Priyanka Gandhi: తెలంగాణ నుంచి ప్రియాంకాగాంధీ పోటీ? కేసీఆర్ కోటలో పొలిటికల్ గేమ్ మారబోతోందా?

కర్ణాటకలో ఎన్నికల హడావుడి అయిపోగానే ఇక పూర్తి స్థాయిలో ప్రియాంకా గాంధీ తెలంగాణపై ఫోకస్ పెట్టబోతున్నారు. అందుకే మెదక్ లేదా మహబూబ్‌నగర్ నుంచి ప్రియాంకను పోటీకి నిలిపితే ఎలా ఉంటుందా అన్న చర్చ ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్‌లో జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - May 6, 2023 / 03:05 PM IST

Priyanka Gandhi: ‘తెలంగాణలో మరోసారి గులాబీ పార్టీ అధికారంలోకి రాకూడదు. హ్యాట్రిక్ విక్టరీ అన్నది బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లకూడదు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి చావు దెబ్బ రుచి చూపించాలి..’ తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల లక్ష్యాలు ఇవే. మోదీ, అమిత్ షా డైరెక్షన్‌లో తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించేందుకు కమలనాథులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే.. గాంధీ కుటుంబం కరిష్మాతో తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతోంది. తెలంగాణ నుంచి ప్రియాంకా గాంధీని ఎన్నికల బరిలో నిలిపే ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
మెదక్ లేదా మహబూబ్‌నగర్
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లేదా మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రియాంకను పోటీ చేయించాలని ఏఐసీసీ భావిస్తున్నట్టు ఢిల్లీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రియాంకకు సన్నిహితంగా ఉండే కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పటికే ఆమెతో ఈ విషయంపై చర్చించినట్టు సమాచారం. 2009లో కేసీఆర్ మహబూబ్‌నగర్ నుంచే పోటీ చేసి గెలుపొందారు. కర్ణాటకలో కాంగ్రెస్‌కు విజయావకాశాలు ఉన్నాయని గట్టిగా నమ్ముతున్న ఆ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంకను తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా ఇక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ మార్చవచ్చని భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తాయి. అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు వస్తే.. పార్లమెంట్‌ ఎన్నికలపై కచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించే ప్రియాంకను రంగంలోకి దించుతున్నారు.
నానమ్మ బాటలో ప్రియాంక
నానమ్మ ఇందిరా గాంధీ అడుగుజాడల్లో ప్రియాంకాగాంధీ నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఇందిరాగాంధీ.. 1980లో మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి విమర్శపాలైన ఇందిరాగాంధీని మెదక్ ప్రజలు అక్కున చేర్చుకుని పార్లమెంట్‌కు పంపించారు. ఒకరకంగా కాంగ్రెస్‌కు , మరీ ముఖ్యంగా ఇందిరాగాంధీకి పునర్జీవనాన్ని ఇచ్చింది మెదక్. ప్రస్తుతం కమలనాథులతో ఢీకొట్టలేక అన్ని రాష్ట్రాల్లో అధికారానికి దూరమవుతూ వస్తున్న సమయంలో ప్రియాంక రూపంలో పార్టీకి కొత్త ఆక్సిజన్ అందించాలని హైకమాండ్ భావిస్తోంది. అందుకే మెదక్ లేదా మహబూబ్‌నగర్ నుంచి ప్రియాంకను పోటీకి నిలిపితే ఎలా ఉంటుందా అన్న చర్చ ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్‌లో జరుగుతోంది.


ప్రియాంక.. ఫేస్ ఆఫ్ ది తెలంగాణ కాంగ్రెస్
కర్ణాటకలో ఎన్నికల హడావుడి అయిపోగానే ఇక పూర్తి స్థాయిలో ప్రియాంకా గాంధీ తెలంగాణపై ఫోకస్ పెట్టబోతున్నారు. తెలంగాణలో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి 20 రోజులకు ఒకసారి తెలంగాణకు వచ్చి వెళ్లాలని భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ప్రియాంక నేరుగా రివ్యూ చేయబోతున్నారు. ఒకరకంగా తెలంగాణ కాంగ్రెస్‌కు రాబోయే ఎన్నికల్లో ఫేస్ ఆఫ్ ది స్టేట్‌గా ప్రియాంక మారబోతున్నారు. ఈ నెల 8న సరూర్‌నగర్‌లో జరిగే యూత్ డిక్లరేషన్ సభలో పాల్గొనబోతున్న ప్రియాంకాగాంధీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎలాంటి అస్త్రాలు సంధించబోతున్నారో అన్న చర్చ నడుస్తోంది. తాము అధికారంలోకి వస్తే 3 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని కర్ణాటకలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అదే తరహా హామీని తెలంగాణలోనూ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌లో వెలుగు చూసిన కుంభకోణం, పరీక్షలు రద్దు కావడంతో తెలంగాణ యువత, నిరుద్యోగుల్లో గులాబీ సర్కార్‌ తీరుపై కొంత అసంతృప్తి ఉంది. దాన్ని ఓట్ల రూపంలో క్యాష్ చేసుకునే ప్రయత్నాలను కాంగ్రెస్ చేయబోతున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపిస్తే.. రాష్ట్ర రాతను తాము ఎలా మార్చబోతున్నామో ప్రియాంక నోటి మాటగా చెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈసారి ఎలాగైనా కేసీఆర్‌ను ఓడించాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ ముఖ్యనేతలు ప్రియాంక ఇచ్చే సలహాలు, సూచనల మేరకు ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేయబోతున్నారు.
రేవంత్ వ్యూహం కూడా అదేనా..?
తెలంగాణ కాంగ్రెస్ అంటేనే ఎవరి దారి వారిదే అన్నట్లు ఉంటుంది. ప్రతి సీనియర్ నాయకుడు రాష్ట్రానికే నేనే బాస్ అన్నట్లు వ్యవహరిస్తుంటారు. ఇక నేతల మధ్య విబేధాల సంగతి సరేసరి. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత లొల్లి మరింత పెరిగింది. రేవంత్‌ను వ్యతిరేకించే వర్గం.. సమర్ధించే వర్గంగా విడిపోయింది కాంగ్రెస్. కోమటిరెడ్డి లాంటి సీనియర్ నాయకుడు రేవంత్‌పై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అంతర్గత కుమ్ములాటలతో పార్టీకి నష్టమే తప్ప ఒక్క ఓటు లాభం కూడా ఉండదు. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించుకోకపోతే ఆ పార్టీ నేతలకు భవిష్యత్తు కూడా ఉండదు. చావోరేవో లాంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రియాంకా గాంధీని రంగంలోకి దించడం ద్వారా ఈ పరిస్థితిని మార్చవచ్చని రేవంత్ భావిస్తున్నారు. ఇటీవల నల్గొండలో జరిగిన సభతో రేవంత్, కోమటిరెడ్డి దగ్గరైనట్టు కనిపిస్తోంది. విబేధాలు పక్కన పెట్టి పార్టీని అధికారంలోకి తేవాలన్న ఢిల్లీ ఆదేశాలతో నేతలు నడుస్తున్నట్టు కనిపిస్తోంది. మొత్తం మీద ప్రియాంకా గాంధీ రాకతో తెలంగాణలో రాజకీయం మొత్తం తమకు అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్ కొండంత ఆశతో ఉంది.