో కింగ్ ఫిషర్ బీర్లు దొరకడం లేదంటూ IDOCలో ఫిర్యాదు చేశాడు. సాధారణంగా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అదే సమయంలో ఒక యువకుడు వచ్చి సంక్షేమం, అభివద్ది మీదేనా అర్జీలు పెట్టుకునేది.. ఇలా మద్యంపై వినతి పత్రాలు ఇవ్వకూడదా అని అనుకున్నాడో ఏమో..! మంచి మద్యం లభ్యం అవ్వడం లేదని అడిషనల్ కలెక్టర్ బి. ఎస్.లతకు ఇచ్చిన లేఖలో తెలిపాడు. వైన్స్ షాపుల్లో అందుబాటులో లేని మద్యాన్ని వీలైనంత త్వరగా లభించేలా చర్యలు చేపట్టాలని కోరాడు.

సిండికేట్ గా కల్తీమద్యం విక్రయం:
ఇంతటితో ఆగక కోరుట్ల, ధర్మపురితో పాటూ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అన్నిరకాల మంచి బ్రాండ్లు అందుబాటలో ఉంటే కేవలం జగిత్యాలలో నాసిరకం కల్తీ మద్యం విక్రయిస్తున్నారని ఆరోపించారు. వీటిని తాగి మందుబాబులు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారంటూ తమ పరిస్థితిని వివరించాడు. ప్రతి చిన్న చిన్న గ్రామాల్లో కల్తీ మద్యం విక్రయించి సిండికేట్ గా వ్యాపారం చేస్తూ కొందరు ప్రజల ప్రా‎ణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. అలాగే తమ బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించాలని వేడుకోగా ఆమె ఎక్సైజ్ అధికారులతో మాట్లాడి ఈ సమస్యకు తగిన పరిష్కారాన్ని అందించాలన్నారు.

prajavani letter

కల్తీ మద్యంతో తీవ్ర సమస్యలు:
ఇప్పటి వరకూ చూసినది మంచి ఎంటర్టైన్మెంట్ గా అనిపించి ఉండవచ్చు. కానీ దీని వెనుక తీవ్ర విషాదం ఉంది. ఇలా కల్తీ మద్యం తాగి చాలా మంది పుస్తెలు తెగిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. కొందరైతే వింతగా ప్రవర్తింస్తూ ఉంటారు. మరికొందరికి యూరిన్ ఇన్ఫెక్షన్ వంటివి తలెత్తి కిడ్నీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. అందుకే ఇతను ఇలా స్పందించి ఉండవచ్చు. పాలకులు ఇలాగే ప్రవర్తిస్తే ఇలాంటి వారు మరికొందరు పుట్టుకు వస్తారు. తాగుబోతులే కదా అని చులకనగా చూడకూడదు. వీరి నుంచి వచ్చే ఎక్సైజ్ పన్నుల నుంచే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తుంది. కేవలం వీరి మద్యం సేవించడం ఆపేస్తే ప్రభుత్వ ఆదాయానికి గండి పడినట్లవుతుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ లాక్ డౌన్ పరిస్థితులే. అంతే కాకుండా కొంతమంది ఒక్కటిగా ఏర్పడి కింగ్ ఫిషర్ బ్రాండ్ బీర్లు అమ్మడం లేదు. కొన్నిప్రదేశాల్లో విక్రయిస్తున్నప్పటికీ దానిపై ఉన్న ధరకంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. దీనిని తీవ్రమైన ప్రజాదోపిడిగా పేర్కొన్నాడు. ఇదే ఇతని లేఖ సారాంశం.

ప్రదాన ఆదాయ వనరుగా మద్యం:
పేదలను దోచుకునేందుకే ప్రభుత్వం పనిచేస్తుంది ప్రయోజనాలను అందించడం కోసం కాదని ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. గతంలో దీనిపై దుబ్బాక ఎమ్మెల్యే స్పందించారు. ఇటీవలె జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా లెక్కలతో వివరంచారు. ప్రభుత్వం మద్యన్ని కేవలం ఆదాయ వనరుగా భావిస్తుంది. అందులో భాగంగానే మద్యం షాపులపై చూసి చూడనట్లు వ్యవహరింస్తుంది. పైగా వైన్స్ షాపు కాంట్రాక్టులన్నీ రాజకీయ నాయకులకే దక్కడం మరో కీలకమైన అంశం. రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసినా ఇదే తంతు మద్యం మాఫియా పేట్రేగిపోతుంది. గ్రామాల్లో చిన్న కిరాణా కొట్టు సైతం మద్యాన్ని విక్రయిస్తుందని విమర్శించారు రఘునందన్ రావు. తెలంగాణ ఏర్పడినప్పుడు 2014-15లో దీని ఆదాయం రూ. 10వేల కోట్లు కాగా, ప్రస్తుతం ఆదాయం రూ. 34 వేల కోట్లుగా మారిపోయింది. తెలంగాణ మొత్తం 2600కు పైచిలుకు వైన్స్ షాపులు ఉండగా కేవలం వీటి పరిధిలో మాత్రం లక్ష బెల్టు షాపులు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా పాలకులు స్పందించి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి. కనీసం మద్యం ధరలు తగ్గిచక పోయినా తీసుకున్న ధరకు మంచి మద్యాన్ని విక్రయించాలి. పరిస్థితులు ఇప్పటికైనా మారకపోతే భవిష్యత్తులో చాలా తీవ్రమైన పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది.

 

 

 

T.V.SRIKAR