ప్రకాశం బ్యారేజ్‌ బోటు ప్రమాదం వైసీపీ నేతల కుట్రే

ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీ కొట్టడం వెనక కుట్ర కోణం ఉందా ? బోట్లతో ఢీకొట్టి బ్యారేజీ గేట్లు కొట్టుకుపోయేలా చేసి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలి అని ప్లాన్‌ చేశారా ? ఈ ప్రశ్నలన్నిటికీ పోలీసుల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - September 9, 2024 / 12:13 PM IST

ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీ కొట్టడం వెనక కుట్ర కోణం ఉందా ? బోట్లతో ఢీకొట్టి బ్యారేజీ గేట్లు కొట్టుకుపోయేలా చేసి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలి అని ప్లాన్‌ చేశారా ? ఈ ప్రశ్నలన్నిటికీ పోలీసుల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ సేకరించిన అన్ని ఆధారాలు.. ఈ ఘటనలో అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. సీఎం చంద్రబాబు కూడా అనుమానం వ్యక్తం చేయడంతో ఈ కేసును మరింత వేగవంతం చేశారు పోలీసులు. బ్యారేజీని ఢీ కొట్టిన బోట్లు తమవే అంటూ ఇప్పటి వరకూ ఎవరూ క్లైమ్‌ చేసుకోడానికి రాలేదు.

ఒకవేళ ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదమైతే ఖచ్చితంగా బోట్లు తమవేనంటూ ఎవరో ఒకరు వచ్చేవాళ్లు. కానీ ఎవరూ రాకపోవడంతో పోలీసులు కుట్రకోణంలోనే దర్యాప్తు ప్రారంభించారు. బ్యారేజీని ఢీకొట్టిన మూడు బోట్లు ఉషాద్రి అనే వ్యక్తికి చెందిన బోట్లుగా గుర్తించారు. ఇక్కడ అన్నికంటే ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ ఏంటి అంటే.. ఉషాద్రి వైసీపీకి చెందిన వ్యక్తి. వైసీపీ అగ్ర నాయకులతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి. ఉషాద్రి, కర్రి నరసింహస్వామి, గూడూరు నాగమల్లేశ్వరిల బోట్లే బ్యారేజీని ఢీకొట్టినట్టు పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు.

ఈ ముగ్గురూ కూడా వైసీపీ ఎమ్మెల్సీ రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అనుచరులే. బోట్ల రిజిస్ట్రేషన్ల నెంబర్ల ద్వారా యజమానుల గుర్తించారు పోలీసులు. నార్మల్‌గా బోట్లను తీరంలో ఉంచే సమయంలో వాటిని విడివిడిగా కట్టేస్తారు. కానీ ఇప్పుడు మాత్రం మూడు బోట్లను జతచేసి ఒక్కటికగా కట్టారు. అంతే కాదు.. ఎవరైనా బోట్లను ఎప్పుడు కట్టేసినా చైన్‌తో బలంగా కడతారు. కానీ ఈ బోట్లు మాత్రం కేవలం చిన్న తాడుతో ఈజీగా ఊడిపోయేలా కట్టారు. స్థానికులు ఇచ్చిన ఈ సమచారంతో కుట్ర వెనక ఉన్నది వీళ్లేనని అనుమానిస్తున్నారు పోలీసులు.

కేవలం వాళ్ల బోట్లే నీళ్లలో కొట్టుకెళ్లే అనుమానం వస్తుందని.. వాటితో పాటు మరో రెండు బోట్లు కూడా కొట్టుకెళ్లేలా ప్లాన్‌ చేశారని చెప్తున్నారు. చివరికి బోట్లపై ఉన్న రంగులు కూడా వైసీపీ కలర్సే అవడంతో.. ఈ పని చేసింది వైసీపీ నేతలే అనే అనుమానిస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకూ సేకరించిన పూర్తి వివరాలతో నివేధికను సమర్పించారు. ఈ ప్రమాదంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు చాలా సీరియస్‌గా ఉన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందేనని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి నేపథ్యంలో ఈ ప్రమాదంలో వైసీపీ కార్యకర్తల హస్తం ఉందని తెలియడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి ఈ నివేదికపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.