Prashant Kishor: తెలంగాణపై పీకే జోస్యం.. ఆ పార్టీకి తిరుగుండదట..!

తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారం చెపట్టాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. బీజేపీకి క్యాడర్ లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్‌ పార్టీ.. మూడో సారి కూడా అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది.

  • Written By:
  • Publish Date - September 6, 2023 / 06:55 PM IST

Prashant Kishor: బీఆర్ఎస్‌కు రాజకీయ వ్యూహాలు అందిస్తున్న ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే).. అందరూ అనుకున్నట్టుగానే ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్‌కే వెయిటేజీ ఎక్కువగా ఉందన్నారు. కారు పార్టీ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలను ఆయన వెల్లడించారు. తెలంగాణలో కేసీఆర్‌కు తిరుగులేదని చెప్పారు. ప్రశాంత్‌ కిశోర్‌ మాటలంటే మజాకా..!! ఆయన 2012 నుంచి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు.

2012లో గుజరాత్‌ సీఎంగా నరేంద్రమోడీ వరుస విజయాలు సాధించడంలో పీకే కీలక పాత్ర పోషించారు. 2014లో దేశప్రధానిగా మోడీ ఎన్నికవడంలోనూ ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహాల మహత్తు ఉంది. బీజేపీ ప్రచారం ప్రభావవంతంగా జరిగేలా పీకే చక్కటి గైడెన్స్ అందించారు. బిహార్‌లో నితీశ్‌కుమార్‌ హ్యాట్రిక్‌ సీఎంగా గద్దెనెక్కడంలోనూ ఆయన పాత్ర ఉంది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా గద్దెనెక్కేందుకు పీకే కారణమయ్యారు. 2012 నుంచి ఇప్పటివరకూ ఒకటి రెండు చోట్ల తప్ప.. అన్ని ఎన్నికల్లో పీకే చెప్పిన పార్టీలే విజయం సాధించడం విశేషం.
కాంగ్రెస్ ఆశలు ఆవిరేనా..?
తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారం చెపట్టాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. బీజేపీకి క్యాడర్ లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్‌ పార్టీ.. మూడో సారి కూడా అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే కేసీఆర్ వ్యూహాలు ప్రతిపక్షాలకు అందని రేంజ్‌లో ఉంటాయన్న టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తుంటుంది. అందుకు తగ్గట్టుగానే ఈసారి ఎన్నికల్లో కూడా కేసీఆర్‌కు తిరుగుండదని.. బీఆర్ఎస్ మరోసారి ప్రభంజనం సృష్టించటం పక్కా అని ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు.
రాహుల్‌పై కీలక వ్యాఖ్యలు..
త్వరలో అసెంబ్లీ పోల్స్ జరిగే రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు గెలుపు ఛాన్స్‌లు ఎక్కువని పీకే అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ గెలుస్తుందని అనిపిస్తున్నా, బీజేపీ టైట్ ఫైట్ ఇస్తుందని.. చివర్లో ఫలితం మారినా ఆశ్చర్యం అక్కర్లేదని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో కచ్చితంగా బీజేపీ, కాంగ్రెస్ అమీతుమీ అన్నట్టుగా ఢీకొంటాయని చెప్పారు. తన ఫ్యూచర్ ప్లాన్ గురించి పీకే మాట్లాడుతూ.. ‘‘నేను భవిష్యత్తులో ఏ పార్టీకీ ఎన్నికల సమన్వయకర్తగా పనిచేయబోను. నేను ఆ పని మానేశాను. నా దృష్టి అంతా సొంత రాష్ట్రం బిహార్‌ అభివృద్ధిపైనే ఉంది. మా బిహార్‌లో సరైన వ్యవస్థను ఏర్పాటు చేస్తాను. అక్కడి ప్రజల కోసమే పనిచేస్తాను’’ అని తేల్చిచెప్పారు. జాతీయ రాజకీయాలపై పీకే కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష ఇండియా కూటమిని ముందుకు నడిపే సరైన నాయకుడు లేడని, రాహుల్‌కు ఆ సామర్థ్యం లేదన్నారు. విద్యార్థులు పరీక్షల ముందు అరగంటసేపు పుస్తకం పట్టినట్టు.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి కట్టారన్నారు.