బీఆర్ఎస్, బీజేపీ సంగతి ఎలా ఉన్నా.. మునుపటిత కంపేర్ చేస్తే కాంగ్రెస్ దూకుడు పెంచింది. ప్రతీ అంశంలో ఏదో ఒకలా హైలైట్ ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంకగాంధీ తెలంగాణకు రాబోతున్నారు. ఆమె రాకపై హస్తం పార్టీ శ్రేణులు బోలెడు ఆశలు పెట్టుకున్నాయ్. పార్టీకి జోష్ రావడం ఖాయం అని నమ్ముతున్నాయి. నిజానికి తెలంగాణలో బీఆర్ఎస్ తర్వాత ఆ స్థాయిలో బలంగా ఉన్నది కాంగ్రెస్సే ! క్షేత్రస్థాయిలో బలం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఐతే ముందుకు నడిపించే నాయకుడు లేడు అంతే ! ఐతే ప్రియాంక రాకతో.. పరిస్థితి అంతా సద్దుమణుగుతుందని.. అంతా ఒక్కతాటిపైకి వస్తారని.. హస్తం పార్టీ కార్యకర్తలు ధీమాగా కనిపిస్తున్నారు.
ఇక అటు దేశవ్యాప్తంగానూ కాంగ్రెస్ పరిస్థితి కాస్త కుదుటపడుతున్నట్లే కనిపిస్తోంది. కర్నాటకలోనూ సానుకూల పవనాలే వీస్తున్నాయ్. కర్నాటకలో అధికారం చేజిక్కింకుంటే.. దేశంలో ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయ్. అందుకే డూ ఆర్ డై అనే రేంజ్‌లో కర్నాటక ఎన్నికలను తీసుకుంటోంది కాంగ్రెస్. జూనియర్ ఇందిరాగాంధీ అని పేరు తెచ్చుకున్న ప్రియాంక గాంధీ.. స్వయంగా బాధ్యతలు చూసుకుంటున్నారు. కర్నాటకలో ప్రచార బాధ్యతలు ముగించుకున్న తర్వాత.. తెలంగాణ మీద దృష్టిసారించబోతున్నారు ప్రియాంక.
ఈ నెల 8న యువ సంఘర్షణ పేరుతో భారీ సభకు ప్లాన్ చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఉద్యోగాలు ఇవ్వకపోగా.. లీకేజీలతో యువకుల జీవితాలతో బీఆర్ఎస్ సర్కార్ ఆడుకుంటోందని నిలదీస్తూ.. నినదిస్తూ జరుపుతోన్న సభ ఇది. అదే రోజు పార్టీలో భారీగా చేరికలు ఉండే చాన్స్ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఆ తర్వాత కూడా తెలంగాణలో ప్రచార బాధ్యతలను పూర్తిగా ప్రియాంక గాంధీనే చూసుకుంటారనే చర్చ జరుగుతోంది.
అదే జరిగితే.. ఎన్నికల్లో హస్తం పార్టీకి మరింత లాభం అనే అంచనాలు వినిపిస్తున్నాయ్. నిజానికి తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. ఆ క్రెడిట్‌ను క్లెయిమ్ చేసుకోవడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలం అయింది. గ్రూప్ తగాదాలతో ఇక్కడి నేతలు ఆ విషయాన్ని పక్కనపెడితే.. ఢిల్లీ పెద్దలు, గాంధీ ఫ్యామిలీ సభ్యులు కూడా జనాల్లోకి చేరేలా ఆ విషయాన్ని వినిపించలేకపోయారు. ఐతే ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఒక లెక్క.. రాష్ట్రానికి కాంగ్రెస్ ఏం ఇచ్చింది.. ఎలాంటి త్యాగాలు చేసిందనే విషయాలపై ప్రియాంక గాంధీ దృష్టిసారిస్తే.. అది కాంగ్రెస్‌కు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయ్. బీఆర్ఎస్ మీద కొన్ని వర్గాల్లో వ్యతిరేకత మొదలైంది. ఈ వ్యతిరేకతకు తెలంగాణ సెంటిమెంట్‌ను ప్రియాంక యాడ్ చేయగలిగితే.. కాంగ్రెస్ స్పీడ్‌కు బ్రేకులు వేయడం కష్టమే! మరి ఈ టాస్క్ ప్రియాంక సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తారా.. ఎప్పటిలానే సీన్ రిపీట్ అవుతుందా అంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే మరి!