Modi Manipur: క్రెడిట్ స్టీలింగ్‌కి మారుపేరుగా నిలిచే ప్రధాని మోదీ.. మణిపూర్ అల్లర్లకు మాత్రం బాధ్యత వహించడంలేదు.. ఎందుకో తెలుసా? రష్యా-యుక్రెయిన్ యుద్ధాన్ని కొద్ది గంటలపాటు ఆపాడని మోదీ గురించి డబ్బా కొట్టుకునే ఆయన అభిమానులు, ఆయన మీడియా మణిపూర్ అల్లర్ల విషయంలో మాత్రం మౌనంగా ఉంటూ వచ్చింది. ఇటివలి ఫ్రాన్స్ నిరసనలు కూడా మోదీ వల్లే ఆగిపోయాయని సోషల్ మీడియాలో కమల భక్తులు ప్రచారం చేసుకున్నారు. దేశానికి చెందిన క్రీడాకారులు ఏదైనా ఘనత సాధిస్తే అది తన ఖాతాలో వేసుకునే మోదీ.. మణిపూర్ అల్లర్ల విషయంలో మాత్రం ఇన్నాళ్లు మౌనంగానే ఉన్నారు. సుప్రీంకోర్టు చివాట్లు పెడితే కానీ ఆయన నోటిలో నుంచి మణిపూర్ అనే మాట రాలేదు. అది కూడా పార్లమెంట్ సమావేశాలకు ముందు మాట్లాడారు. ముగ్గురు మహిళలను వివస్త్రలుగా చేసి అందులో ఒకరిని అత్యాచారం చేసిన ఘటన బయటకు వచ్చిన తర్వాత ఎగిసిపడుతున్న ఆగ్రహజ్వాలలు చూసి మోదీ నోరు విప్పారు అంతే.
మణిపూర్ అల్లర్ల కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అసలు తమకు సంబంధం లేనట్టే ప్రవర్తించింది. నామ్‌కే వాస్త్‌గా హోంమంత్రి అమిత్‌షా మీటింగ్‌లు, రివ్యూలు అంటూ హడావుడి చేసినా అది కూడా బిల్డప్‌ల కోసమేనని తేలింది. ఇతర రాజకీయ పార్టీలను చీల్చే పనిలో నిత్యం బిజీగా ఉండే అమిత్‌షాకి మణిపూర్ అల్లర్ల గురించి పట్టించుకునే టైమ్ పెద్దగా ఉండి ఉండకపోవచ్చు. ఎప్పుడు ఏ కూటమిలో కుంపటి పెట్టి తగలపెడదామా అనే ఆలోచన తప్ప ఇతర విషయాలు ఏ మాత్రం పట్టించుకోని గొప్ప హోంమంత్రి మనకు ఉండటం ఏదో జన్మలో చేసుకున్న పాపం అని సర్దిచెప్పుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి అక్కడి ప్రజలది. ఇప్పటికైనా కేంద్రంలో చలనం వస్తుందా అంటే ఏమో చెప్పలేం. నిత్యం నిరసనలు, కాల్పులు, అల్లర్లతో మణిపూర్ రావణకాష్టంలా మారిపోయింది. అక్కడి ప్రజలు ఆనందంగా గడిపి నెలలు దాటిపోయింది.
నిజానికి మే3 నుంచే మణిపూర్‌లో పరిస్థితి అదుపుతప్పినా.. అప్పటి కర్ణాటక ఎన్నికల ప్రచారం జరుగుతుండటంపైనే కేంద్ర పెద్దలు ఎక్కువగా ఫోకస్ చేశారు. అక్కడి ప్రచారాల్లో సినిమాల గురించి కూడా ప్రస్తావించారు కానీ.. కనీసం ఆ తతంగం ముగిసిన తర్వాత ట్విట్టర్‌లోనైనా మణిపూర్ నిరసనలపై స్పందించే తీరిక, ఓపికా ప్రధానికి లేకుండాపోయింది. అమెరికా వెళ్లి ఇక్కడ ప్రజాస్వామ్యం గురించి గొప్పలు పోయిన మోదీ.. అసలు విషయాలను తొక్కిపెట్టారు. లోపల జరుగుతున్నది ఒకటైతే.. మోదీ చెప్పుకునేది, ఆయన మీడియా రాసేది మరొకటి. ఇంకెన్నాళ్లు గాంధీ సూక్తులు చెబుతూ ప్రపంచాన్ని మభ్యపెడతారు..? ఆయన బోధించిన విలువలను ఎప్పుడో పాతరేసి పాతిపెట్టిన కేంద్రం.. ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రల పట్ల చిన్నచూపు చూస్తూనే ఉంది. అందుకే ఈ అల్లర్లు..ఈ ఘోరాలు..!