తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. రాజకీయంగా ఇది పెద్ద దుమారానికే కారణం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడం, పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్ళే ప్రయత్నం చేయడంతో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. లడ్డు విషయంలో తప్పు జరిగింది అని కూటమి సర్కార్ అంటోంది. మేము తప్పు చేయలేదంటే చేయలేదని వైసీపీ అంటోంది.
ఇందుకోసం ప్రమాణం కూడా వైసీపీ నుంచి చేసారు. ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 28న తిరుమల కాలి నడకన వెళ్లేందుకు సిద్దమయ్యారు. రాజకీయంగా ఇప్పుడు వైసీపీని ఈ వ్యవహారం అంతం చేసే అవకాశం ఉందనే ఆందోళన ఆ పార్టీ అధిష్టానంలో నెలకొంది. ఇక ఈ వ్యవహారం ఇటు సినిమా పరిశ్రమను కూడా తాకింది. ఓ సినిమా కార్యక్రమంలో తమిళ స్టార్ హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఆ తర్వాత కార్తీ ఈ అంశంలో క్షమాపణ కూడా చెప్పారు.
ఇక ప్రకాష్ రాజ్ అయితే పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. బుధవారం ప్రకాష్ రాజ్ చేసిన కొన్ని కామెంట్స్ వివాదాన్ని మరింత పెద్దది చేసాయి అనే చెప్పాలి. తాజాగా కార్తీ క్షమాపణలు చెప్పడాన్ని కూడా ప్రకాష్ రాజ్ తప్పుబట్టారు. చేయని తప్పుకి క్షమాపణలు చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో… జస్ట్ ఆస్కింగ్ అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేసారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో కాస్త అతిగా రియాక్ట్ అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ముందు ప్రకాష్ రాజ్ మాట్లాడింది పవన్ కు అర్ధం కాకుండా విమర్శలు చేసారని పలువురు అసహనం వ్యక్తం చేసారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ప్రకాష్ రాజ్ సైతం ఫైర్ అయ్యారు.